palkollu
-
‘ఓటమి భయంతోనే కులాల మధ్య చిచ్చు’
సాక్షి, పాలకొల్లు: ప్రజలు నుంచి ఊహించిన దానికంటే అనూహ్యమైన స్పందన వస్తోందని, ఒకప్పుడు టీడీపీకి వెన్నుముఖలా ఉండే బీసీలు ఇప్పుడు తమ పార్టీకి అండగా ఉన్నారని నర్సాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పాలకొల్లు పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983లో ఎన్టీ రామారావు ఎటువంటి ప్రభంజనంతో గెలిచారో ఇప్పుడు అన్ని కులాల సహకారంతో అటువంటి ప్రభంజనంతో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పాలకొల్లులో ఒక పెద్దాయన టామి అనే సినిమా తీశారని, ఆ కుక్క ఆయన్నుకరచినట్లు ఉంది.. అందుకే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్యను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తన తాత సిరీస్ రాజు పేరుతో రాజకీయాలు చేయాలని చూడటం దారుణమన్నారు. వంగవీటిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మా తాతే వంగవీటి రంగాను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది తన తాత సిరీస్ సుబ్బరాజు అని తెలిపారు. వంగవీటి మోహన్‌రంగా తనకు అత్యంత ఆప్తులు అని చెప్పారు. చంద్రబాబు నాయుడే, వంగవీటి రంగాని చంపించారని హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 1989లో జరిగిన హత్య ఉదంతాన్ని 2019 ఎన్నికల్లో తన మీద వాడుకోవడం చూస్తే జాలేస్తుందని అన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్నానని, కండువాలు మార్చానని నాగబాబు వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. నాగబాబు ముందు ప్రజారాజ్యంలో లేరా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయలేదా అని సూటిగా అడిగారు. జనసేన పార్టీ నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టారని, అది ఇప్పుడు రెండు కండువాలతో కలసిందని విమర్శించారు. 2014లో మోదీ, చంద్రబాబు పార్టీలతో కలిశారు.. మళ్లీ బయటకు వచ్చి ఇప్పుడు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో కలిశారు. నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఎన్ని కండువాలు వేసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. హరిరామ జోగయ్య టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఇలా అన్ని పార్టీల్లో చేరి తీరా సీటు రాకపోవడంతో ఇప్పుడు జనసేన పార్టీలో చేరింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. హరిరామ జోగయ్య 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఏ మాత్రం సంబంధం లేని తమపై రుద్ది నిందలు వేయడం సరికాదన్నారు. అన్న నాగబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. తమ్ముడు పవన్ కల్యాణ్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. నాగబాబుకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. -
శభాష్ పావని..
శ్రీ గౌతమి కిరాయి హత్య ఉదంతంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో టీడీపీ పరువు పూర్తిగా బజారున పడింది. ఈ కేసును పక్కదోవ పట్టించడంలో పోలీసులపై రాష్ట్రస్థాయి నేతల హస్తం ఉందనే ప్రచారానికి బలం చేకూరుస్తూ జరుగుతున్న పరిణామాలు కూడా టీడీపీని గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం : ఓ యువతిని టీడీపీ నేత సజ్జా బుజ్జి ప్రమాదం మాటున కిరాతకంగా హత్య చేయించడం, సాక్షాత్తు ప్రజాప్రతినిధిగా ఉన్న జడ్పీటీసీ బాలం ప్రతాప్ హత్యలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి బట్టబయలు కావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. అయితే దీనిని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా నెపాన్ని పోలీసులపై వేసే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో కేసు విచారణలో పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ఇప్పటికే బహిర్గతమయ్యింది. అప్పట్లో విచారణ అధికారులుగా ఉన్న పోలీసులు తప్పు చేసిన విషయాన్ని ఎవరూ కాదనే పరిస్థితిలేదు. అయితే ఎలాంటి పూర్తిస్థాయి విచారణ లేకుండా కేవలం 10 రోజుల్లోనే పోలీసులు కేసు క్లోజ్ చేసే సాహసం చేశారంటే, వెనుక బడా వ్యక్తులు లేకపోతే అంత ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఈ అంశాలను పక్కదారి పట్టిస్తూ అప్పటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నరసాపురం డీఎస్పీ, పాలకొల్లు రూరల్ సీఐ, పాలకొల్లు రూరల్ ఎస్సైలపై చర్యలు ఉంటాయని, కేసును డీల్ చేసిన ఏఎస్పీ రత్నకు మెమో జారీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదట్లోనే ఈ కేసు విచారణ పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడమైతే ఖాయంగా కనిపిస్తోంది. తెరవెనుక వ్యక్తులు ఎవరు పథకం ప్రకారం యువతిని హత్య చేసిన సజ్జా బుజ్జి అండ్ కో ఎలాంటి జంకూ లేకుండా తరువాత ఏడాదిన్నర కాలంగా దైనందిన జీవితాన్ని గడిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, బ్యాంకాక్ టూర్లకు తిరుగుతూ గడిపారు. పై స్థాయి వ్యక్తుల అండలేకపోతే ఇది సాధ్యంకాదని తెలుస్తోంది. అప్పట్లో విచారణ అధికారులుగా వ్యవహరించిన పోలీసు అధికారులదీ, సజ్జా బుజ్జిది ఒకే సామాజికవర్గం, అదీ సీఎం సొంత సామాజికవర్గం. మంత్రి లోకేష్‌బాబు సిఫార్సులు మేరకే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. అయితే బుజ్జి అండ్‌కో ను పైస్థాయి నాయకుల వరకూ తీసుకెళ్లడానికి స్థానికంగా ఉన్న అదే సామాజికవర్గానికి చెందిన ఓ బడా వ్యక్తి సహాయపడినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మరికొందరి వ్యవహారాలపై సీఐడీ వద్ద సమాచారం ఉందనే ప్రచారం సాగుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు ఇంకా సగమే పూర్తయ్యిందని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఓవైపు ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో రిస్క్ నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకనే భావనలో పోలీసులు ఉన్నట్టు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అదే విధంగా పోలీసుశాఖ ముందుకెళితే శ్రీగౌతమి వ్యవహారంలో మరికొన్ని కొత్త క్యారెక్టర్లు తెరమీదకు రావచ్చనే ప్రచారం సాగుతోంది. శభాష్ పావని : అక్క చనిపోయింది. తోడుగా ఉన్న తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. తన అక్కది ప్రమాదం కాదని ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ధైర్యంతో ముందుకెళ్లి పోరాటంలో విజయం సాధించిన పావని చైతన్యానికి అభినందనలు దక్కుతున్నాయి. కేసులో సగంవంతు ఆధారాలను తనే సేకరించి పావని సీబీసీఐడీ అధికారులకు అందించింది. దీంతో సీఐడీ దర్యాప్తు కూడా సులభతర మయ్యిందని చెపుతున్నారు. సీఐడీ లేకపోతే తమకు న్యాయం జరిగేది కాదని పావని పేర్కొంది. పోలీసులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. తన అక్క మృతికి న్యాయం చేయాలని ఎందరినో కోరామని, ఎవరూ దగ్గరకు రానీయలేదన్నారు. బుజ్జి డబ్బులు ఇస్తానని రాయబారాలు కూడా నడిపాడని చెప్పింది. ఓ దశలో నిజంగా తను, అమ్మ ఆత్యహత్య చేసుకోవాలనుకున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ అక్కకు జరిగిన ఘోరానికి న్యాయం జరగాలని కష్టాలు, అవమానాలు దిగమింగి ముందుకెళ్లానని చెప్పింది. తన పోరాటానికి ’సాక్షి‘ అండగా నిలిచిందని కృతజ్ఞతలు చెప్పింది. రాజమండ్రి సీఐడీ సీఐ శేఖర్‌బాబు మేలు మరువలేమన్నారు. -
ఏఎస్ఎన్ఎం డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ విచారణ
పాలకొల్లు అర్బన్ : స్థానిక ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ డాక్టర్ కె.ప్రమీల(రాజమండ్రి), మహిళా సాధికారత సంస్థ అకడమిక్ అధికారులు రోజ్‌లాండ్, ఎస్.మాధవి మంగళవారం విచారణ నిర్వహించారు. కళాశాలలో పారిశుధ్యలోపం, అధ్యాపకుల్లో భేదాభిప్రాయాలపై మహిళా సాధికారిత సంస్థకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం అధికారులు కళాశాలను సందర్శించారు. విచారణ చేపట్టారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ హాజరుకాకపోవడంతో అధికారులు కళాశాల పరిసరాలను పరిశీలించారు. పారిశుధ్యంలోపం ఉన్నట్టు గుర్తించారు. హాజరుశాతాన్ని పరిశీలించి కొన్ని తరగతుల్లో అటెండెన్స్ తీసుకోలేదని గమనించారు. అధ్యాపకులను మందలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, అధ్యాపకులతోనూ, కళాశాల పాలకవర్గ సభ్యులు సమావేశాలు నిర్వహించి కళాశాల ప్రగతిని సమీక్షించాలని సూచించారు. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛభారత్ విధిగా పాటించాలని చెప్పారు. ప్రతి తరగతి గది ముందు చెత్తబుట్టను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌కి సూచించారు. అనంతరం కళాశాలలో లైంగిక వేధింపుల విషయమై విద్యార్థులను విచారించారు. అధ్యాపకుల వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌కి పాల్పడితే చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ ఎం.సాగర్‌ప్రకాశం, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ సాయిబాబా కళాశాల ప్రగతిని వివరిస్తూ అధ్యాపకులు, నాన్‌టీచింగ్ స్టాఫ్ కొరత, ఆర్థికపరమైన ఇబ్బందులను ఆర్జేడీ డాక్టర్ ప్రమీల దృష్టికి తీసుకువెళ్లారు.