
పూర్వం ‘‘ఉపమన్యుడనే బాల భక్తుడు పాలకై పరమేశ్వరుని ప్రార్థించగా, శివుడు కరుణించి తన త్రిశూలాన్ని అక్కడి నేలపై గుచ్చాడట. అప్పుడు ఆ ప్రదేశం నుంచిపాలు ఉద్భవించాయని, అందుకే దీనికి ‘క్షీరపురం’,పాలకొలను’’ అన్న పేర్లు కలిగాయని, అలాగే ఆ బాలభక్తుడి పేరు మీదుగా ‘ఉపమన్యుపురం’ అనే పేరు వచ్చిందని పండితుల వాక్కు. అదే నేటి పాలకొల్లు.
ఆలయ విశేషాలు...
క్షీరారామంలో వెలసిన స్వామి శ్రీ క్షీరా రామలింగేశ్వరుడు. తెల్లగా పాల వలె మెరిసే ఈ శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగంపై ఉన్న నొక్కులు కుమారస్వామి అమృత లింగాన్ని భేదించినపుడు తగిలిన బాణపు దెబ్బలని భక్తుల విశ్వాసం. ఈ శివలింగం పై భాగం మొనతేలి ఉండటంతో ఇది శివుడి కొప్పు భాగాన్ని సూచిస్తోందని పెద్దల వాక్కు. కాగాశాసనాల్లో ఈ స్వామిని ‘కొప్పు లింగేశ్వరుడు’గా పేర్కొనటం విశేషం. ప్రతి ఏడాదీ ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ సమయాల్లో, భానుడి కిరణాలు పెద్దగోపురం రెండో అంతస్థు నుంచి ప్రాకారాల మధ్యగా క్షీరా రామలింగేశ్వర లింగంపై ప్రసరించటం విశేషం.
చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్!
పెద్దగోపురం...
దేవాలయానికి శిఖరం–శిరస్సు, గర్భాలయం–కంఠం, ధ్వజస్తంభం–జీవం కాగా గోపురం పాదం లాంటిదని ఆగమశాస్త్రం చెబుతోంది. ఎంతో పురాణ, చారిత్రక ప్రాశస్త్యం, అద్భుత శిల్పకళ కలిగిన శ్రీ క్షీరారామలింగేశ్వరాలయ గోపురం పాలకొల్లు పెద్దగోపురంగా ప్రసిద్ధి పొందింది. ఇది సుమారు 120 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్థులతో గోపురం చివరిదాకా వెళ్లేందుకు అనువుగా లోపలి వైపు మెట్లు కలిగి ఉంది. ఈ గోపురం మీది ఎన్నో అద్భుత శిల్పాలు చూపరులను కట్టి పడేస్తాయి.
ఉత్సవాలు...
ఈ క్షేత్రంలో ఉగాది, చైత్రశుద్ధ దశమినాడు స్వామి వార్ల కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశినాడు రథోత్సవం, వినాయక చవితి, శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి, కార్తీకమాస అభిషేకాలు, జ్వాలా తోరణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ముక్కోటి, లక్ష కుంకుమ, బిల్వార్చనలు, కోటి బిల్వార్చనలు, సహస్ర ఘటాభిషేకాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇవి కాక ఆయా సందర్భాలలో మరెన్నో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మహా శివరాత్రి నాడు శ్రీ పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర, లక్ష్మీ జనార్ధనుల ఊరేగింపు రంగురంగుల విద్యుద్దీప కాంతుల నడుమ సాంçస్కృతిక వేడుకలతో కన్నుల పండుగగా జరుగుతుంది. పర్వదినాల్లో భక్తి, భజన కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు జరుగుతాయి.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment