
ఈఓ నారాయణచార్యులుతో వాదిస్తున్న గ్రామస్తులు
సాక్షి, నేలకొండపల్లి: కొంత కాలంగా శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మరో విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగుతోంది. స్థానిక శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం పూజారి లక్ష్మినర్సయ్య సొంత ఖర్చులతో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని దేవాలయంలో ఏర్పాటు చేయించేందుకు పూనుకున్నారు. ఈ విషయంలో ఎవరినీ సంప్రందించకుండానే ప్రతిమను తీసుకొచ్చి దేవాలయంలో ఉంచారు.
ఈ విషయాన్ని అక్కడి ఈఓకు, సంబంధిత ఆలయ పూజారికి చెప్పినట్లు లక్ష్మినర్సయ్య వివరించారు. కాగా అసలు ఆ విషయం తమకేమీ తెలియదని మాతో చర్చించలేదని ఈఓ, పూజారులు తెలిపారు. దీంతో ఈ వివాదం కొంత కాలంగా కొనసాగుతోంది. వీరికి తోడు గ్రామ పెద్దలు రెండు వర్గాలకు మద్దతు ఇవ్వటంతో వివాదం తారా స్థాయికి చేరింది. కమిషనర్‌కు ఫిర్యాదులు అందటంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ దేవాదాయశాఖ స్థపతి వల్లి నాయగాన్ని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శనివారం స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గ్రామ సభను నిర్వహించారు.
రెండు వర్గాల వారు వారి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా స్థపతి వల్లి నాయగం మాట్లాడుతూ.. ఒకే దేవాలయంలో రెండు విగ్రహాలు ఉండకూడదన్నారు. ఇతర దేవుళ్ల విగ్రహాలు ఉండవచ్చు కానీ అదే దేవుళ్ల విగ్రహాలు రెండు ఉండకూడదని అన్నారు. దాని వల్ల దేవాలయం సానిధ్యాం పోతుందని అన్నారు. సాంప్రదాయం, నియమ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వయంభుగా వెలిసినందున్న మరో విగ్రహం పెట్టటం మంచిది కాదని, గ్రామం క్షేమం కోసం విగ్రహ ప్రతిష్ఠకు తిరస్కరిస్తున్నామని అన్నారు. సభలో చప్పట్ల ద్వారా నిర్ణయాన్ని అంగీకరించారు.
కొంత కాలంగా తారా స్థాయికి చేరిన వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ సభలో అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వర్లు, ఈఓ నారాయణచార్యులు, సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ ఏడుకొండలు, గ్రామ పెద్ధలు గూడవల్లి రాంబ్రహ్మం, రావెళ్ల సుదర్శన్‌రావు, చవళం వెంకటేశ్వరరావు, మామిడి వెంకన్న, కాసాని లింగయ్య, మైసా శంకర్, తోట వెంకటేశ్వర్లు, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, బల్లి వెంకన్న, కాండూరి వేణు, కడియాల నరేష్, బాజా నాగేశ్వరరావు, నిమ్మగడ్డ నగేష్, యార్లగడ్డ నాగరాజు, గొలుసు రవి పాల్గొన్నారు.