జెండా ఊపి బస్సు యాత్రని ప్రారంభిస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, పక్కన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ
పెందుర్తి/దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘ధర్మపోరాటాలకు శారదా పీఠం పుట్టిల్లు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మపోరాటాల ద్వారా పీఠం ఎన్నో విజయాలు సాధించింది’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ధర్మ జాగృతి కోసం దళితులు, గిరిజనులకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో తిరుమల యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి సోమవారం విశాఖ జిల్లా చినముíÙడివాడలోని శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో 1,500 మంది దళితులు, గిరిజనులు తిరుమలకు బయల్దేరగా.. స్వరూపానందేంద్ర స్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
రెండేళ్ల కిందట శ్రీకారం..
స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రెండేళ్ల కిందట హిందూ ధర్మ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. 33 వేల కిలోమీటర్ల మేర ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగింది. స్వాత్మానందేంద్ర స్వామి మైదాన, అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మారుమూల గిరిజన తండాలను సందర్శించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం తిరిగారు. అక్కడి గిరిజనులను హిందూ ధర్మం గురించి చైతన్య పరిచారు. దేవాలయ వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తించి ఓ నివేదిక కూడా తయారుచేశారు.
ప్రభుత్వానికి త్వరలో నివేదిక..
స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఇటీవల కొందరు పీఠంపై దు్రష్పచారం చేస్తున్నారని, అలాంటి వారికి ధర్మ ప్రచారంతోనే సమాధానం చెబుతున్నామన్నారు. ఉత్తరాధికారి తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ద్వారా దేవాలయ వ్యవస్థలోని లోపాలను గుర్తించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద స్వాత్మానందేంద్ర సరస్వతి నారికేళాలు సమర్పించారు. బుధవారం ఉదయం దళితులు, గిరిజనులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నా..
తిరుమల వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన శారదా పీఠానికి ధన్యవాదాలు. ఆ స్వామిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోరిక ఇలా తీరింది.
–సీలదేరి అప్పలమ్మ, లబరి గొంది
శ్రీవారిని చూసే భాగ్యం కలిగింది..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. శారదా పీఠం వాళ్లు ఉచితంగా తీసుకెళ్లడం బాగుంది. ఆ స్వామిని చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలుగుతోంది.
–మజ్జి భీష్మ, అరకు
Comments
Please login to add a commentAdd a comment