సాక్షి, విశాఖపట్నం: సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. కరోనా నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం శనివారంతో విజయవంతంగా ముగిసింది. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ప్రపంచానికి గురుస్థానంలో భారతదేశం ఉందని.. మానవులంతా ఆరోగ్యంతో ఉండాలని ఈ యాగం చేశామని తెలిపారు. వేదాల్లో అనేక అంశాలను పరిశీలించి యాగం తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ధన్వంతరి జపం, అపమృత్యు దోష నివారణతో కూడిన మంత్రాలతో యజ్ఞం చేసామని వివరించారు.
(కరోనా పాజిటివ్: ఆ జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్)
ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ల ఆదేశాలను ప్రజలందరూ పాటించాలని స్వరూపానందేంద్ర సరస్వతి విజ్ఞప్తి చేశారు. శారదాపీఠం భక్తులంతా అన్నార్థులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులను దేశ సైనికులుగా భావించి గౌరవించాలని పేర్కొన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ, దేవాదాయ శాఖ అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment