గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో చందనధారుడు ప్రయాణికులకు దర్శనమివ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పన్న ఆలయ అధికారులు చందన రూపంలో ఉండే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సోమవారం తొలి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చంద్రకళ మాట్లాడుతూ.. విశాఖపట్నం వచ్చే ప్రయాణికులు అప్పన్నను దర్శనం చేసుకునే అవకాశం కల్పించామన్నారు. స్వామి వారి చరిత్ర, డొనేషన్లు ఇచ్చే వారి కోసం వెబ్‌సైట్లు ఏర్పాటు చేశామన్నారు.
స్వామి చరిత్ర ఆడియో వినేందుకు క్యూఆర్ కోడ్ త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్‌లో అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్థానాచార్యులు రాజ్‌గోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈవో రమణమూర్తి, శిల్పి రమణ, ఈఈ శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజు, దొడ్డి రమణ, సతీష్, పాత్నుడు, చందు, సువ్వాడ శ్రీదేవి, వంకాయల నిర్మల, రామలక్ష్మి పాల్గొన్నారు.
అప్పన్నను దర్శించుకున్న కేజీఎఫ్ హీరో
విమానాశ్రయంలో సింహాద్రి అప్పన్న విగ్రహం ప్రారంభోత్సవం జరిగిన కొద్దిసేపటికే కేజీఎఫ్ హీరో యష్ రావడంతో తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ పురోహితులు సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో చంద్రకళ యష్‌కు స్వామివారి శేష వస్త్రాలు కప్పి స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని యష్ తెలిపారు.
ఎయిర్‌పోర్టులో సింహాద్రి అప్పన్న
Published Tue, Apr 12 2022 5:08 AM | Last Updated on Tue, Apr 12 2022 5:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment