సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. అనాదిగా ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉందని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు.
ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సమయంలో దీనిపై సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలలోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
610 ఆలయాలకు త్వరలో నియామకం!
హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం దేవదాయ శాఖ పరిధిలో ఐదు లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ.ఐదు లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాలు 1,234 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రస్టు బోర్డు నియామకాలు పూర్తైన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది.
నాడు అవమానం.. నేడు సముచిత స్థానం
ఆలయాల ట్రస్టు బోర్డు నియామకాల్లో తమకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో తాము అవమానాలు ఎదుర్కొనగా ఇప్పుడు సముచితం స్థానం దక్కిందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆలయాల నిర్వహణలో తమకు తగిన స్థానం కల్పించాలని కోరిన నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను అధికారంలో ఉండగా చంద్రబాబు తీవ్రంగా అవమానించారని గుర్తు చేస్తున్నారు. నాడు సచివాలయంలో తనను కలసి సమస్యలు వినిపించిన సంఘాల నేతలనుద్దేశించి ‘తోకలు కత్తిరిస్తా.. ఆలయాల మెట్లు కూడా ఎక్కకుండా చేస్తా’ అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
దేశ చరిత్రలోనే అరుదు
దేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం దక్కింది. మా వినతిని ఆలకించి ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించింది. సీఎం జగన్‌కు నాయీ బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది.
– సిద్దవటం యానాదయ్య (ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్), గుంటుపల్లి రామదాసు (కేశ ఖండనశాల నాయీ బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment