మహాకుంభాభిషేకం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం గురువారం వైభవంగా జరిగింది. దేశంలోని పవిత్ర నదులైన గంగా, యయున, సరస్వతి, వృద్ధ గంగగా పేరుగాంచిన గోదావరి జలాలతో కార్గిల్, లడాక్ ప్రాంతాల్లోని ఇండస్, జాన్సర్గ్ నదుల నుంచి సేకరించిన జలాలతో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అభిషేకాలు జరిపారు. పీఠంలో రాజశ్యామల స్వరూప శారదామాత ఆలయాన్ని స్వామీజీ చేతుల మీదుగా పునఃప్రారంభించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. తొలిపూజ స్వామీజీ ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేస్తూ దేశంలో ఎక్కడా లేని రాజశ్యామల స్వరూప శారదామాత ఆలయాన్ని శారదాపీఠంలో నిర్మించడం అమ్మవారి కృపగా భావిస్తున్నామన్నారు. తరతరాలుగా భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్న తలంపుతో ఉపానాది స్థూపి పర్యాంతం(పునాది నుంచి శిఖరం వరకు శిల) ఆలయం నిర్మించామన్నారు.
దేశంలోని శారదాపీఠం శాఖలన్నింటికీ ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ(బాలస్వామి)ని జూన్ 17న అమరావతిలో జరిగే కార్యక్రమంలో నియమిస్తామని స్వామీజీ ప్రకటించారు. మహాపూర్ణాహుతి ఘట్టంతో వార్షిక వేడుకలు ముగిశాయి. స్వామీజీ చేతుల మీదుగా పండిత సత్కారం, పీఠం ఆస్థాన శిల్పి గణపతి కుమారుడు జయేంద్ర స్థపతికి స్వర్ణకంకణం, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మకు స్వర్ణ అంగుళీకం, ఆభరణ శిల్పి గణేష్‌కు అంగుళీకం ప్రదానం చేశారు. ప్రధాని మోదీ దూతగా ఎంపీ జీవీఎల్ నర్శింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తరపున ఎమ్మెల్యే, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి దంపతులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతినిధిగా జీవీడీ కృష్ణమోహన్ వేడుకలకు హాజరయ్యారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, విరంచి ఫ్యాషన్స్ అధినేత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, వేలాదిగా భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment