'గోవధను అరికట్టడంలో కేంద్రం విఫలం'
తిరుమల: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా దేశంలో గోవధ ఏమాత్రం తగ్గలేదని, గోవధను అరికట్టడంలో కేంద్ర సర్కార్ చొరవ చూపడంలేదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ ఆవేదన వ్యక్తంచేశారు.
మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గో హత్యలు జరక్కుండా, గోవులు తరలిపోకుండా, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రెండున్నరేళ్లకు ముందు హిందూ సమాజం అంతా ఏకమై బీజేపీకి అధికారం అప్పగించిందని గుర్తుచేశారు. అయినప్పటికీ గో హత్యలు, గో మాంస భక్షకుల సంఖ్య పెరగడంతో పాటు విదేశాలకు తరలిపోతున్నాయన్నారు. గంగా ప్రక్షాళన కూడా ఇంతవరకూ జరగలేదన్నారు. గోవధ అరికట్టాలని గోవులు పాలించే గోపాలుడైన గోవిందుని వేడుకున్నానన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ గగనతలంపై విమానాలు చక్కర్లు కొట్టడం అపచారమని, అయినప్పటికీ వాటిని అరికట్టడంలో కేంద్రం విఫలమైందన్నారు.