సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణతో పాటు ఆలయంలో పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు భక్తులిచ్చిన కానుకల్లో రూ.16 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. కానీ, ఇప్పుడు వాటిపై సర్కారు కన్నుపడింది. గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం ఆ డిపాజిట్‌ను అర్జంటుగా రద్దుచేసి రూ.3కోట్లను ఖర్చుపెట్టాలని సీఎం పేషీ నుంచి దేవస్థానంపై ఒత్తిడి వస్తోంది. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల పరిస్థితి ఇప్పుడు ఇంతే.
రాష్ట్ర దేవదాయ శాఖ ఆధీనంలో మొత్తం 21,664 గుళ్లు ఉంటే, అందులో కాస్త చెప్పుకోదగ్గ ఆదాయం వచ్చే ఆలయాలు కేవలం 995నే. మరో 2,227 ఆలయాల్లో అర్చకులు, సిబ్బంది జీతాలు, పూజాది కార్యక్రమాలకు ఆదాయం ఏమాత్రం సరిపోని పరిస్థితి. మిగిలిన 18,442 ఆలయాలకు కనీస ఆదాయం కూడా లేకపోవడంతో వాటి బాగోగులను దేవదాయ శాఖ పట్టించుకోవడంలేదు. దీంతో ఆదాయంలేని ఆలయాల్లో నిత్య పూజల నిర్వహణకు 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొత్తగా ధూప దీప నైవేద్య కార్యక్రమం (డీడీఎన్‌ఎస్)ను ప్రారంభించి, మొదటగా.. ఇప్పుడున్న 13 జిల్లాల్లోని 1,910 గుళ్లకు దేవదాయ శాఖ ప్రతినెలా కొంత మొత్తం ఆర్థిక సహాయం చేసే ఏర్పాటుచేశారు. ఆదాయం బాగా వచ్చే ఆలయాల నిధుల్లో కొంత మొత్తం ఈ డీడీఎన్‌ఎస్‌కు కేటాయించి, ఏటా ఆలయాల సంఖ్యను పెంచుకుంటూపోవాలని అప్పట్లో ఆయన ఆదేశించారు. ఆ సంఖ్య ఇప్పుడు పెరగకపోగా, ప్రస్తుతం కేవలం 1,295 ఆలయాలకు మాత్రమే డీడీఎన్‌ఎస్ నిధులు మంజూరవుతున్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
నిజానికి దేవదాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులివ్వదు. ఆ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఆ శాఖ పరిధిలోని ఆలయాల ద్వారా వచ్చే ఆదాయం నుంచే అందరి జీతభత్యాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, దేవుడికి సమర్పించే కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోకూడదు. అంతేకాక, దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా, ఆలయ నిధులు దుర్వినియోగం కాకుండా, ఆలయాల్లో రోజు వారి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించడానికే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా చేసే సాయంతో పాటు శిథిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం వంటి కార్యక్రమాలకు దేవదాయ శాఖ ఇతర గుళ్ల నుంచి చెల్లిస్తుంది. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన వేరేలా ఉంది. తన విశేషాధికారాలను ఉపయోగించుకుని విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని దాదాపు రూ.8 వేల కోట్లకు పైబడి విలువ ఉండే దేవదాయ భూములను కారుచౌకగా లీజుకిచ్చేసింది.
అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, వైఎస్సార్ కడప జిల్లాలోని మరో అధికార పార్టీ నేత దేవుడి భూములను అక్రమంగా కారుచౌకగా కొనుగోలు చేస్తే, గత ప్రభుత్వాలు వాటిపై ఆంక్షలు పెట్టగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటికి ఆమోదం తెలిపింది. దీనికితోడు ప్రభుత్వ పెద్దలు బాగా ఆదాయం వచ్చే ఆలయాలను దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి, అ ప్రాంతంలోని అధికార పార్టీ నేతలను ఆయా ఆలయాల ట్రస్టీలుగా నియమించి వారికి సర్వాధికారాలు కల్పించింది. రూ.18 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, వంద కోట్లకు పైబడి భూములు ఉన్న విశాఖపట్నంలోని ఒక ఆలయాన్ని దేవదాయ శాఖ అధికారులు కాదంటున్నా ఆ శాఖ నుంచి తప్పించి అస్మదీయులకు కట్టబెట్టడం ఇందుకు ఉదాహరణ. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలున్నాయి. గత నాలుగున్నర ఏళ్ల కాలంలో దాదాపు 155 వరకు బాగా ఆదాయం, ఆస్తులున్న ఆలయాలు ఇలా చేతులు మారినట్లు సమాచారం.
నిధుల మళ్లింపునకు ప్రణాళిక రెడీ
ఈ నేపథ్యంలో పెద్ద ఆలయాలకు భక్తులు సమర్పించే కానుకల్లో కొంత మొత్తాన్ని చిన్న ఆలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన చంద్రబాబు సర్కార్.. అందుకు విరుద్ధంగా ఆలయాల బ్యాంకు డిపాజిట్లను రద్దుచేసి, గత ఎన్నికల హామీల అమలుకు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా రాష్ట్రంలో బాగా ఆదాయం ఉన్న వివిధ ఆలయాల పేరిట దాదాపు రూ. 1,800 కోట్ల మేర బ్యాంకు డిపాజిట్లు ఉంటాయని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే రెండు మూడు నెలల కాలంలో వీలైనంత మేర ఆ డిపాజిట్లను ముఖ్యమంత్రి హామీల అమలుకు మళ్లించడానికి ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రణాళిక సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment