swaroopanandendra saraswathi swamy
-
విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస దీక్ష విరమణ
-
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు..!
-
అర్చకులకు వంశపారంపర్య హక్కులు.. స్వరూపానందేంద్ర స్వామి స్పందన ఇదే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్దంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరం అన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్ఛడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరమవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామంగా స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. సీఎం జగన్‌కు ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ లేకుండా వీలైనంత కాలం పనిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఏపీ అర్చక సమాఖ్య సీఎం జగన్‌కు బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అంటూ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణకూ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
గిరిజనులకు సేవచేస్తే దేవుణ్ణి పూజించినట్లే
అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం: గిరిజనులకు సేవ చేయడం భగవంతుని ఆరాధించడంతో సమానమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. అరకులోయలోని ఎన్టీఆర్ మైదానంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం శంకరాచార్య గిరి సందర్శన మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామీజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో కలిసి ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభించారు. 500 మంది పేద వృద్ధులకు దుప్పట్లు, 500మంది భక్తులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు కల్మషం లేనివారని, వారికి సేవచేయాలని ఉద్బోధించారు. అందరూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో భగవంతుని కొలుస్తారు కానీ ఇక్కడ గిరిజన ప్రజలు ప్రకృతిని, చెట్లను దైవంగా ఆరాధిస్తారన్నారు. ఆంజనేయస్వామి గిరిజనుడే అని, అడవి బిడ్డలంతా అంజనీపుత్రుని వారసులేనని తెలిపారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మతమార్పిడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేసేందుకే క్రిస్మస్ రోజున భగవద్గీతలను పంపిణీ చేశామన్నారు. గిరిజన ప్రాంతంలో దేవాలయల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు. పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్య అందించేందుకు త్వరలోనే పాఠశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాలు ఏర్పడటం ఆనందంగా ఉందని, ఏపీలో మాత్రమే ఇలా గిరిజనులకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటయ్యాయని స్వామీజీ అన్నారు. చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రజలను దైవ మార్గంలో నడిపించేందుకు కృషిచేయడంతోపాటు విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తున్న విశాఖ శారద పీఠానికి రుణపడి ఉంటామన్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి జగదీష్‌బాబు, ఎంపీపీ ఉషారాణి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విశాఖలో ఆదిశంకరుల భారీ విగ్రహం
సింహాచలం/అంబాజీపేట: విశాఖలో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా శంకరుల ప్రతిమ ఉంటుందని చెప్పారు. కోనసీమ జిల్లా ముక్కామలలో కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతిని స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం కలిసి వైదిక, ఆధ్యాత్మిక, సంప్రదాయపరమైన అంశాలపై చర్చించారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ వానప్రస్థంలోకి అడుగుపెడుతోన్న వృద్ధ దంపతుల కోసం పురాణ, వేదాంత పరమైన ధర్మ సందేహాల నివృత్తికి ప్రత్యేక కోర్సుని ప్రవేశ పెట్టే ఆలోచన ఉందని, 2– 3 ఏళ్ల నిడివితో కోర్సుని రూపొందించాలని భావిస్తున్నామని విజయేంద్ర సరస్వతి దృష్టికి తీసుకెళ్లారు. స్వరూపానందేంద్ర యోచన పట్ల విజయేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. అర్చకత్వం, ఆలయ సంపద పరిరక్షణ తదితర అంశాలపై కూడా ఇరువురూ చర్చించారు. హైందవ ధర్మం పరిరక్షణకు విశాఖ శ్రీశారదాపీఠం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని విజయేంద్ర సరస్వతి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడే పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి అని ఆయన పేర్కొన్నారు. అనేకసార్లు గురువులు జయేంద్ర సరస్వతితో కలిసి విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పీఠం నుంచి వెలువడిన అనేక వేదాంత గ్రంథాలను పరిశీలించినట్టు తెలిపారు. అమలాపురం ఎంపీ అనూరాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు యతీంద్రులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ముక్కామలలో నిర్వహించిన బ్రహ్మసత్ర మహోత్సవ ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతులు హాజరయ్యారు. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాజశ్యామల ఉపాసన కేంద్రం విశాఖ శారదాపీఠం
సింహాచలం: తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల అమ్మవారిని ఆరాధించే ఏకైక ఉపాసన కేంద్రంగా విశాఖ శ్రీశారదాపీఠం ఖ్యాతిగాంచిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ఎంతోమంది ఉన్నతస్థాయికి చేరుకున్నారని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ రాజశ్యామల అమ్మవారిని ఏకాంతంగాను, అంతర్లీనంగాను ఉపాసించాలంటే అది కేవలం విశాఖ శ్రీశారదాపీఠంలోనే సాధ్యమని చెప్పారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే వారు అదృష్టవంతులవుతారన్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ సాధారణ రోజుల్లోకన్నా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఆరాధిస్తే వేయిరెట్లు ఫలితం సిద్ధిస్తుందని చెప్పారు. ఈవేడుకల్లో లోకకల్యాణార్ధం చండీహోమం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణం, రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జగన్మాత రాజశ్యామల అమ్మవారి ప్రీతికోసం శ్రీచక్రానికి నవావరణార్చన చేస్తున్నట్లు చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత మహాగణపతిపూజ, చండీహోమం, రాజశ్యామల హోమాన్ని నిర్వహించే పండితులు దీక్షాధారణ చేశారు. తొలిరోజు సోమవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. -
నేటి నుంచి విశాఖ శ్రీ శారదా పీఠం చాతుర్మాస్య దీక్ష
-
13 నుంచి శారదా పీఠాధిపతి చాతుర్మాస దీక్ష
పెందుర్తి: ఈనెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్షను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేపట్టనున్నారు. రుషికేష్‌లోని పవిత్ర గంగానదీ తీరాన శ్రీశారదాపీఠం శాఖలో గురుపూర్ణిమ సందర్భంగా స్వామీజీలు ఈ దీక్షను ఆచరించనున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతుంది. స్వామీజీకి ఇది 26వ చాతుర్మాస దీక్ష కాగా.. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నాలుగోసారి దీక్ష చేపట్టనున్నారు. దీక్షా కాలంలో పరివ్రాజ్యలు(పర్యటనలు) చేయరు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పుదినుసులను స్వీకరించరు. ఈ సమయంలో సాధువులకు, సన్యాసులకు భండారా (అన్నదానం) నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు. గంగమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తరువాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేపడతారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్‌కు వెళ్తుంటారు. -
అసలైన ఉన్మాది చంద్రబాబే..
పెందుర్తి: రాష్ట్రంలో అసలు సిసలైన ఉన్మాదిలా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. 14 ఏళ్ల పాలనలో మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఏనాడైనా పని చేశాడా.. అని ప్రశ్నించారు. శనివారం విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి రోజా చినముషిడివాడలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైందన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి తక్షణమే విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడిని, విజయవాడలో టీడీపీ నాయకుడు ఓ యువతిపై లైంగికదాడికి యత్నించినప్పుడు చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడని ధ్వజమెత్తారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై తాను ప్రశ్నించినప్పుడు తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి రోజా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని పర్యాటక కేంద్రాలపై షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తామన్నారు. శ్రీశారదా పీఠం సందర్శన.. విశాఖ శ్రీశారదాపీఠాన్ని మంత్రి రోజా శనివారం సందర్శించి, రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె వెంట ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఉన్నారు. -
ఎయిర్‌పోర్టులో సింహాద్రి అప్పన్న
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో చందనధారుడు ప్రయాణికులకు దర్శనమివ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పన్న ఆలయ అధికారులు చందన రూపంలో ఉండే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సోమవారం తొలి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చంద్రకళ మాట్లాడుతూ.. విశాఖపట్నం వచ్చే ప్రయాణికులు అప్పన్నను దర్శనం చేసుకునే అవకాశం కల్పించామన్నారు. స్వామి వారి చరిత్ర, డొనేషన్లు ఇచ్చే వారి కోసం వెబ్సైట్లు ఏర్పాటు చేశామన్నారు. స్వామి చరిత్ర ఆడియో వినేందుకు క్యూఆర్ కోడ్ త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్లో అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్థానాచార్యులు రాజ్‌గోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈవో రమణమూర్తి, శిల్పి రమణ, ఈఈ శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజు, దొడ్డి రమణ, సతీష్, పాత్నుడు, చందు, సువ్వాడ శ్రీదేవి, వంకాయల నిర్మల, రామలక్ష్మి పాల్గొన్నారు. అప్పన్నను దర్శించుకున్న కేజీఎఫ్ హీరో విమానాశ్రయంలో సింహాద్రి అప్పన్న విగ్రహం ప్రారంభోత్సవం జరిగిన కొద్దిసేపటికే కేజీఎఫ్ హీరో యష్ రావడంతో తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ పురోహితులు సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో చంద్రకళ యష్‌కు స్వామివారి శేష వస్త్రాలు కప్పి స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని యష్ తెలిపారు. -
రాజశ్యామల తంత్ర మహిమాన్వితం శ్రీశారదా పీఠం
పెందుర్తి: జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఉపాసన పూర్తిస్థాయిలో తెలిసిన ఏకైక పీఠం శ్రీశారదాపీఠం అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. 14 ఏళ్ల పాటు హిమాలయాల్లో సంచరించిన సమయంలో తపస్సంపన్నుల సాన్నిహిత్యం, మహానుభావుల ఉపదేశంతో రాజశ్యామల అమ్మవారి తంత్రాన్ని తెలుసుకోగలిగానన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ.. రాజశ్యామల అమ్మవారి ఉపాసన బలంతో ఇక్కడ పీఠాన్ని నెలకొల్పామని తెలిపారు. కుల, మత బేధ రహిత అద్వైత వేదాంతాన్ని బోధించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుని బోధనలను తమ పీఠం పుణికిపుచ్చుకుందన్నారు. వార్షికోత్సవాల్లో ప్రతి ఏటా శ్రౌత, శాస్త్ర సభలు నిర్వహించడం ఆనవాయితీ అని.. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సభలు రద్దు చేశామని తెలిపారు. శ్రీశారదాపీఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎంతో అనుబంధం ఉన్నందున సీఎంను ప్రత్యేకంగా వార్షికోత్సవాలకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రోక్తంగా కార్యక్రమాలు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సారథ్యంలో పీఠం వార్షిక మహోత్సవాలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. స్వామీజీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పండితులకు దీక్షా వస్త్రాలను అందించారు. లోకకల్యాణార్థం లక్ష్మిగణపతి హోమం, మేధాదక్షిణామూర్తి హోమం చేపట్టారు. శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన గావించారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన చతుర్వేద పారాయణంలో వందలాది మంది పండితులు పాల్గొన్నారు. -
ఢిల్లీలోనూ విశాఖ శారదా పీఠం సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ శారదా పీఠం కార్యక్రమాలను దేశ రాజధాని ఢిల్లీకి సైతం విస్తరించాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం అని, ఆ క్రమంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వెల్లడించారు. ఇందుకోసం స్థలం కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. తెలుగు వారందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణలో శారదా పీఠం విశిష్ట సేవలందిస్తోందని, తాజాగా విశాఖ ఏజెన్సీ నుంచి గిరిజనులను తీర్థయాత్రలకు తీసుకెళ్లామని తెలిపారు. దళిత, గిరిజనుల కోసం ఎన్నో ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిన ఇప్పటికే తమకు కాశీ మహాక్షేత్రంతో పాటు రిషికేశ్ గంగానది తీరాన ఆశ్రమం ఉందని, హైదరాబాద్‌లోనూ నిర్మాణం పూర్తికాబోతుందని వెల్లడించారు. -
ధర్మ ప్రచార నిధి ఏర్పాటు చేయాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. తద్వారా వాడవాడలా హిందూ ధర్మ ప్రచారం సాగేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్ మంగళవారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఆలయాల భద్రత కోసం నియమించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీస్ శాఖ ద్వారా శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ వ్యవస్థలో పరిపాలనపరమైన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. ప్రధాన దేవాలయాల ప్రచార రథాలకు మరమ్మతులు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు. ధర్మ ప్రచారం కోసం శ్రీశారదా పీఠం పెద్ద ఎత్తున కసరత్తులు చేసి కులాలకు అతీతంగా ప్రచారం ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. దేవాలయ సాహిత్యం, కవీశ్వరుల రచనలను వెలుగులోకి తీసుకురావాలని స్వామీజీ చెప్పారు. పురాణ సభలను ఏర్పాటు చేసి.. ఎంపిక చేసిన పండితుల ద్వారా ఆలయాల చరిత్ర, స్థల పురాణం పుస్తకరూపంలో తీసుకురావాలన్నారు. -
బాలాత్రిపుర సుందరిగా రాజశ్యామల అమ్మవారు
పెందుర్తి: విశాఖ శ్రీశారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల చేతుల మీదుగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గణపతి పూజతో అంకురార్పణ, అనంతరం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లోక కల్యాణార్థం పీఠంలో చండీ హోమాన్ని చేపట్టారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో శ్రీమత్ దేవి భాగవత పారాయణం నిర్వహించారు. సాయంత్రం శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరులకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పీఠార్చన చేశారు. కాగా, శుక్రవారం అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. -
ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయాలి
పెందుర్తి: దేవదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యమయ్యేలా ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయాలని, ఆ సలహా మండలి సూచనలతో ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. రుషికేష్‌లో విశాఖ శ్రీ శారదా పీఠం ఆశ్రమంలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని మంత్రి వెలంపల్లి శనివారం కలిశారు. మంత్రితో స్వరూపానంద మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకుని హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు. అన్యాక్రాంతం అవుతోన్న ఆలయాల భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల అభివృద్ధికి కేంద్రంతో చర్చించాలన్నారు. చాతుర్మాస దీక్ష అనంతరం పంచారామ క్షేత్రాలపై విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సీతారామపురం ఆలయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం మంత్రి వెలంపల్లి రిషికేష్‌లోని గంగానదిలో స్నానం ఆచరించారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరుల పీఠార్చనకు హాజరయ్యారు. -
వంశపారంపర్య అర్చకులకు విధి విధానాలు
సాక్షి, అమరావతి: ఆలయాల్లో పనిచేసే అర్చకుల కలలు నిజంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎనిమిది రకాల అంశాలకు సంబంధించి ఏ ఒక్క అంశంలో ఆధారాలు చూపినా వారిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకత్వానికి అర్హుడిగా గుర్తిస్తూ ఆలయ 43(10) రిజిస్టర్లో నమోదు చేయాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలోని అందరు రీజనల్ జాయింట్ కమిషనర్లు, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఎనిమిది అంశాలను అ ఉత్తర్వులలో వివరించారు. అవి.. ► అర్చక ఇనాం భూములను అనుభవిస్తూ ప్రస్తుతం అర్చకత్వం చేస్తున్న వారు సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకులుగా గుర్తించబడతారు. ► దరఖాస్తుదారుని తండ్రి లేదా తాతలు ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తే అతడిని ఆ ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల రిజిస్టర్ 25లో గానీ, 1966 నాటి ఆంధ్రప్రదేశ్ దేవదాయ చట్టం ప్రకారం ఆలయ రిజస్టర్ 38లో గానీ అర్చకులుగా నమోదై ఉన్న వారి వారసులను సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకులుగా గుర్తిస్తారు. ► అర్చకులందరూ ఒక అవగాహనకు వచ్చి ఓ వ్యక్తిని సూచించినా అతడిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► గతంలో కోర్టు ఆదేశాలున్న చోట.. అలాంటి వారిని సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకునిగా అర్హుడవుతారు. ► ఎలాంటి వివాదాల్లేని చోట ప్రస్తుతం ఆలయ అర్చకుడే ఆ ఆలయ వంశపారంపర్య అర్చకుని హోదా పొందవచ్చు. ► ఏదైనా ఆలయంలో వంశపారంపర్య అర్చకునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు పేపరు నోటిఫికేషన్ ద్వారా అతని నియామకానికి చర్యలు చేపడతారు. ► వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉండి ఆలయ అర్చకునిగా పనిచేసిన వారు చనిపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నిబంధనల ప్రకారం అర్హులు లేనట్లయితే భర్తను కోల్పోయిన అర్చకుని భార్య సూచించిన వ్యక్తి ఆమె జీవితకాలం వంశపారంపర్య హోదా అర్చకునిగా పనిచేయవచ్చు. .. పై ఎనిమిది అంశాల ప్రాతిపదికన రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం గుర్తింపు ప్రక్రియను దేవదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలోనే చేపడతారు. రూ. కోటిలోపు ఆదాయం ఉండే 6(ఏ) కేటగిరి ఆలయాలలో ఈ గుర్తింపు ప్రక్రియ రీజనల్ జాయింట్ కమిషనర్ల అనుమతితో చేపడతారు. 6 (బీ) కేటగిరి ఆలయాల్లో జోనల్ డిప్యూటీ కమిషనర్లు, 6(సీ) కేటగిరి ఆలయాల్లో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియకు అనుమతిస్తారు. ఏపీ అర్చక సమాఖ్య హర్షం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దేవదాయ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలు ఖరారుతో పాటు అప్పటి చట్టం అమలుకు పూనుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌తో పాటు వెలంపల్లి, వాణీమోహన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చక సమస్యలపై చొరవ అవసరం పెందుర్తి: అర్చకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. వంశపారంపర్య హక్కులను అమలు చేయాలన్నారు. రుషికేష్‌లోని శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి పీఠ పూజలో పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని సూచించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఏపీ బడ్జెట్‌పై స్వరూపానందేంద్రస్వామి హర్షం
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినందనీయులు అని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పారు. శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండు లక్షల 29 వేల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. దీంతోపాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం
పెందుర్తి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ జాతకాలు బాగుండటం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు ప్లవనామ సంవత్సరంలో మేలు జరుగుతుందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే రోజుల్లో నిరంతరాయంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో ఉగాదిని పురస్కరించుకుని ఉగాది ఆస్థానం నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేసూ్త.. సేనాధిపతి కుజుడు కావడంతో ఈ ఏడాది దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పారు. చాలా పెద్ద నాయకుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆర్థికంగా తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండవని.. ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వివరించారు. నేతల మధ్య ఏర్పడే సమన్వయ లోపం కారణంగా విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదన్నారు. దేశానికి ఇది మంచిది కాదన్నారు. దేశంలో కుట్ర పూరిత యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. కుటుంబాల మధ్య కూడా అనిశ్చితి ఏర్పడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. శ్రీప్లవనామ సంవత్సరంలో చతుగ్రహ కూటమి తరచూ ఏర్పడుతుందని దీనివలన కాలసర్ప దోషాలు సంభవిస్తాయని.. ఈ పరిణామాల వలన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా కొన్ని విపత్కర పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉంటుందని, వర్షాలు బాగా పడి పంటలు పండుతాయని చెప్పారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు. కరోనా మహమ్మారి జూలై వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని..ఆ తర్వాత ఎంతవరకు ప్రబలుతుందో ఆ తర్వాత గానీ నిర్ణయించలేమని స్పష్టం చేశారు. ప్రజలు తిరుమల శ్రీవారిని, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్నస్వామి, బెజవాడ కనకదుర్గమ్మను, యాదాద్రి నరసింహస్వామిని, వేములవాడ రాజరాజేశ్వరస్వామిని, బాసర సరస్వతీదేవిని కొలవాలని సూచించారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ ప్లవ అంటే వెలుగునిచ్చేదని అని అర్థాన్ని వివరించారు. వికారి, శార్వరి నామ సంవత్సరాల్లో కమ్ముకున్న చీకట్లను తొలగించి ప్లవ నామ నూతన సంవత్సరం వెలుగులివ్వాలని కోరుతూ అంతా రాజశ్యామల అమ్మవారిని ప్రార్థించాలని అన్నారు. గంటల పంచాంగం ఆవిష్కరణ పీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పఠనంతో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. స్వామీజీల చేతుల మీదుగా శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. స్వర్ణ కవచధారిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు విశేష అర్చనలు అందుకున్నారు. పీఠాధిపతి, ఉత్తరాధికారి చేతుల మీదుగా గంటల పంచాంగం ఆవిష్కరణ జరిగింది. పీఠం ఆస్థాన సిద్ధాంతి పంతుల రామలింగ స్వామి పంచాంగ శ్రవణం వినిపించారు. భక్తులకు స్వామీజీ చేతుల మీదుగా ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు. -
హిందూ ధర్మం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం
పెందుర్తి/దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘ధర్మపోరాటాలకు శారదా పీఠం పుట్టిల్లు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మపోరాటాల ద్వారా పీఠం ఎన్నో విజయాలు సాధించింది’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ధర్మ జాగృతి కోసం దళితులు, గిరిజనులకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో తిరుమల యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి సోమవారం విశాఖ జిల్లా చినముíÙడివాడలోని శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో 1,500 మంది దళితులు, గిరిజనులు తిరుమలకు బయల్దేరగా.. స్వరూపానందేంద్ర స్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. రెండేళ్ల కిందట శ్రీకారం.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రెండేళ్ల కిందట హిందూ ధర్మ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. 33 వేల కిలోమీటర్ల మేర ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగింది. స్వాత్మానందేంద్ర స్వామి మైదాన, అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మారుమూల గిరిజన తండాలను సందర్శించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం తిరిగారు. అక్కడి గిరిజనులను హిందూ ధర్మం గురించి చైతన్య పరిచారు. దేవాలయ వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తించి ఓ నివేదిక కూడా తయారుచేశారు. ప్రభుత్వానికి త్వరలో నివేదిక.. స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఇటీవల కొందరు పీఠంపై దు్రష్పచారం చేస్తున్నారని, అలాంటి వారికి ధర్మ ప్రచారంతోనే సమాధానం చెబుతున్నామన్నారు. ఉత్తరాధికారి తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ద్వారా దేవాలయ వ్యవస్థలోని లోపాలను గుర్తించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద స్వాత్మానందేంద్ర సరస్వతి నారికేళాలు సమర్పించారు. బుధవారం ఉదయం దళితులు, గిరిజనులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నా.. తిరుమల వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన శారదా పీఠానికి ధన్యవాదాలు. ఆ స్వామిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోరిక ఇలా తీరింది. –సీలదేరి అప్పలమ్మ, లబరి గొంది శ్రీవారిని చూసే భాగ్యం కలిగింది.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. శారదా పీఠం వాళ్లు ఉచితంగా తీసుకెళ్లడం బాగుంది. ఆ స్వామిని చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలుగుతోంది. –మజ్జి భీష్మ, అరకు -
రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తు లేడు, కానీ ఇప్పుడు బాబుకు దేవుడు గుర్తొచ్చాడని విమర్శించారు. చంద్రబాబు ఆలయాలను కూల్చిన వ్యక్తి.. బాబు.. దేవాలయ ఆస్తులను తన బినామీలకు దారాదత్తం చేశారని చురకలు అంటించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. అసలు బాబుకు దేవుడంటే నమ్మకముందా? అని సూటిగా ప్రశ్నించారు. ఆలయాలను కూల్చిన వ్యక్తి సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. బాబు పాపాలు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఓడించాడని వ్యాఖ్యానించారు. ఇక రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. దోషులను శిక్షించాలి అంతకు ముందు విశాకు వెళ్లిన వెల్లంపల్లి అక్కడ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వామి సరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. దేవాలయాల్లో దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితి విధించాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రామతీర్ఠంలో అసలు ఏం జరిగిందంటే... రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. (చదవండి: రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?) చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
దేవాలయాలపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో ఫోన్ ద్వారా ఆయన చర్చించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టతో పాటు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించడం అవసరమన్నారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. -
సుజనా, మురళీ మోహన్ ఆశీస్సులు తీసుకోలేదా?
సాక్షి, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. (చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు: మల్లాది) మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు.. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు. స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు. -
స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం నాదనీరాజనం మండపంలో జరుగుతున్న విరాటపర్వం కార్యక్రమంలో స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్ తిరుమలని కాలుష్య రహితంగా మార్చడానికి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్లాస్టిక్‌ని రద్దు చేసింది. తాజాగా పర్యావరణ పరిరక్షణలో బాగంగా ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల-తిరుపతి మధ్య నడపటానికి సన్నాహాలు చేస్తోంది. జీరో శాతం కాలుష్య రహిత వాహనాలను గత మూడు రోజులుగా ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి కార్యాలయం నుంచి అన్నమయ్య భవన్ వరకు బస్సులో ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిమీ మైలేజ్ వస్తుంది. ప్రభుత్వం, ఆర్టీసీతో చర్చించి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ నివారించాం. కాంక్రీట్ కట్టడాలు కూడా తగ్గించాం అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
విశాఖ.. మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది
సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సంతాపం ప్రకటించారు. ద్రోణంరాజు శివైక్యం చెందారన్న వార్తను తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మంచి రాజనీతిజ్ఞుడిని విశాఖ నరగం కోల్పోయిందని పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠంతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. (చదవండి : మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత) సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ద్రోణం రాజు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలతోనే ద్రోణంరాజు జీవించారని కొనియాడారు. ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని రాజశ్యామల అమ్మవారిని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. -
పాట కోసమే ఆయన పుట్టారు..
సాక్షి, విశాఖపట్నం: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన శివైక్యం పొందడం బాధాకరమన్నారు. బాలు మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు అని.. సంగీతమే ఊపిరిగా ఆయన జీవించారని తెలిపారు. విశాఖ శారద పీఠంతో బాలుకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఆయన ఉండేవారని చెప్పారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాల సుబ్రహ్మణ్యం అని స్వరూపానందేంద్ర ప్రస్తుతించారు. బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. (చదవండి: ‘అది అదృష్టంగా భావిస్తున్నా’) ఆయన పాట కోసమే పుట్టారు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ: పాట కోసమే పుట్టిన మహనుభావులు ఎస్పీ బాలు అని, ఆయన లోటు మరే గాయకులు పూడ్చలేనిదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాట్లాడినా, పాట పాడిన తెలుగు భాష, తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునే ఎస్పీ బాలు భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా నగరంతో ఎస్పీ బాలుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.