ఆలయ ఎంక్వైరీ కార్యాలయం గేటు వద్ద కారులో నిరీక్షిస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ
విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అసహనం వ్యక్తం చేశారు. చందనోత్సవానికి వచ్చిన స్వామీజీకి గేటు తీయకపోవడంతో ఆయన తన వాహనంలోనే సుమారు 15 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్వామీజీ తన వాహనంలో రాజగోపురం వరకు వెళ్లేందుకు ఎంక్వైరీ కార్యాలయం వద్దనున్న గేటు వద్దకు వచ్చారు. ఆ సమయంలో గేటు తాళాలు వేసి ఉండడంతో ఆయన కారులోనే ఉండిపోయారు. ఎవరు తాళాలు తీస్తారని ఎదురుచూశారు. దీంతో స్వామీజీ అసహనానికి గురయ్యారు. తాళాలు ఈవో దగ్గర ఉన్నాయంటూ అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు చెప్పారు. ఈవోకు ఫోన్‌లో స్వామీజీ వచ్చినట్టు సమాచారం ఇచ్చి, తాళాలు తీసుకొచ్చారు. చివరికి తాళాలు తీసి ఆయనను లోపలికి పంపారు.
ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అనుగ్రహించాలని స్వామీని కోరుకున్నా : స్వరూపానందేంద్ర సరస్వతి
శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చాలా దిగ్విజయంగా జరిగిందని శారదా పీఠాధిపతి తెలిపారు. ఈ ఏడాది శారదా పీఠానికి తొలి అడుగని, ఈ ఏడాది పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని పెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఒక నెల ముందు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నామన్నారు. ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అనుగ్రహించాలని స్వామిని వేడుకున్నామన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం అనంతరం వేద స్వస్తిని అర్చకులు నిర్వహించారు. ప్రసాదాన్ని ఈవో కె.రామ చంద్రమోహన్ అందజేశారు. తాను ఆలయం లోపల ఉండిపోవడంతోనే తాళం తీయడానికి ఆలస్యమైందని ఈవో స్వామీజీకి సంజాయిషీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment