
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన విషయాన్ని తాజాగా గుర్తించినట్లు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శాఖాపరంగా నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూములు మాయం కావడం నిజమేనని అధికారులు కమిటీ తేల్చిందని, దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారో తేలాలంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2017లో చోటు చేసుకున్న ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీ విచారణ జరిపి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు సమర్పించింది. ఆ నివేదికను జత చేస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుతోనే..
గత సర్కారు ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల భూముల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్టు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో భూములను తొలగించారు. ఇనామ్ భూముల కేటగిరీలో తొలగించిన వాటిలో 21 సర్వే నంబర్లకు సంబంధించి ‘మీ భూమి’ పోర్టల్‌లో ఇప్పటికీ ఆలయ భూములు పేరుతో ఉన్నట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. ఆ సర్వే నెంబర్ల వివరాలను కమిటీ నివేదికలో వెల్లడించింది.
కమిషనర్ అనుమతి లేకుండా తొలగింపు..
దేవదాయ శాఖ చట్ట నిబంధనలన్నీ ఉల్లంఘించి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 862.22 ఎకరాలను తొలగించినట్లు అధికారుల కమిటీ తేల్చింది. దీనికి సంబంధించి అప్పటి ఆలయ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. 2016 సెప్టెంబరు 19, అక్టోబరు 4వతేదీన ఈ భూముల తొలగింపునకు అప్పటి ఈవో ప్రతిపాదిస్తే అప్పటి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారని నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత మరో అధికారి 2017 ఏప్రిల్ 24వ తేదీన అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చారని కమిటీ నివేదికలో తెలిపింది.
మరో 2144 ఎకరాలూ దేవుడి భూములే..
862.22 ఎకరాల భూముల సంగతి అలా ఉంచితే మరో 2144.37 ఎకరాల సింహాచలం ఆలయ భూములు ఇప్పటికీ ఆలయ ఆస్తుల జాబితాలో చేరలేదని కమిటీ తేల్చింది. ఈ భూములకు సంబంధించి సింహాచలం ఆలయం పేరిట పట్టా తీసుకునే ప్రక్రియ రెవిన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లోనే ఉందని పేర్కొంది. టీడీపీ హయాంలో వీటిని సింహాచలం ఆలయం పేరిట నమోదుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ కార్యాలయం నుంచి పలుమార్లు ఆలయ అధికారులకు ఆదేశాలు వెళ్లినా అమలుకు నోచుకోలేదని వెల్లడించింది.
సహకరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు..
నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ప్రభుత్వానికి సూచించారు. అప్పటి ఆలయ ఈవో, నాటి విశాఖ అసిస్టెంట్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment