పోలీసుల అదుపులో నిందితులు
భోపాల్ : గో హంతకులనే అనుమానంతో గ్రామస్తులు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా అమ్‌గారాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పూరానా బస్తీకి చెందిన రియాజ్, షకీల్‌లు కైమూర్ నుంచి తిరిగివస్తుండగా.. వారిని గో హంతకులుగా అనుమానించిన అమ్‌గారా గ్రామ యువకులు గ్రామంలోని ఇతరులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామంలోని వారంతా.. వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు సాత్నా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రియాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. టైలర్‌గా పనిచేస్తున్న రియాజ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. దీంతో సాత్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థతులు ఏర్పడ్డాయి.
ఈ ఘటనపై షకీల్ పోలీసులను ఆశ్రయించాడు. తాము గో హంతకులం కాదని ఆయన వారికి తెలిపారు. తప్పుగా అర్థం చేసుకున్న అమ్‌గారా గ్రామ ప్రజలు తమపై దాడికి దిగినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రియాజ్, షకీల్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని.. ఆవులను ఎత్తుకెళ్లడానికి వచ్చిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కిందపడి గాయపడట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment