
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములు తమవంటూ ఇప్పుడు ముందుకొచ్చిన తమిళనాడు ప్రభుత్వంపై ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సదావర్తి భూముల వ్యవహారంలో పిల్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సదుద్దేశాన్ని నిరూపించుకునేందుకు తమ ఆదేశాల మేరకు డిపాజిట్ చేసిన రూ.27.44 కోట్లను తిరిగి చెల్లించే విషయంలో వచ్చే సోమవారం వాదనలు వింటామని హైకోర్టు స్పష్టంచేస్తూ విచారణను వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న అత్యంత విలువైన 83 ఎకరాల భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. రెండుసార్లు వేలం నిర్వహించినప్పుడు స్పందించ కుండా ఆ తర్వాత ఆ భూములు తమవని చెప్పడంలో అర్థమేంటని తమిళనాడు ప్రభుత్వం తరఫున హాజరయిన న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆ ప్రకటనలు ప్రభుత్వం దృష్టికి రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment