రాజశ్యామల అమ్మవారికి పూజలు చేస్తున్న స్వామీజీలు
పెందుర్తి: జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఉపాసన పూర్తిస్థాయిలో తెలిసిన ఏకైక పీఠం శ్రీశారదాపీఠం అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. 14 ఏళ్ల పాటు హిమాలయాల్లో సంచరించిన సమయంలో తపస్సంపన్నుల సాన్నిహిత్యం, మహానుభావుల ఉపదేశంతో రాజశ్యామల అమ్మవారి తంత్రాన్ని తెలుసుకోగలిగానన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ.. రాజశ్యామల అమ్మవారి ఉపాసన బలంతో ఇక్కడ పీఠాన్ని నెలకొల్పామని తెలిపారు. కుల, మత బేధ రహిత అద్వైత వేదాంతాన్ని బోధించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుని బోధనలను తమ పీఠం పుణికిపుచ్చుకుందన్నారు. వార్షికోత్సవాల్లో ప్రతి ఏటా శ్రౌత, శాస్త్ర సభలు నిర్వహించడం ఆనవాయితీ అని.. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సభలు రద్దు చేశామని తెలిపారు. శ్రీశారదాపీఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎంతో అనుబంధం ఉన్నందున సీఎంను ప్రత్యేకంగా వార్షికోత్సవాలకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
శాస్త్రోక్తంగా కార్యక్రమాలు
పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సారథ్యంలో పీఠం వార్షిక మహోత్సవాలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. స్వామీజీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పండితులకు దీక్షా వస్త్రాలను అందించారు. లోకకల్యాణార్థం లక్ష్మిగణపతి హోమం, మేధాదక్షిణామూర్తి హోమం చేపట్టారు. శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన గావించారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన చతుర్వేద పారాయణంలో వందలాది మంది పండితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment