ఎంతో మహిమాన్వితమైనదిగా పేరొందినది గుడిమూల శ్రీకృతకృత్య రామలింగేశ్వర క్షేత్రం. పురాతన కాలంనాటి ఈ క్షేత్రాన్ని కార్తీకమాసంలోనే గాకుండా పర్వదినాల్లో ఎక్కడెక్కడినుంచో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుంటారు. దోషనివారణలో కూడా ఈ క్షేత్ర దర్శనం ప్రసిద్ధిగాంచింది.
రాముని దోషాన్ని రూపుమాపిన లింగం
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. అందువల్ల ఈ క్షేత్రాన్ని రామలింగేశ్వరమని కూడా అంటారు. అందమైన ప్రకృతి నడుమ ఆవిర్భవించిన గుడిమూల శ్రీ కృతకృత్య రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం కార్తీకమాసమంతా ‘హరహర మహాదేవ శంభోశంకర’ అనే భజనలతో మారుమోగుతుంది. పర్వదినాల్లో భక్తుల శివనామస్మరణలతో ప్రతిధ్వనిస్తుంది. కార్తీకమాసంలోనూ, శివరాత్రి పర్వదినాన భక్తులు స్వామి దర్శనంతోపాటు ఉపవాస దీక్షలు చేపడతారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతోపాటు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుతారు.
స్థలపురాణం
త్రేతాయుగంలో∙రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా పాతకానికి గురైన శ్రీరామచంద్రుడు మహర్షుల ప్రోద్బలంతో కోటిలింగాలను ఆసేతు హిమాలయ పర్యంతం ప్రతిష్ఠ చేశాడని పురాణ ప్రతీతి. ఈ క్రమంలో శివలింగాన్ని వశిష్టనదికి తూర్పువైపున గుడిమూలలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. వశిష్టానది పడమర వైపున మరొక శివలింగాన్ని లక్ష్మణునిచే ప్రతిష్ఠింపచేశాడు. నాటినుంచి తూర్పుగోదావరి జిల్లాలో రామప్రతిష్టకు రామేశ్వరమని, పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష్మణప్రతిష్ఠకు లక్ష్మణేశ్వరమని సార్థక నామమయింది. ఇప్పటికీ అవే నామాలతో దివ్య క్షేత్రాలుగా కొనసాగుతున్నాయి.
తొలగిన బ్రహ్మహత్యా పాతకం
కోటిలింగ ప్రతిష్ఠల కార్యక్రమం ప్రారంభంలో వశిష్ఠుడు శ్రీరాముని చేతికి ఓ కంకణం కట్టి, అది ఎక్కడ రాముని చేతినుంచి విడువడుతుందో, అప్పటినుంచి బ్రహ్మహత్యా పాతకం తొలగుతుందని చెప్పాడట. ఆ ప్రకారం ఈ క్షేత్రంలో లింగప్రతిష్ఠతో రాముని చేతినుంచి కంకణం విడివడి బ్రహ్మహత్యా పాతకం తొలగటంతో శ్రీరాముడు కృతకృత్యుడయ్యాడు. దీంతో ఈ క్షేత్రం నాటినుంచి కృతకృత్య రామలింగేశ్వర స్వామివారి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
సఖీ!.. నేటి పల్లి... ఇదే!
శ్రీరాముడు కోటి లింగాల ప్రతిష్ఠాపనలో భాగంగా తన పరివారంతో పర్యటిస్తుండగా ఒక ప్రాంతానికి చేరుకున్నారు. చీకటి కావస్తున్న సమయంలో శ్రీరాముడు సీతాదేవితో ‘‘సఖీ... మనం విశ్రమించే నేటి పల్లి ఇదే’’ అని చెప్పాడట. శ్రీరాముడు సీతమ్మవారితో పలికిన సఖి, నేటి పల్లి మాటలు ప్రస్తుతం సఖినేటిపల్లి గ్రామంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు పర్యటించిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం నిత్యం సుభిక్షంగా, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా పచ్చని వాతావరణంతో కూడి ఉంటుందని ఈ ప్రాంత ప్రజల నమ్మిక.
పురాతన కట్టడం
త్రేతాయుగాన శ్రీరామునిచే ప్రతిష్ఠించబడి, 11వ శతాబ్దంలో వేంగీరాజులచే పునర్నిర్మించబడిన ఈ దేవాలయం తిరిగి 1971లో పునర్నిర్మాణం జరిగింది. అప్పటి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, గుడిమూలకు చెందిన రుద్రరాజు రామలింగరాజు ప్రోత్సాహంతో ప్రారంభించిన పనులు 1973లో పూర్తిచేశారు. నాటి నుంచి ఆలయంలో శివునికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో సోమవారాలు లక్ష బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకం, శివరాత్రికి స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయ చైర్మన్‌గా రుద్రరాజు వంశీయులైన వెంకట్రామరాజు (రాము) పర్యవేక్షణలో ఆలయంలో పర్వదినాలను అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చకులు నిర్వహిస్తారు.
ఉపాలయాలకు ఆలవాలం
ఆలయంలో ప్రధాన సింహద్వారానికి ఒకవైపున ప్రతిష్ఠించిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఉపాలయంలో వైభవోపేతంగా ఏటా షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే రెండవ వైపున ప్రతిష్ఠించబడిన శ్రీపార్వతీదేవి అమ్మవారి ఉపాలయంలో దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు సహస్రనామార్చన, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. వీటితోపాటు మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలోను విశేషమైన పూజలు శివునితోపాటు జరుగుతూ ఉంటాయి.
ఈ క్షేత్రానికి ఇలా రావాలి
తూర్పుగోదావరి జిల్లా వాసులు రాజోలు డిపోకు చేరుకుని, అక్కడ నుంచి సఖినేటిపల్లి సెంటర్లో దిగాలి. అక్కడ నుంచి ఆటోలో 10 కిలో మీటర్ల దూరంలోని గుడిమూలకు చేరుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వాసులు నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి రేవు మీదుగాను, చించినాడ వంతెన మీదుగాను సఖినేటిపల్లికి చేరుకుని అక్కడ నుంచి ఆటోలో వెళ్లవచ్చు.
– వి.ఎస్.రావు బాపూజీ, సఖినేటిపల్లి, తూ.గో. జిల్లా
Comments
Please login to add a commentAdd a comment