Temples income
-
దేవుడి సొమ్ము ‘స్వాహా’!
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణతో పాటు ఆలయంలో పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు భక్తులిచ్చిన కానుకల్లో రూ.16 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. కానీ, ఇప్పుడు వాటిపై సర్కారు కన్నుపడింది. గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం ఆ డిపాజిట్‌ను అర్జంటుగా రద్దుచేసి రూ.3కోట్లను ఖర్చుపెట్టాలని సీఎం పేషీ నుంచి దేవస్థానంపై ఒత్తిడి వస్తోంది. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల పరిస్థితి ఇప్పుడు ఇంతే. రాష్ట్ర దేవదాయ శాఖ ఆధీనంలో మొత్తం 21,664 గుళ్లు ఉంటే, అందులో కాస్త చెప్పుకోదగ్గ ఆదాయం వచ్చే ఆలయాలు కేవలం 995నే. మరో 2,227 ఆలయాల్లో అర్చకులు, సిబ్బంది జీతాలు, పూజాది కార్యక్రమాలకు ఆదాయం ఏమాత్రం సరిపోని పరిస్థితి. మిగిలిన 18,442 ఆలయాలకు కనీస ఆదాయం కూడా లేకపోవడంతో వాటి బాగోగులను దేవదాయ శాఖ పట్టించుకోవడంలేదు. దీంతో ఆదాయంలేని ఆలయాల్లో నిత్య పూజల నిర్వహణకు 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొత్తగా ధూప దీప నైవేద్య కార్యక్రమం (డీడీఎన్ఎస్)ను ప్రారంభించి, మొదటగా.. ఇప్పుడున్న 13 జిల్లాల్లోని 1,910 గుళ్లకు దేవదాయ శాఖ ప్రతినెలా కొంత మొత్తం ఆర్థిక సహాయం చేసే ఏర్పాటుచేశారు. ఆదాయం బాగా వచ్చే ఆలయాల నిధుల్లో కొంత మొత్తం ఈ డీడీఎన్‌ఎస్‌కు కేటాయించి, ఏటా ఆలయాల సంఖ్యను పెంచుకుంటూపోవాలని అప్పట్లో ఆయన ఆదేశించారు. ఆ సంఖ్య ఇప్పుడు పెరగకపోగా, ప్రస్తుతం కేవలం 1,295 ఆలయాలకు మాత్రమే డీడీఎన్ఎస్ నిధులు మంజూరవుతున్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. నిజానికి దేవదాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులివ్వదు. ఆ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఆ శాఖ పరిధిలోని ఆలయాల ద్వారా వచ్చే ఆదాయం నుంచే అందరి జీతభత్యాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, దేవుడికి సమర్పించే కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోకూడదు. అంతేకాక, దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా, ఆలయ నిధులు దుర్వినియోగం కాకుండా, ఆలయాల్లో రోజు వారి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించడానికే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా చేసే సాయంతో పాటు శిథిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం వంటి కార్యక్రమాలకు దేవదాయ శాఖ ఇతర గుళ్ల నుంచి చెల్లిస్తుంది. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన వేరేలా ఉంది. తన విశేషాధికారాలను ఉపయోగించుకుని విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని దాదాపు రూ.8 వేల కోట్లకు పైబడి విలువ ఉండే దేవదాయ భూములను కారుచౌకగా లీజుకిచ్చేసింది. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, వైఎస్సార్ కడప జిల్లాలోని మరో అధికార పార్టీ నేత దేవుడి భూములను అక్రమంగా కారుచౌకగా కొనుగోలు చేస్తే, గత ప్రభుత్వాలు వాటిపై ఆంక్షలు పెట్టగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటికి ఆమోదం తెలిపింది. దీనికితోడు ప్రభుత్వ పెద్దలు బాగా ఆదాయం వచ్చే ఆలయాలను దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి, అ ప్రాంతంలోని అధికార పార్టీ నేతలను ఆయా ఆలయాల ట్రస్టీలుగా నియమించి వారికి సర్వాధికారాలు కల్పించింది. రూ.18 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, వంద కోట్లకు పైబడి భూములు ఉన్న విశాఖపట్నంలోని ఒక ఆలయాన్ని దేవదాయ శాఖ అధికారులు కాదంటున్నా ఆ శాఖ నుంచి తప్పించి అస్మదీయులకు కట్టబెట్టడం ఇందుకు ఉదాహరణ. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలున్నాయి. గత నాలుగున్నర ఏళ్ల కాలంలో దాదాపు 155 వరకు బాగా ఆదాయం, ఆస్తులున్న ఆలయాలు ఇలా చేతులు మారినట్లు సమాచారం. నిధుల మళ్లింపునకు ప్రణాళిక రెడీ ఈ నేపథ్యంలో పెద్ద ఆలయాలకు భక్తులు సమర్పించే కానుకల్లో కొంత మొత్తాన్ని చిన్న ఆలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన చంద్రబాబు సర్కార్.. అందుకు విరుద్ధంగా ఆలయాల బ్యాంకు డిపాజిట్లను రద్దుచేసి, గత ఎన్నికల హామీల అమలుకు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా రాష్ట్రంలో బాగా ఆదాయం ఉన్న వివిధ ఆలయాల పేరిట దాదాపు రూ. 1,800 కోట్ల మేర బ్యాంకు డిపాజిట్లు ఉంటాయని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే రెండు మూడు నెలల కాలంలో వీలైనంత మేర ఆ డిపాజిట్లను ముఖ్యమంత్రి హామీల అమలుకు మళ్లించడానికి ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రణాళిక సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
సేవలు కాదు వితరణలు..
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజాదికాలను ఆర్జిత సేవలుగా పేర్కొంటారు. తోమాల సేవ, ఊంజల్ సేవ, పవళింపు సేవ.. ఇలా వాటికి ఎన్నో పేర్లు. ఈ పేర్లలో ‘సేవ’ అన్న పదం ఉండటమే కొంపముంచిందని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ‘సేవ’లను సర్వీస్ (సేవ)గా పరిగణిస్తూ వాటి రూపంలో వచ్చే ఆదాయాన్ని జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తెచ్చింది. ఇప్పుడు వాటి పేర్లు మార్చి సేవ అన్న పదం లేకుండా చూడాలని దేవాలయాల అధికారులు దేవాదాయశాఖ దృష్టికి తెచ్చారు. దీంతో సేవ అన్న పదం బదులు వితరణ అన్న పదంగాని ఆ అర్థం వచ్చే మరేదైనా పదం గాని జోడించాలని సూచించారు. దీన్ని దేవాదాయ శాఖ కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. త్వరలో పేర్లను అధికారికంగా మార్చనున్నట్టు సమాచారం. దేవాలయాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కొన్ని దేవాలయాల నిర్వాహకులు ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయాలని నిర్ణయించారు. జీఎస్టీతో కుదేలు..: గతేడాది జూన్ కంటే ముందు దేవాలయాలపై పన్ను లేదు. జీఎస్టీ అమలులోకి రావటంతో పరిస్థితి మారిపోయింది. ప్రసాదాల తయారీ కోసం కొనే వస్తువులు, ఆర్జిత సేవలపై 18% జీఎస్టీ పడుతోంది. ఆలయాల ఆదాయంలో 12% దేవాదాయశాఖకు, 3% అర్చక సంక్షేమ నిధికి, మరో 3% సర్వశ్రేయోనిధికి జమకడుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీ కూడా తోడవటంతో ఆదాయం సరిపోక కొన్ని చోట్ల జీతాలకూ ఇబ్బంది పడాల్సి వస్తోందని దేవాలయ కార్యనిర్వహణాధికారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రసాదాలకు కూడా వితరణ, చందా అర్థం వచ్చేలా పేర్లు మార్చాలంటున్నారు. -
అర్చకులకే శఠగోపం..!
160 ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా అందని వేతనాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయాల ఆదాయం భారీగా పెరుగుతోంది. కొన్నిచోట్ల బడ్జెట్ కోట్ల రూపాయలు దాటుతోంది. అయినా అర్చకులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించని దుస్థితి. కొన్ని నెలలుగా వేతనాలు సరిగా చెల్లించకపోతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 160 దేవాలయాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పాలకమండళ్లతోపాటు కొందరు అధికారుల అవినీతి కారణంగానే ఈ దుస్థితి. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో అక్రమాలు పెచ్చరిల్లి.. దేవాలయాలకు వస్తున్న ఆదాయం పక్కదారి పడుతోంది. ఓ ఆలయానికి ఎంత ఆదాయం వస్తోంది, అందులో దేవాదాయశాఖకు చెల్లించాల్సిందెంత, ఆలయ ఖర్చులకు, సిబ్బంది జీతభత్యాలకు చేస్తున్న వ్యయం ఎంతనే లెక్కల్లో స్పష్టత ఉండడం లేదు. చాలా దేవాలయాల్లో అర్చకులు, సిబ్బందికి రెండు మూడు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. అదేమంటే ఆదాయం సరిపోవడం లేదనే సమాధానం వస్తోంది. కొన్ని నెలలుగా అందని జీతాలు దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 635 ఆల యాలున్నాయి. వాటిలో కొన్నింటికే పాలక మండళ్లు ఉన్నాయి. పాలక మండళ్లు లేని చోట కార్యనిర్వహణాధికారు(ఈవో)ల పాలన. వీటికితోడు పలు ఆలయాలను వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొత్తంగా దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయాల్లో 5,600 మంది అర్చకులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరేగాకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారు. అయితే వేములవాడ, యాదగిరిగుట్ట వంటి పలు ప్రధాన దేవాలయాలు కాకుండా.. చాలా ఆలయాల్లో అర్చకులు, సిబ్బందికి సరిగా వేతనాలు అందడం లేదు. కామారెడ్డి సమీపంలోని భిక్కనూరు సిద్ధరామేశ్వరస్వామి ఆలయంలో కొన్ని నెలలుగా సిబ్బందికి, అర్చకులకు జీతాలు చెల్లించడం లేదు. హైదరాబాద్ శివార్లలో ఉండి, రూ.కోట్లలో వార్షికాదాయం ఉన్న కీసర రామలింగేశ్వరస్వామి ఆలయంలోనూ సకాలంలో వేతనాలు అందడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, మెదక్ జిల్లాలోని నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి... ఇలా చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా దేవాలయాల్లో ఇదే దుస్థితి. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడానికి అర్చకులు, సిబ్బంది జంకుతున్నా రు. తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుం దోనని భయపడుతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పాలకమండళ్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయం ఏమవుతోంది? ఆలయానికి సమకూరే మొత్తం ఆదాయంలో 12 శాతాన్ని దేవాదాయశాఖ అధికారుల వేతనాల కోసం ఆ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. సర్వశ్రేయోనిధికి మరో 3శాతం సమర్పించాలి. మరో 30శాతానికి మించకుండా నిధులను జీతాలకు కేటాయించాలి. మిగిలే నిధులను ఆయా ఆలయాల నిర్వహణ, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. దేవాదాయశాఖకు అందాల్సిన మొత్తాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వసూలు చేస్తున్నారు. ఆల య ఖర్చులు, సిబ్బంది జీతభత్యాల విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసిన ప్పుడు.. సరుకుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు తేలింది. దీనిపై అధికారులు దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇలా చాలాచోట్ల అధికారులు తప్పుడు బిల్లులు సమర్పిస్తూ దేవుడి నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మరీ విచ్చలవిడిగా కొనసాగుతుండడంతో దేవాలయాల్లో నిధులకు కటకట ఎదురవుతోంది. చివరికి అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేనందున తమకేమీ పట్టనట్లు ఉండిపోతున్నారు. తమకు జీతాలు సరిగా రావడం లేదని.. ఈ సమస్యను పరిష్కరించాలంటూ అర్చకులు, సిబ్బంది చేస్తున్న విజ్ఞప్తులు అరణ్యరోదనే అవుతున్నాయి. ‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు పట్టదా..? అర్చకులు, ఆలయ సిబ్బంది తమ వేతనాల సమస్యపై ఆందోళనలు చేయడంతో కొన్నేళ్ల కింద ‘ప్రత్యేక నిధి’ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేవాలయాల ఆదాయంలో 30 శాతం వరకు అర్చకులు, సిబ్బంది వేతనాల కోసం వెచ్చిస్తున్నారు. పలు దేవాలయాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడం, మరికొన్ని చోట్ల తక్కువగా ఉండడంతో కనీస వేతనాల్లో వ్యత్యా సం వస్తోంది. అంతేగాకుండా ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడంతో ఆదా య, వ్యయాల లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు అన్ని ఆలయాల ఆదాయం నుంచి 30 శాతం చొప్పున వసూలు చేసి ‘ప్రత్యేక నిధి’ని ఏర్పాటు చేయాలని... ఆ నిధి నుంచే అర్చకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దీనివల్ల ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ఆలయాల అర్చకులు, సిబ్బందికి వేతనాలు సకాలంలో అందడంతోపాటు, ఆలయాల ఆదాయ, వ్య యాలను ప్రభుత్వం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఐదురుగు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ సబ్ కమిటీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేయకపోవడం గమనార్హం. తమ అవకతవకలు బయటపడతాయని కొందరు పాలక మండళ్ల సభ్యులు, అధికారులు... పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సబ్ కమిటీ పరిశీలనను జాప్యం చేసేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.