
పెందుర్తి: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో ఫోన్ ద్వారా ఆయన చర్చించి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ ప్రతిష్టతో పాటు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించడం అవసరమన్నారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు.