ramalingeswara temple
-
కందినంది : అరుదైన నక్షత్రాకారపు కట్టడం, తనివి తీరని అద్భుతం
అతి పురాతనమైన పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది గ్రామంలో ఉంది. స్వయంగా శ్రీరాముడు ఈ రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు. తర్వాత 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఈ మహాలింగాన్ని గుర్తించి రామలింగేశ్వర ఆలయంగా నక్షత్ర ఆకారంలో గుడిని కట్టడం మరో విశిష్టత. ఇక్కడ 6 శాసనాలు ఉన్నాయి. ఒక్కొక్క శాసనం ఒక్కొక్క విశిష్టత. ఈ ఆరు శాసనాలలో ఆరు రంధ్రాలు ఉండడం విశేషం. ఈ 6 రంధ్రాల నుండి సూర్యుని కిరణాలు రామలింగేశ్వరునిపై పడడం మరో విశిష్టత. రెండవది, ఈ గుడి గర్భగుడి ఆకారం నక్షత్రం ఆకారంలో ఉండడం మరో విశేషం. ఇక్కడ గజ స్తంభాలు కళ్యాణ చాళుక్యుల శిల్ప కళకు నిదర్శనం. ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలోరామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంగారెడ్డి నుంచి 15 కి.మీ., మెదక్ నుండి 60 కి.మీ ల దూరంలో ఉన్న నంది కంది ఒక చిన్న గ్రామం నక్షత్ర ఆకారంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.11వ శతాబ్దంలో వీర చాళుక్యుల ఆధ్వర్యంలో నిర్మించబడిన నందికందిలోని రామలింగేశ్వర దేవాలయం ప్రత్యేకించి దాని ప్రత్యేక ఆకృతికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రతి స్తంభం అద్భుతమైన శిల్పకళతో కనువిందు చేస్తుంది. సెంట్రల్ హాల్ లేదా నవరంగలోని నాలుగు అలంకార స్తంభాలు దాని అత్యుత్తమ నమూనాలలో ఒకటి. బ్రహ్మ, విష్ణు, శివ, నరసింహ, వరాహ, నటరాజ, దేవి మహిషాసుర మర్దిని, సరస్వతి, గజలక్ష్మి వంటి దేవతల రూపాలు స్తంభాల ముఖభాగం, పక్క గోడలను అలంకరించాయి.గర్భగృహంలో ఆలయ ప్రధాన దైవాలైన రామలింగేశ్వర స్వామి లింగరూపం లో కొలువై ఉండగా,పార్వతీ దేవి విగ్రహం అందమైన నల్ల రాతిపై చెక్కబడి ఉంటుంది. ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణ యోధుల శిల్పాలు ఉన్నాయి. ఆలయంలో రామలింగేశ్వరునికి అభిముఖంగా నల్లరాతితో చెక్కి ఉన్న భారీ నంది విగ్రహం మూల విరాట్టులతో పోటీ పడుతున్నదా అన్నంత అందంగా... అద్భుతంగా... ఆకర్షణీయంగా ఉంటుంది. రామలింగేశ్వర దేవాలయం శిల్పకళా వైభవానికి ఒక ప్రత్యేక నమూనా. దాని అద్భుతమైన శిల్పం చాళుక్యుల శకం నాటి హస్తకళల గురించి చెబుతుంది. చాళుక్య రాజుల నుంచి సంక్రమించిన సంస్కృతి, వారసత్వాన్ని అనుభవించాలనుకుంటే ఈ ఆలయాన్ని మిస్ చేయకూడదు.సుసంపన్నమైన చారిత్రిక ప్రాముఖ్యత, అద్భుతమైన చెక్కడం వల్ల రామలింగేశ్వర దేవాలయం తెలంగాణలోని పురాతన దేవాలయాల జాబితాలో ఉండాలి.ఆలయ వేళలు..ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7:00 వరకుఎక్కడ బస చేయాలి?∙సంగారెడ్డి, సమీప పట్టణం, కొన్ని మంచి వసతి ఎంపికలను అందిస్తుంది. శ్రీ చంద్ర ఫార్మ్స్ – రిసార్ట్స్ న్యూ గ్రాండ్ హోటల్ లాడ్జ్ కొన్ని ప్రసిద్ధ ఎంపికలు.∙అంతేకాకుండా, హైదరాబాద్‌కు చాలా దగ్గరగా ఉండటంతో, పర్యాటకులు హైదరాబాద్ నుంచి డే ట్రిప్‌లలో సంగారెడ్డికి కూడా ప్రయాణించవచ్చు.ఇంకా ఏమేం చూడవచ్చంటే..?మెదక్ కోట, పోచారం ఆనకట్ట రిజర్వాయర్, పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం, కోటిలింగేశ్వర ఆలయం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పురావస్తు మ్యూజియం, కొండాపూర్. కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలికి నిదర్శనం నంది కంది ఆలయం. ఇది క్రీ.శ 1014లో విక్రమాదిత్యుని హయాంలో నిర్మించబడి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయం విలక్షణమైన లక్షణాలలో ఒకటి దాని ప్రవేశ తోరణం, తోరణం అని పిలువబడే ఏడు విలోమ తామర నమూనాలతో అలంకృతమై ఉంటుంది. కమలాల మధ్య ఉన్న ఈ ఖాళీలు ఉదయపు సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. లోపలి గర్భగుడిలోని శివలింగాన్ని ప్రకాశవంతం చేస్తాయి, ప్రతి అంతరం ఒక ఋతువును సూచిస్తుంది. ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు, శివుడు, నరసింహ వంటి హిందూ దేవతలతో ΄ాటు వరాహ, నటరాజ, దేవి మహిషాసురమర్దిని, సరస్వతి, గజలక్ష్మితో సహా క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది. ఈ బొమ్మలు నాలుగు కేంద్ర స్తంభాలలో చెక్కబడ్డాయి, ఇవి ఆలయ మండపం లేదా నవరంగాన్ని ఏర్పరుస్తాయి. అదనంగా, ఈ ఆలయంలో దిశాత్మక సంరక్షకులు, సొగసైన బొమ్మలు, పౌరాణిక జీవుల శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి నక్షత్రం ఆకారంలో...శిఖరం పద్మాకారంలో రూ పొందించడబడి ఉంటాయి. ఈ నిర్మాణ అంశాలు, కళాకృతుల కలయిక పురాతన హస్తకళ మతపరమైన కళలపై ఆసక్తి ఉన్నవారికి అపూర్వమైన, అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. -
పోదాం కీసర..
కీసర: ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో బుధవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేటి నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లిఖార్జున అవధాని పర్యవేక్షణలో, కీసరగుట్ట ఆలయ పూజారులు బలరాంశర్మ, రవిశర్మ, ఆచార్య గణపతిశర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ దంపతులు విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనము, రుత్విక్ పరణము, యాగశాల ప్రవేశము, అఖండజ్యోతి ప్రతిష్టాపన, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారికి నందివాహనసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువస్తారు. భక్తుల సంఖ్యకుతగినట్లు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహోత్సవాల సందర్భంగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చునని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 కమిటీలు ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, శానిటేషన్, విషన్భగీరథ , వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు షిఫ్టుల వారీగా విధుల్లో పాల్గొంటారు. నేడు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు: బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జాతర సందర్బంగా ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆయా శాఖలకు సంబందించిన ప్రగతిపై ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి , జిల్లాకలెక్టర్ వాసం.వెంకటేశ్వర్లు క్రీడోత్సవాలు, స్టాల్స్‌ను ప్రారంభిస్తారు. పకడ్బందీ ఏర్పాట్లు :బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ తెలిపారు. మంత్రి, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించే విషయమై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే లక్ష లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశామని, భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైతే ప్రసాదాల తయారీని పెంచుతామన్నారు.– ఆలయ ఛైర్మన్ తటాకంశ్రీనివాస్శర్మ పూజా కార్యక్రమాల వివరాలివీ.. మొదటిరోజు: 19 వ తేదీ (బుధవారం) ఉదయం 11గంటలకు విఘ్నేశ్వరపూజతో బ్రహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం పుణ్యావాహచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు. 2వ రోజు: 20 తేదీ(గురువారం) ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4 గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు వస్తారు. రాత్రి 10 గంటలకు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామివార్ల కళ్యాణ మహోత్సవం. 3వ రోజు: 21వ తేదీ (శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినం రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కళ్యాణమండపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకారహోమం, రాత్రి 8గంటలకు నందివాహన సేవ, భజనలు, రాత్రి 12 గంటల నుంచి లింగోద్బవ కాలంంలో శ్రీరామలింగేశ్వరస్వామికి సంతతధారాభిషేకం. 4వ రోజు: 22 వ తేదీ (శని వారం) ఉదయం 5.30 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి కళ్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 9 గంటలకు రుద్రస్వాహాకారహోమం, రాత్రి 7గంటల నుంచిì ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమానరథోత్సవం. 5వ రోజు: 23వ తేదీ( ఆదివారం )5.30 కు మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం,సాముహికఅభిషేకాలు, రాత్రి 7కు ప్రదోష కాలపూజ, హారతి, మంత్రపుష్పము, రాత్రి+ 8 గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం. 6వ రోజు: 24వ తేదీ(సోమవారం) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10 గంటలకు క్షేత్ర దిగ్బలి, అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాల పరిసమాప్తి, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
మృత్యుకుహరమైన కోనేరు
అడ్డాకుల (దేవరకద్ర): రాష్ట్రంలోని శైవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కోనేరు మృత్యుకుహరంగా మారుతోంది. దైవ దర్శనానికి ముందు పవిత్రమైన కోనేరులో స్నానం చేసి దేవుడిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని నమ్మే భక్తుల్లో ఏటా ఒకరిద్దరు అందులో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. ప్రతి సంవత్సరం హోలీ వేడుకల నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు, జాతర ఉగాది పండగతో ముగుస్తుంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ప్రతీసారి కోనేరులో ఒక్కరైనా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే దేవాదాయ శాఖాధికారులు కోనేరు వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మెట్లు తొలగించి.. ఏడాదిన్నర నుంచి ఆలయం వద్ద పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ క్రమం లో గతేడాది కోనేరులో ఉన్న మెట్లను తొలగించారు. కొత్తగా మెట్లను ఏర్పాటు చేయాలని భావించినా ఇప్పటి వరకు పని మొదలు కాలేదు. మెట్లను తొలగించే క్రమంలో కోనేరులో పూడికను కూడా తీశారు. దీంతో మెట్లు ఉన్న చోట నే ఎక్కువ లోతు ఉంది. రెండేళ్ల నుంచి కోనేరులో జాతర సందర్భంగా ఇనుప రక్షణ కంచె ఏర్పాటు చేస్తు న్నారు. అయితే ఈసారి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రక్షణ కంచె ఏర్పాటు చేయలేదు. కోనేరులో దిగితే లోతుకు వెళ్లిపోతారని కనీసం మైకులో హెచ్చరికలు చేయలేదు. ఈ క్రమంలోనే గురువారం స్నానానికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు వదిలారు. ఇక్కడ ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జాతరకు వచ్చే భక్తులు కోనేరులో స్నానం చేయడానికి జంకే పరిస్థితికి తీసుకురావడం ఆందోళనకు దారితీస్తోంది. 2001లో నలుగురు.. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటిని అందించాలని ఆలయం ముందు నిర్మించిన ట్యాంకు వద్ద 2001లో ప్రమాదం జరిగింది. నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో ట్యాంకు కూలీ భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు భక్తుల కుటుంబ సభ్యులు కోర్టుకు వెళితే ఒక్కొక్కరికి రూ.1.35 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. దేవాలయం ఖాతాలో డబ్బులు లేకపోవడంతో మన్యంకొండ, ఊర్కొండపేట ఆలయాల నుంచి అప్పు తెచ్చి పరిహారం చెల్లించారు. ఆ తర్వాత ఏటా కొంత నగదు చెల్లించి బాకీ మొత్తం తీర్చేశారు. ఏటా ఒకరిద్దరి బలి కోనేరులో ప్రతి ఏటా ఒకరిద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన ఐదేళ్లలో 2017 మార్చిలో మినహా ప్రతిసారి ఒకరిద్దరు భక్తులు కోనేరులో పడి ప్రాణాలు వదులుతున్నారు. కోనేరులో ఉండే గుర్రపు డెక్కలో చిక్కుకుని కొందరు.. ఈత రాక మరికొందరు మృత్యువాత పడుతున్నారు. అయినా ఆలయ అధికారులు మేల్కోవడం లేదు. రెండేళ్ల నుంచి రక్షణ కంచె ఏర్పాటు చేయడంతోపాటు కోనేరు ఒడ్డుపైనే షవర్ బాత్ చేసేలా ఏర్పాట్లు చేశారు. 2016లో రక్షణ కంచె ఏర్పాటు చేసినా గుర్రపు డెక్కలో చిక్కి ఓ భక్తుడు నీటిలో మునిగాడు. -
మహిమాన్వితం శ్రీకృతకృత్య రామలింగేశ్వరం
ఎంతో మహిమాన్వితమైనదిగా పేరొందినది గుడిమూల శ్రీకృతకృత్య రామలింగేశ్వర క్షేత్రం. పురాతన కాలంనాటి ఈ క్షేత్రాన్ని కార్తీకమాసంలోనే గాకుండా పర్వదినాల్లో ఎక్కడెక్కడినుంచో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుంటారు. దోషనివారణలో కూడా ఈ క్షేత్ర దర్శనం ప్రసిద్ధిగాంచింది. రాముని దోషాన్ని రూపుమాపిన లింగం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. అందువల్ల ఈ క్షేత్రాన్ని రామలింగేశ్వరమని కూడా అంటారు. అందమైన ప్రకృతి నడుమ ఆవిర్భవించిన గుడిమూల శ్రీ కృతకృత్య రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం కార్తీకమాసమంతా ‘హరహర మహాదేవ శంభోశంకర’ అనే భజనలతో మారుమోగుతుంది. పర్వదినాల్లో భక్తుల శివనామస్మరణలతో ప్రతిధ్వనిస్తుంది. కార్తీకమాసంలోనూ, శివరాత్రి పర్వదినాన భక్తులు స్వామి దర్శనంతోపాటు ఉపవాస దీక్షలు చేపడతారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతోపాటు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుతారు. స్థలపురాణం త్రేతాయుగంలో∙రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా పాతకానికి గురైన శ్రీరామచంద్రుడు మహర్షుల ప్రోద్బలంతో కోటిలింగాలను ఆసేతు హిమాలయ పర్యంతం ప్రతిష్ఠ చేశాడని పురాణ ప్రతీతి. ఈ క్రమంలో శివలింగాన్ని వశిష్టనదికి తూర్పువైపున గుడిమూలలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. వశిష్టానది పడమర వైపున మరొక శివలింగాన్ని లక్ష్మణునిచే ప్రతిష్ఠింపచేశాడు. నాటినుంచి తూర్పుగోదావరి జిల్లాలో రామప్రతిష్టకు రామేశ్వరమని, పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష్మణప్రతిష్ఠకు లక్ష్మణేశ్వరమని సార్థక నామమయింది. ఇప్పటికీ అవే నామాలతో దివ్య క్షేత్రాలుగా కొనసాగుతున్నాయి. తొలగిన బ్రహ్మహత్యా పాతకం కోటిలింగ ప్రతిష్ఠల కార్యక్రమం ప్రారంభంలో వశిష్ఠుడు శ్రీరాముని చేతికి ఓ కంకణం కట్టి, అది ఎక్కడ రాముని చేతినుంచి విడువడుతుందో, అప్పటినుంచి బ్రహ్మహత్యా పాతకం తొలగుతుందని చెప్పాడట. ఆ ప్రకారం ఈ క్షేత్రంలో లింగప్రతిష్ఠతో రాముని చేతినుంచి కంకణం విడివడి బ్రహ్మహత్యా పాతకం తొలగటంతో శ్రీరాముడు కృతకృత్యుడయ్యాడు. దీంతో ఈ క్షేత్రం నాటినుంచి కృతకృత్య రామలింగేశ్వర స్వామివారి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. సఖీ!.. నేటి పల్లి... ఇదే! శ్రీరాముడు కోటి లింగాల ప్రతిష్ఠాపనలో భాగంగా తన పరివారంతో పర్యటిస్తుండగా ఒక ప్రాంతానికి చేరుకున్నారు. చీకటి కావస్తున్న సమయంలో శ్రీరాముడు సీతాదేవితో ‘‘సఖీ... మనం విశ్రమించే నేటి పల్లి ఇదే’’ అని చెప్పాడట. శ్రీరాముడు సీతమ్మవారితో పలికిన సఖి, నేటి పల్లి మాటలు ప్రస్తుతం సఖినేటిపల్లి గ్రామంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు పర్యటించిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం నిత్యం సుభిక్షంగా, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా పచ్చని వాతావరణంతో కూడి ఉంటుందని ఈ ప్రాంత ప్రజల నమ్మిక. పురాతన కట్టడం త్రేతాయుగాన శ్రీరామునిచే ప్రతిష్ఠించబడి, 11వ శతాబ్దంలో వేంగీరాజులచే పునర్నిర్మించబడిన ఈ దేవాలయం తిరిగి 1971లో పునర్నిర్మాణం జరిగింది. అప్పటి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, గుడిమూలకు చెందిన రుద్రరాజు రామలింగరాజు ప్రోత్సాహంతో ప్రారంభించిన పనులు 1973లో పూర్తిచేశారు. నాటి నుంచి ఆలయంలో శివునికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో సోమవారాలు లక్ష బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకం, శివరాత్రికి స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయ చైర్మన్‌గా రుద్రరాజు వంశీయులైన వెంకట్రామరాజు (రాము) పర్యవేక్షణలో ఆలయంలో పర్వదినాలను అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహిస్తారు. ఉపాలయాలకు ఆలవాలం ఆలయంలో ప్రధాన సింహద్వారానికి ఒకవైపున ప్రతిష్ఠించిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఉపాలయంలో వైభవోపేతంగా ఏటా షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే రెండవ వైపున ప్రతిష్ఠించబడిన శ్రీపార్వతీదేవి అమ్మవారి ఉపాలయంలో దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు సహస్రనామార్చన, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. వీటితోపాటు మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలోను విశేషమైన పూజలు శివునితోపాటు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి ఇలా రావాలి తూర్పుగోదావరి జిల్లా వాసులు రాజోలు డిపోకు చేరుకుని, అక్కడ నుంచి సఖినేటిపల్లి సెంటర్లో దిగాలి. అక్కడ నుంచి ఆటోలో 10 కిలో మీటర్ల దూరంలోని గుడిమూలకు చేరుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులు నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి రేవు మీదుగాను, చించినాడ వంతెన మీదుగాను సఖినేటిపల్లికి చేరుకుని అక్కడ నుంచి ఆటోలో వెళ్లవచ్చు. – వి.ఎస్.రావు బాపూజీ, సఖినేటిపల్లి, తూ.గో. జిల్లా -
నిప్పులాంటి భక్తి
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మం డలం చెర్వుగట్టులో అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఈ కార్యక్రమం నిర్వహిం చారు. పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. యాదగిరిగుట్టకు చెం దిన జయప్రద, అయిలపల్లికి చెందిన అండాలు అగ్నిగుండంలో నడుస్తుండగా చీర కాళ్లకు తగిలి నిప్పుల్లో పడిపోయూరు. తీవ్ర గాయూలైన వారిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
కల్యాణం.. కమనీయం
వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో చెర్వుగట్టుకు కల్యాణశోభ సంతరించుకుంది. నందివాహనంపై పార్వతి, జడల రామలింగేశ్వరస్వామి వారిని కొత్తగా రాతితో నిర్మించిన కల్యాణమండపానికి శుక్రవారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. బాజా భజంత్రీలు..వేద మంత్రాల నడుమ అర్చకులు కల్యాణ తంతు నిర్వహించారు. గవ్యాంత మార్జనలు, దీక్షా హోమాలు, నీరాజన మంత్ర పుష్పాలను వైభవంగా చేపట్టారు. సాయంత్రం మన్యుసూక్త శ్రీ సూక్త దూర్గాసూక్త హోమాలు, బలిహరణ చేపట్టారు. సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. చెర్వుగట్టు (నార్కట్‌పల్లి) , న్యూస్‌లైన్ : శివనామస్మరణతో చెర్వుగట్టు మార్మోగింది. మంగళవాయిద్యాలు.. భజనలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం తెల్లవారుజామున కన్నులపండువగా జరిగింది. స్వామివారికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. నూతనంగా రాతితో నిర్మిస్తున్న కల్యాణ మండపాన్ని సంపోక్షణ చేశారు. అనంతరం నందివాహనంపై స్వామిఅమ్మవార్లను కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. తరువాత వేదపండితుడు అల్లవరపు సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మతో పాటు అ ర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో కల్యాణతంతును జరిపించారు. సాయంత్రం స్వామి వారి పుష్కరిణిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.