
కార్డులను ఆవిష్కరిస్తున్న మంత్రి వెలంపల్లి, ఏపీ పోస్టల్ చీఫ్ వెంకటేశ్వర్లు తదితరులు
సాక్షి,అమరావతి/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో పెద్ద, ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలు వంటివి భక్తులకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామాలైన అమరారామం (అమరావతి), సోమారామం (భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), భీమారామం (ద్రాక్షారామం), కుమారారామం (సామర్లకోట) చిత్రాలు ముద్రించిన ఐదు రకాల పోస్టు కార్డులను పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించింది.
ఈ పోస్టుకార్డులను మంత్రి వెలంపల్లి బుధవారం విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయా ఆలయాల్లోనూ పోస్టల్ శాఖ, దేవదాయ శాఖ అధికారులు పోస్టుకార్డుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో ఏకకాలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలు, దేవాలయాలపై పోస్టు కార్డులు ప్రింట్ చేయడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, విజయవాడ సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ టి.యం. శ్రీలత, రీజియన్ పోస్టల్ డైరెక్టర్ ఎస్.రంగనాథన్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కేవీఎల్‌ఎన్ మూర్తి, విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కందుల సుదీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment