దాచిన భూమి ‘దారి’కొచ్చింది
దాచిపెట్టిన సత్రం భూముల్లో 1.13 ఎకరాలు ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి
- తాజాగా ఈ మొత్తం కలుపుతూ సర్కార్ సవరణ నోటిఫికేషన్
- మిగతా 2.99 ఎకరాలపై ఇంకా కొనసాగుతున్న గోప్యం
- ‘సాక్షి’ కథనంతో బట్టబయలైన ప్రభుత్వ పెద్దల భూ‘దోపిడీ’
సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల రెండో విడత వేలంలో భూముల వివరాలను దాచేసి దోచేద్దామన్న సర్కారీ పెద్దల పన్నాగాన్ని ‘సాక్షి’ ససాక్ష్యంగా బహిర్గతం చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. రెండో విడత వేలం నోటిఫికేషన్‌లో దాచేసిన 4.12 ఎకరాల్లో 1.13 ఎకరాల భూమి వివరాలతో ప్రభుత్వం మంగళవారం అనుబంధ వేలం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో సర్కారు దురుద్దేశం బట్టబయలు కాగా, మిగిలిన 2.99 ఎకరాల భూ వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారనే అనుమానాలు కలిగించింది. సదావర్తి సత్రం భూములకు తిరిగి బహిరంగ వేలం నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసేసరికి 83.11 ఎకరాల భూమి వేలానికి విడుదల చేసిన రెండోవిడత నోటిఫికేషన్‌లో కేవలం 78.99 ఎకరాల సర్వే నంబర్ల వివరాలను మాత్రమే పొందుపరచడంపై ఈనెల 2న ‘సాక్షి’ ప్రచురించిన కథనం తెలిసిందే.
చెన్నై నగర సమీపంలో ఉన్న తాళంబూరు గ్రామ పరిధిలో సదావర్తి సత్రం పేరిట 37 వేర్వేరు సర్వే నంబర్లలో 78.99 ఎకరాల వివరాలతోనే ప్రభుత్వం గత నెల 28న రెండో విడత నోటిఫికేషన్ జారీచేయగా.. సాక్షి కథనం తర్వాత హఠాత్తుగా 1.13 ఎకరాల భూమి సర్వే వివరాలు వెలుగులోకి వచ్చాయంటూ ప్రభుత్వం మంగళవారం సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన 37 సర్వే నెంబర్లకు తోడు అదనంగా 22/11 సర్వే నెంబరు సత్రం పేరిట ఉన్న 1.13 ఎకరాలను వేలం ప్రక్రియలో చేర్చుతూ సవరణ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
2.99 ఎకరాలపై ఇప్పటికీ గోప్యతే
వేలానికి పెట్టిన 83.11 సత్రం భూముల్లో 2.99 ఎకరాల భూ వివరాలపై సర్కారు ఇప్పటికీ గోప్యత పాటిస్తోంది. మొత్తం 83.11 ఎకరాల భూమిలో 78.99 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లు మాత్రమే చెప్పగా.. ‘మిగతా రోడ్లు’ అంటూ 28వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సర్కార్ పేర్కొంది. అప్పుడు రోడ్లులో ఉందంటూ పేర్కొన్న 4.12 ఎకరాలలో ‘సాక్షి’ కథనం తర్వాత హఠాత్తుగా 1.13 ఎకరాల భూమి వివరాలు వెలుగులోకి రావడం అధికార వర్గాలను అశ్చర్యపర్చింది. ఈ అంశంపై సత్రం ఈవోని ‘సాక్షి’ ప్రతినిధి ఏమి అడిగినా.. ‘తాను సెలవులో ఉన్నాను. తననేమీ అడగవ’ద్దంటూ ముక్తసరి జవాబు ఇవ్వడంతోనే సరిపెట్టారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ కూడా దీనిపై స్పందించడానికి గతంలో నిరాకరించారు.
కీలక నిబంధనల్లో మార్పు
సదావర్తి సత్రం భూములకు రెండో విడత వేలం నిర్వహించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. సత్రం భూముల అమ్మకానికి 2016 మార్చి 28వ తేదీన జరిగిన వేలం ప్రక్రియకు కొనసాగింపుగానే 83.11 ఎకరాల భూమికి రూ.27.45 కోట్ల కనీస ధరగా నిర్ణయించి తిరిగి వేలం నిర్వహించాలని మాత్రమే కోర్టు ప్రభుత్వానికి సూచించిందని దేవాదాయ శాఖలోని పలువురు అధికారులే గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన వేలం ప్రక్రియను రద్దు చేయకుండా కోర్టు ఆదేశాల మేరకు తిరిగి వేలం నిర్వహిస్తుందంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వమైనా, దేవాదాయ శాఖ అయినా మొదట విడత వేలం నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను అలాగే కొనసాగించాలి.
కానీ, కొన్ని కీలకమైన నిబంధనలను మార్చేసి కొత్త నిబంధనలతో తిరిగి నోటిఫికేషన్ ఎలా జారీచేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాగా, వేలంలో నిర్ణయించిన ధర మొత్తాన్ని చెల్లించిన తర్వాత పాటదారుడు సొంత ఖర్చుతో ఆ భూములకు సత్రం ఈవో ద్వారా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని మొదటి విడత నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది. తాజాగా రెండో విడత వేలం నోటిఫికేషన్‌కు వచ్చేసరికి.. భూముల కొనుగోలు చేసిన వారికి దేవాదాయ శాఖ రిజిస్ట్రేషన్ చేయదని ఆ నిబంధనను మార్చేసింది. కోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి ప్రభుత్వం ఇంతటి కీలకమైన నిబంధనలను ఎలా మార్చుతుందని ఆ శాఖలోని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇలా అయితే భూములెవరు కొంటారు?
ఈ విషయంలో రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు.. వరుస పరిణామాలను చూస్తుంటే అత్యంత ఖరీదైన భూముల వేలంలో ఎవరూ పాల్గొనకుండా చేసి, తక్కువ ధరలకే ఆ భూములను తిరిగి దక్కించుకునే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వంలోని వారే రోజుకో నాటకానికి తెర తీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భూముల వివరాలను దాచిపెట్టి బహిరంగ వేలం నోటిఫికేషన్ జారీ అన్నది ప్రభుత్వ పెద్దల జోక్యం ఉంటే తప్ప అధికారుల స్థాయిలో ఇలాంటివి సాధ్యంకాదని ఆ శాఖకు చెందిన అధికారులే అంటున్నారు. భూములు రిజిస్ట్రేషన్ చేసేదిలేదని ప్రభుత్వమే చెబితే, దానికి సాధికారత ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయని భూములకు బ్యాంకుల నుంచి రుణాలు ఎలా సాధ్యమవుతాయని.. అంత భూమిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకొస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.