సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ఒక్కటి కాదని, దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని దేవాలయాలకు మాత్రమే 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేలా చట్టంలో ఉందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ చెప్పారు. దేవాదాయశాఖ పరిధిలో లేని దేవాలయాల వద్ద మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదన్న నిబంధన చట్టంలో లేదని స్పష్టం చేశారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలు చేయబోయే నూతన కల్లుగీత(ట్యాడీ) పాలసీపై 13 జిల్లాల గీత కార్మిక సంఘాలతో ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమõßహేంద్రవరంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మద్యాన్ని ఆదాయ వనరుగా చూడట్లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా తమ ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల విజ్ఞప్తి మేరకు 600 దుకాణాలను తరలించామన్నారు. మద్యం దుకాణాలు వద్దని చేసే ఉద్యమాల్లో సగం డబ్బులిచ్చి(పెయిడ్ ఈవెంట్స్) చేయిస్తున్నవేనని మంత్రి వ్యాఖ్యానించారు.
మద్యం దుకాణం పర్మిట్ రూం 50 చదరపు మీటర్లకు మించి ఎంతైనా ఉండొచ్చని ఓ ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పారు. విశాఖ మన్యంలోని ఆరు మండలాల్లో గంజాయి సాగు నియంత్రణపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. త్వరలో 500 మందితో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. గీత కార్మికుల వినతులపై చర్చించి వచ్చేనెల 1 నుంచి ఐదేళ్ల కాలపరిమితికి కల్లుగీత పాలసీని అమలు చేస్తామన్నారు. కేరళ, మహారాష్ట్రల్లో ఈత కల్లు నిల్వ చేస్తున్న విధానంపై అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నీరా తయారీకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తాడిచెట్టుతోపాటు ఈత, కొబ్బరిచెట్లపై నుంచి ప్రమాదవశాత్తు పడిన కార్మికుడికి బీమా అందించేలా నూతన పాలసీలో మార్పులు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎౖMð్సజ్ శాఖ కమిషనర్ లక్ష్మీ నరసింహం, తూర్పుగోదావరి జిల్లా డీసీ అరుణారావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ హేమంత్ నాగరాజు, రాజమహేంద్రవరం ఈఎస్ సూర్జిత్‌సింగ్ పాల్గొన్నారు.
Published Sun, Sep 24 2017 2:44 AM | Last Updated on Sun, Sep 24 2017 2:47 AM
Advertisement