సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం నాదనీరాజనం మండపంలో జరుగుతున్న విరాటపర్వం కార్యక్రమంలో స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్
తిరుమలని కాలుష్య రహితంగా మార్చడానికి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్లాస్టిక్‌ని రద్దు చేసింది. తాజాగా పర్యావరణ పరిరక్షణలో బాగంగా ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల-తిరుపతి మధ్య నడపటానికి సన్నాహాలు చేస్తోంది. జీరో శాతం కాలుష్య రహిత వాహనాలను గత మూడు రోజులుగా ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించి కార్యాలయం నుంచి అన్నమయ్య భవన్ వరకు బస్సులో ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిమీ మైలేజ్ వస్తుంది. ప్రభుత్వం, ఆర్టీసీతో చర్చించి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ నివారించాం. కాంక్రీట్ కట్టడాలు కూడా తగ్గించాం అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment