
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజాదికాలను ఆర్జిత సేవలుగా పేర్కొంటారు. తోమాల సేవ, ఊంజల్ సేవ, పవళింపు సేవ.. ఇలా వాటికి ఎన్నో పేర్లు. ఈ పేర్లలో ‘సేవ’ అన్న పదం ఉండటమే కొంపముంచిందని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ‘సేవ’లను సర్వీస్ (సేవ)గా పరిగణిస్తూ వాటి రూపంలో వచ్చే ఆదాయాన్ని జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తెచ్చింది. ఇప్పుడు వాటి పేర్లు మార్చి సేవ అన్న పదం లేకుండా చూడాలని దేవాలయాల అధికారులు దేవాదాయశాఖ దృష్టికి తెచ్చారు. దీంతో సేవ అన్న పదం బదులు వితరణ అన్న పదంగాని ఆ అర్థం వచ్చే మరేదైనా పదం గాని జోడించాలని సూచించారు. దీన్ని దేవాదాయ శాఖ కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. త్వరలో పేర్లను అధికారికంగా మార్చనున్నట్టు సమాచారం. దేవాలయాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కొన్ని దేవాలయాల నిర్వాహకులు ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
జీఎస్టీతో కుదేలు..: గతేడాది జూన్ కంటే ముందు దేవాలయాలపై పన్ను లేదు. జీఎస్టీ అమలులోకి రావటంతో పరిస్థితి మారిపోయింది. ప్రసాదాల తయారీ కోసం కొనే వస్తువులు, ఆర్జిత సేవలపై 18% జీఎస్టీ పడుతోంది. ఆలయాల ఆదాయంలో 12% దేవాదాయశాఖకు, 3% అర్చక సంక్షేమ నిధికి, మరో 3% సర్వశ్రేయోనిధికి జమకడుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీ కూడా తోడవటంతో ఆదాయం సరిపోక కొన్ని చోట్ల జీతాలకూ ఇబ్బంది పడాల్సి వస్తోందని దేవాలయ కార్యనిర్వహణాధికారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రసాదాలకు కూడా వితరణ, చందా అర్థం వచ్చేలా పేర్లు మార్చాలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment