అర్హత లేకున్నా డీసీగా పదోన్నతి!
- వేములవాడ రాజన్న ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా ఓ అధికారికి దొడ్డిదారిలో ప్రమోషన్
- హైకోర్టును ఆశ్రయించిన కొందరు అధికారులు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖలో మరో అడ్డగోలు వ్యవహారం బట్టబయలైంది. తప్పుడు సీనియారిటీ జాబితా ఆధారంగా తాత్కాలిక పదోన్నతిపై కొనసాగుతున్న ఓ ఉన్నతాధికారికి ఏకంగా డిప్యూటీ కమిషనర్ పోస్టు కట్టబెట్టి దేవాదాయశాఖ అభాసుపాలైంది. తదుపరి ఖాళీ అయ్యే మరిన్ని డీసీ పోస్టులనూ ఇలాంటి వారికే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు వెలుగు చూసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులై నిబంధనల ప్రకారం ప్రొబెషన్ ఖరారైన అధికారులను కాదని ఆ ఉన్నతాధికారిని డిప్యూటీ కమిషనర్ పోస్టులో కూర్చోబెడుతూ కొద్దిరోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాన్ని హైకోర్టు తాజాగా కొట్టేసింది.
గత పదోన్నతే వివాదంలో ఉన్నా...
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న రాజేశ్వర్‌కు దేవాదాయశాఖ మే నెలలో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. ఆయన సహాయక కమిషనర్ హోదాలో ఆర్‌జేసీ స్థాయిలో ఉన్న ఈ ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. అయితే కమిషనర్ నిర్ణయంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన సహాయ కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు.
వారి పటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం... దేవాదాయశాఖ ఇచ్చిన పదోన్నతి ఆదేశాన్ని రద్దు చేసింది. గతంలో సహాయ కమిషనర్ల పదోన్నతుల జాబితా రూపకల్పనలో జరిగిన గందరగోళంపైనే తీవ్ర వివాదం నెలకొంది. అర్హత లేనివారిని సీనియర్లుగా చూపుతూ ఈ జాబితా రూపొందించారన్న వ్యవహారం ఇప్పటికీ కోర్డులో పెండింగ్‌లో ఉంది. ఆ జాబితా ప్రకారం రాజేశ్వర్ గత పదోన్నతే వివాదంలో చిక్కుకొని ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆయన్ను డీసీ కుర్చీపై కూర్చోబెట్టి దేవాదాయశాఖ పరువు పోగొట్టుకుంది.