‘నా ఓటు ఒక్క రక్బార్ ఖాన్‌ను అయినా కాపాడుతుందా?’
చంఢీగడ్ : ప్రంపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మోదీ హయాంలో ఉగ్రవాదం, నక్సలిజం తగ్గింది అంటూ బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. మరి దేశం లోపల పెరిగిన హింస, అసంతృప్తి మాటేంటి అంటున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోయాయి. గో రక్షణ పేరిట దేశ వ్యాప్తంగా ముస్లింల మీద లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
గో రక్షణ పేరిట జరిగే మూక దాడుల గురించి తలచుకోగానే టక్కున గుర్తుకు వచ్చేది ఉత్తరప్రదేశ్ దాద్రీలో జరిగిన సంఘటన. మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఆవును చంపి.. మాంసాన్ని విక్రయిస్తున్నారనే అనుమానంతో కొందరు హిందూ కార్యకర్తలు అతని మీద దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటిదే మరో సంఘటన రాజస్తాన్ ఆల్వార్‌లో కూడా చోటు చేసుకుంది. ఈ దాడిలో 9మంది మరణించారు. ఈ దాడిలో కుటుంబ పెద్దలను కోల్పోయిన రెండు హరియాణా కుటుంబాల ప్రస్తుత పరిస్థితి గురించి.. ఈ ఎన్నికల్లో వారు ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు వంటి అంశాల గురించి వారి మాటల్లోనే..
హరియాణాలోని నూహ్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో రక్బార్, పిహ్లూ కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరి ప్రధాన జీవనాధారం పశుపోషణ. ఆవులను పెంచి.. తద్వారా లభించే పాడిని అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో పశువులను కొనుగోలు చేసేందుకు మరి కొందరితో కలిసి రాజస్తాన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు గో మాంసాన్ని అమ్ముతున్నారనే అనుమానంతో వీరి మీద దాడి చేశారు. ఈ దాడిలో రక్బార్, పిహ్లూలు కూడా మరణించారు. దాంతో ఈ రెండు కుటుంబాలు కుప్పకూలిపోయాయి. రక్బార్కు ఏకంగా ఏడుగురు సంతానం. వారి పోషణ భారం అంతా రక్బార్ భార్య ఆమినా మీద పడింది. ఓ వైపు భర్త చనిపోయిన దుఃఖం.. మరోవైపు కుటుంబ పోషణ ఆమినాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే విధికి ఆ కుటుంబం మీద ఇంకా పగ తీరినట్టు లేదు.
7మంది సంతానం.. భార్య మంచానికే పరిమితం...
రక్బార్ మరణించిన నాలుగు నెలలకే దురదృష్టం యాక్సిడెంట్ రూపంలో ఆమినాను వెంటాడింది. ఈ ప్రమాదంలో ఆమినా వెన్నెముక పూర్తిగా దెబ్బతింది. దాంతో ఆమె పూర్తిగా మంచానికే పరిమితమయ్యింది. ఆఖరుకి మలమూత్ర విసర్జనకు కూడా లేవలేని పరిస్థితి ఆమినాది. ప్రస్తుతం ఆమినా అమ్మగారింట్లో ఉంది. ఈ విషయం గురించి ఆమినా తల్లి కరిమాన్ మాట్లాడుతూ.. ‘ఆ రోజు జరిగిన దారుణంలో నా అల్లుడితో పాటు మరో ఎనిమిది మంది చనిపోయారు. నా కూతురు సగం చచ్చిపోయింది. అంటే ఈ దాడిలో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదిన్నర. వైద్యం కోసం ఆమినాను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం రెండు పూటలా తినడానికే గతి లేదు.. ఇక వైద్యులు చెప్పిన మందులు, ఆహారం ఇవ్వడం మా తరం కాదంటు’న్నారు కరీమాన్. ఈ మూక హత్యలపై ప్రస్తుతం ఆల్వార్ కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఎన్ని ఇబ్బందుల తలెత్తిప్పటికి కూడా కేసును మాత్రం వాపసు తీసుకోమంటున్నారు ఆమినా, ఆమె తల్లి కరిమాన్.
ఈ క్రమంలో కొందరు సామాజిక కార్యకర్తలు ఆమినా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆమినాకు పెన్షన్‌తో పాటు ఈ కుటుంబానికి బీపీఎల్ కార్డ్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారం అంతా పెద్ద కుమార్తె మీదనే పడిందంటున్నారు ఆమినా. ఆమె పేరు షాహిలా అని.. ప్రస్తుతం తమ అమ్మగారింటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో పశువులను మేపుతూ కుటుంబానికి ఆధారంగా నిలిచిందన్నారు. తనను ఇక్కడకు పిలవాలని అనుకుంటాము. కానీ రక్షణ గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాం అన్నారు.
ముస్లిం అనే మా నాన్నను చంపారు..
రక్బార్ ఖాన్‌తో పాటు మరో ఎనిమిది మంది మీద దాడి చేశారని చెప్పుకున్నాం కదా. ఆనాటి దాడిలో గాయపడి మరణించిన వారిలో పిహ్లూ కూడా ఉన్నాడు. ఈ విషయం గురించి పిహ్లూ కొడుకు మాట్లాడుతూ.. ‘మా నాన్న, నేను మరి కొందరం రాజస్తాన్‌లోని సంతకు వెళ్లి పశువులు బేరం చేశాము. అందుకు సంబంధించిన రశీదులు కూడా మా దగ్గర ఉన్నాయి. పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాం. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు. మా దగ్గర ఉన్న రశీదులను చింపి వేశారు. మేం ఆవులను చంపుతున్నామనే అనుమానంతో మా మీద దాడి చేయలేదు. మేం ముస్లింలం కాబట్టే దాడి చేశారు. ఎందుకంటే ఈ ఘటనలలో వారు మేం ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ని ఏం చేయలేదు. కారణం అతడు హిందువు.. అతని పేరు అర్జున్’ అని చెప్పుకొచ్చాడు.
అంతేకాక ‘ప్రస్తుతం కోర్టు ఖర్చులకు, కుటుంబ పోషణకు నెలకు దాదాపు రూ. 30 వేలు ఖర్చవతున్నాయి. కానీ నా సోదరుడు నెలంతా కూలి పనికి వెళ్తే మాకు దక్కుతుంది కేవలం ఏడు వేల రూపాయలే. ఈ సొమ్మును కూడా అధికభాగం కేసు కోసమే వినియోగిస్తున్నామ’ని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ప్రస్తుతం మా ప్రాంతంలో చాలా మంది ఆవులను పెంచాలంటనే భయపడుతున్నారు. దాని బదులు గొర్రెల్ని, మేకల్ని మేపడం మంచిదని భావిస్తున్నారు. ఆవుల్ని మేపితే ఏదో ఒక రోజు మేం కూడా చనిపోతాం అనే భయం ప్రస్తుతం ప్రతి ముస్లింలో ఉందన్నా’డు.
ఏ పార్టీకి ఓటు వేయ్యాలి...
ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు అప్పుడప్పుడు మా ఇళ్లకు వస్తుంటారు. ఈ కేసులో మేం తప్పక విజయం సాధిస్తామని చాలా ధైర్యంగా చెబుతారు. ఎందుకంటే వారి తరఫున బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా ఉన్నారు. వారికి మద్దతు కూడా తెలిపాడు. కోర్టులోనే తేల్చుకుంటామని పేర్కొన్నాడు అని తెలిపారు. మరి ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించగా.. ‘మా ఓటు ఎంతమంది రక్బార్ ఖాన్, పిహ్లూలను కాపాడగల్గుతుందని ప్రశ్నించారు. ఆవులను, గెదేలను పెంచే వారి మీద ఎలాంటి దాడులు జరగనివ్వం అని హామీ ఇచ్చేవారికే మా ఓటు. కానీ ఇంతవరకూ ఎవరు మాకు అలాంటి హామీ ఇవ్వలేకపోయార’ని ఇరు కుటుంబ సభ్యులు వాపోయారు.