
స్వరూపానందేంద్ర సరస్వతికి జ్ఞాపికను అందజేస్తున్న విజయేంద్ర సరస్వతి
సింహాచలం/అంబాజీపేట: విశాఖలో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా శంకరుల ప్రతిమ ఉంటుందని చెప్పారు. కోనసీమ జిల్లా ముక్కామలలో కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతిని స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం కలిసి వైదిక, ఆధ్యాత్మిక, సంప్రదాయపరమైన అంశాలపై చర్చించారు.
స్వరూపానందేంద్ర మాట్లాడుతూ వానప్రస్థంలోకి అడుగుపెడుతోన్న వృద్ధ దంపతుల కోసం పురాణ, వేదాంత పరమైన ధర్మ సందేహాల నివృత్తికి ప్రత్యేక కోర్సుని ప్రవేశ పెట్టే ఆలోచన ఉందని, 2– 3 ఏళ్ల నిడివితో కోర్సుని రూపొందించాలని భావిస్తున్నామని విజయేంద్ర సరస్వతి దృష్టికి తీసుకెళ్లారు. స్వరూపానందేంద్ర యోచన పట్ల విజయేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. అర్చకత్వం, ఆలయ సంపద పరిరక్షణ తదితర అంశాలపై కూడా ఇరువురూ చర్చించారు.
హైందవ ధర్మం పరిరక్షణకు విశాఖ శ్రీశారదాపీఠం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని విజయేంద్ర సరస్వతి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడే పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి అని ఆయన పేర్కొన్నారు. అనేకసార్లు గురువులు జయేంద్ర సరస్వతితో కలిసి విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
పీఠం నుంచి వెలువడిన అనేక వేదాంత గ్రంథాలను పరిశీలించినట్టు తెలిపారు. అమలాపురం ఎంపీ అనూరాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు యతీంద్రులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ముక్కామలలో నిర్వహించిన బ్రహ్మసత్ర మహోత్సవ ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతులు హాజరయ్యారు. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment