Hindhu Dharma
-
ఎమ్మెల్యే రాజాసింగ్లో ప్రవహించేది కాషాయ రక్తమే..
సాక్షి, హైదరాబాద్: హిందూ ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంనేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సిద్ధంగా ఉన్నారని, ఆయన భార్య టీ.ఉషాబాయి పేర్కొన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం కష్టపడి పనిచేసే రాజాసింగ్ అదే ధర్మం కోసం జైలు పాలయ్యారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాభాయి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజాసింగ్ జైలులో ఉన్న ఈ సమయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులంతా మాకు అండగా ఉంటూ కొండంత ధైర్యం ఇస్తున్నారని అన్నారు. రాజాసింగ్, ఆయన కుటుంబం ఎప్పుడూ అనాథ కాదని, హిందూ సమాజం అంతా మా కుటుంబానికి అండగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. హిందుత్వం పేరుతో కుట్రలు చేసేవారి పట్ల రాజాసింగ్, అభిమానులు, పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజాసింగ్లో ప్రవహించేది కాషాయ రక్తమే అన్నారు. రాజాసింగ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని, ఆయన చేతిలో ఉండేది కమలం జెండాయేనని ధర్మం కోసం ఆయన ఎన్ని బాధలైనా భరించడానకి సిద్ధంగా ఉన్నారు. -
ధర్మపరిరక్షణకు ప్రభుత్వం కృషి
సాక్షి, అమరావతి: హైందవధర్మ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటుతోపాటు హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ధార్మికసంస్థలు, పీఠాలకు భూములు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విశాఖ శారదాపీఠానికి, అనంతపురంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ధర్మప్రచారానికి ముందుకొస్తున్న ప్రభుత్వంపై పచ్చపత్రికలు కుట్ర పూరితంగా విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. స్వామీజీలకు కూడా రాజకీయాలను ఆపాదించడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా పీఠాధిపతుల కోరిక మేరకు స్థలాలు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కావూరి సాంబశివరావుకు అప్పనంగా 400 ఎకరాలు ఇచ్చారని, విశాఖలో లోకేశ్ భూములను పంచిపెట్టినప్పుడు పచ్చపత్రికలు ఏం చేశాయని ప్రశ్నించారు. ఈషా ఫౌండేషన్‌కు చంద్రబాబు స్థలం ఇస్తానని ప్రకటించగానే ఫౌండేషన్‌కు గొప్ప అవకాశం కల్పిస్తున్నారంటూ వార్తలు రాయలేదా అని నిలదీశారు. ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ వాసవీకన్యకాపరమేశ్వరి సత్రాలు, అన్నదాన సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీని తగ్గిస్తూ వాటి నిర్వహణను ఆర్యవైశ్యులకే అప్పగించేలా తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారన్నారు. ఆయన తనయుడిగా సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను అమ్ముకోవడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సొంత నిధులతో నిర్మించుకున్న దేవాలయాలు, సత్రాల నిర్వహణలో ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ లభించిందన్నారు. సీఎంకు ఆర్యవైశ్య సంఘం ధన్యవాదాలు సీఎం వైఎస్ జగన్‌ని ఏపీ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గురువారం కలిశారు. ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్లో తీర్మానం చేసినందుకు సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో మంత్రి వెలంపల్లి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఎం. ద్వారకానాథ్, ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుడు కె.విద్యాధరరావు తదితరులున్నారు. -
హిందుత్వాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్
గుంటూరు రూరల్: హైందవ ధర్మంపై, హిందూ దేవుళ్లపై వికృత కార్యక్రమాలు చేసి హిందూ సమాజాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్ యూట్యూబ్ చానల్‌పై కఠిన చర్యలు తీసుకుని చానల్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు, హోంమంత్రి మేకతోటి సుచరితకు ఫిర్యాదు చేసింది. సీఐడీ ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదు అందజేశారు. గుంటూరులోని సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ఏబీఎన్ తెలుగు అనే యూట్యూబ్ చానల్ లైవ్‌లో ఈనెల 21న శ్రీరామనవమి రోజున లైవ్ స్ట్రీమ్‌లో కరోనా వైరస్ రామాయణ, రాములమ్మ, కిరాక్ న్యూస్ అనే కార్యక్రమంలో కరోనా కాండ, రామాయణంలో కరోనా ఉండి ఉంటే అంటూ ఒక కార్యక్రమం చేశారని తెలిపారు. రాముడిని, సీతమ్మను, రావణాసురుడిని అవహేళన చేసి మాట్లాడటం జరిగిందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కార్యక్రమాలు చేస్తున్న ఆ చానల్‌ను రద్దుచేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. ఇదే చానల్ గతంలోనూ ప్రజల్లో మత కలహాలు రేపేలా ముఖ్యమంత్రిపై, తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై, పలు హిందూ దేవాలయాలపై అసభ్యకర కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. -
హిందూ ధర్మం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం
పెందుర్తి/దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘ధర్మపోరాటాలకు శారదా పీఠం పుట్టిల్లు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మపోరాటాల ద్వారా పీఠం ఎన్నో విజయాలు సాధించింది’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ధర్మ జాగృతి కోసం దళితులు, గిరిజనులకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో తిరుమల యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి సోమవారం విశాఖ జిల్లా చినముíÙడివాడలోని శారదా పీఠం నుంచి 25 బస్సుల్లో 1,500 మంది దళితులు, గిరిజనులు తిరుమలకు బయల్దేరగా.. స్వరూపానందేంద్ర స్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. రెండేళ్ల కిందట శ్రీకారం.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రెండేళ్ల కిందట హిందూ ధర్మ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. 33 వేల కిలోమీటర్ల మేర ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగింది. స్వాత్మానందేంద్ర స్వామి మైదాన, అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మారుమూల గిరిజన తండాలను సందర్శించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం తిరిగారు. అక్కడి గిరిజనులను హిందూ ధర్మం గురించి చైతన్య పరిచారు. దేవాలయ వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తించి ఓ నివేదిక కూడా తయారుచేశారు. ప్రభుత్వానికి త్వరలో నివేదిక.. స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఇటీవల కొందరు పీఠంపై దు్రష్పచారం చేస్తున్నారని, అలాంటి వారికి ధర్మ ప్రచారంతోనే సమాధానం చెబుతున్నామన్నారు. ఉత్తరాధికారి తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ద్వారా దేవాలయ వ్యవస్థలోని లోపాలను గుర్తించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద స్వాత్మానందేంద్ర సరస్వతి నారికేళాలు సమర్పించారు. బుధవారం ఉదయం దళితులు, గిరిజనులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నా.. తిరుమల వెంకన్న దర్శనానికి తొలిసారి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన శారదా పీఠానికి ధన్యవాదాలు. ఆ స్వామిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోరిక ఇలా తీరింది. –సీలదేరి అప్పలమ్మ, లబరి గొంది శ్రీవారిని చూసే భాగ్యం కలిగింది.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. శారదా పీఠం వాళ్లు ఉచితంగా తీసుకెళ్లడం బాగుంది. ఆ స్వామిని చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలుగుతోంది. –మజ్జి భీష్మ, అరకు -
అన్య మతస్తులకు పదవులివ్వడం ధర్మ విరుద్ధం
విజయనగరం టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానం పదవులను అన్యమతస్తులకు ఇవ్వడం హిందూ ధర్మ విరుద్ధమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కె.పి.ఈశ్వర్ అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన సంఘ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులు కానివారిని తక్షణమే ఆయా పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన హిందూ ధర్మానికి, భారతీయ సంప్రదాయానికి కేంద్రమైన టీటీడీ దేవస్థానంలో ట్రస్టు బోర్డు పదవులు అన్యమతస్తులకు కట్టబెట్టడం తీవ్ర అపచారమన్నారు. వేంకటేశ్వరస్వామివారికి విరుద్ధంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమైన ఘటనలను సీఎం చంద్రబాబునాయుడు గుర్తుచేసుకోవాలన్నారు. తప్పిదాన్ని తక్షణమే సరిదిద్దుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఓటమి చవిచూడక తప్పదని జోస్యం చెప్పారు. ట్రస్టు బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే అనిత స్వయంగా తను క్రిస్టియన్ అని చెప్పినప్పటికీ ఆమెను ట్రస్టుబోర్డు సభ్యురాలిగా నియమించిన చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దార్లపూడి సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడు గుర్రాజు, జిల్లా శాఖ ప్రతినిధులు కె.వి.రమణమూర్తి, ఆర్.వెంకటరావు, ఎ.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
కథలాపూర్(వేములవాడ): దేశ సంస్కృతిని ప్రపంచదేశాలు ప్రశంసిస్తున్నాయని, హిందు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. మంగళవారం కథలాపూర్ మండలంలో భజరంగ్‌దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వివేకానందుడు దేశం గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలు చాటిచెప్పారని, ఆయన దేశంలో జన్మించడం గర్వకారణని పేర్కొన్నారు. హిందు ధర్మం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. విభిన్న భాషలు మాట్లాడేవారు దేశంలో ఉన్నారని, రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవడంతో ధర్మం, న్యాయం ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. ఆంజనేయస్వామి తన గురువు అయిన రాముడి కోసం ఎన్నో త్యాగాలు చేశారని, వారి చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హిందు ధర్మం అన్ని వర్గాలవారిని, మతా లవారిని సమానంగా ఆదరిస్తుందన్నారు. అనంతరం భజరంగ్‌దళ్ కార్యకర్తలు మండలకేంద్రం నుంచి భూషణరావుపేట, చింతకుంట, దుంపేట, పోసానిపేట, తాండ్య్రాల గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం
కోరుట్లటౌన్: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు కమలానంద భారతీస్వామి అన్నారు. కోరుట్లలో ఈనెల 30న భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్ర పోస్టర్‌ను ఆదివారం స్థానిక మహాదేవస్వామి ఆలయంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీరామునిచరిత్ర, హనుమాన్దీక్ష విశిష్టతను వివరించారు. ఆలయ అధ్యక్షుడు గెల్లె గంగాధర్, మంచాల జగన్, గట్ల శివ, అర్చకులు పాలెపు వెంకటరమణశర్మ, కార్తీక భరధ్వాజశర్మ, గెల్లె శ్రీనివాస్, నరేందర్, నరేశ్, రోహిత్ పాల్గొన్నారు. -
ధర్మాన్ని రక్షిద్దాం..
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): ప్రతిఒక్కరూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐ.వి.ఆర్. కృష్ణారావు చెప్పారు. సీతానగరంలోని ‘సీత’ కార్యాలయంలో ఆదివారం సమరసత ఫౌండేషన్ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొన్నారు. హిందూ ధర్మంలో అందరూ సమానమేనని అన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి ఫౌండేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. కంచి స్వామి విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ విశ్వశాంతి కోసం అందరూ ధర్మాన్ని పాటించాలని ఉద్బోధించారు. ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ‘సీత’ డైరెక్టర్ వి.జయరాఘవాచార్యులు, అక్షర భారతి ఉపాధ్యక్షుడు డి.రామకృష్ణ పాల్గొన్నారు.