
ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న దేవదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, ఒంగోలు మెట్రో: దేవదాయ, ధర్మాదాయ శాఖ ప్రతిష్టను పెంచుతామని, అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఒంగోలు వచ్చిన మంత్రి పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ క్రమంలో సాయంత్రం ఏడు గంటలకు ఒంగోలు కొండ మీద శ్రీ ప్రసన్న చెన్నకేశవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాలయాల్లో పవిత్రతను కాపాడుతామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన చేయటానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కోరిన విధంగా దేవుడు సహకరించాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 100 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రూ.230 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆస్తులు పరిరక్షించటానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతామన్నారు.
ప్రగతి పథంలో రాష్ట్రం..
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దశల వారీగా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పయనింపజేస్తున్నారని మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేయటం ఈ ప్రభుత్వ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు. మరో పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్చక సంక్షేమ సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని, అర్చకుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతామన్నారు. అదేవిధంగా ఆలయాలలో నిత్య ధూప దీప నైవేధ్యాలకు నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అర్చకులకు సొంత గృహాల కల నెరవేర్చేందుకు కృషి చేయటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
అనంతరం ఆయన త్రోవగుంటలోని శివాలయం, వైష్ణవాలను సందర్శించారు. ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు పరాంకుశం రామనాథాచార్యులు, ఆలయ అధికారులు మంత్రిని సత్కరించి ఆశీర్వచనాలు చేశారు. కాగా మంత్రి వెంట ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, సూపర్‌బజార్ మాజీ తాతా ప్రసాద్‌లతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు ఉన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, సహాయ కమిషనర్ డి.సుబ్బారావు, ఇవో కట్టా ప్రసాద్, ఒంగోలు ఆర్‌డీవో పి.కిషోర్, తహసీల్దార్ చిరంజీవి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
మంత్రిని కలిసిన అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు..
ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి దర్శనం సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావును జిల్లా అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి పలు సమస్యలు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా ధార్మిక పరిషత్తును పునః ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు. అదేవిధంగా దేవదాయ శాఖ చట్టం 144 ప్రకారం ప్రతి ఆలయానికి వొనగూరవలసిన ప్రయోజనాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని, జీవో నెంబర్ 76 ఫైనల్ నోటిఫికేషన్ వెలువరించాలని వారు విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో అర్చక సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోమరాజుపల్లి నాగేశ్వరరావు, ఎంవీ శేషాచార్యులు తదితరులు ఉన్నారు.
మంత్రి వెలంపల్లి పర్యటన ఇలా..
ఒంగోలు సిటీ: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం కూడా జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఒంగోలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగర శివారు త్రోవగుంటకు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు లాయరుపేటలోని సాయిబాబా మందిరం సందర్శిస్తారు. బాబా పూజలో పాల్గొంటారు. 8.30 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ రంగుతోటలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొంటారు. 9.30 గంటలకు చీమకుర్తి వెళ్తారు. 10.30 గంటలకు చీమకుర్తి రీచ్ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మానంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చీమకుర్తి నుంచి బయల్దేరి ఒంగోలు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతి వెళ్తారు. రాత్రికి తిరుపతిలో బస చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment