మృత్యుకుహరమైన కోనేరు | Every Year accidents In temple Well | Sakshi
Sakshi News home page

మృత్యుకుహరమైన కోనేరు

Published Sat, Mar 10 2018 8:13 AM | Last Updated on Sat, Mar 10 2018 8:13 AM

Every Year accidents In temple Well - Sakshi

మెట్లు, రక్షణ కంచె లేని కోనేరు (ప్రస్తుతం)

అడ్డాకుల (దేవరకద్ర): రాష్ట్రంలోని శైవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కోనేరు మృత్యుకుహరంగా మారుతోంది. దైవ దర్శనానికి ముందు పవిత్రమైన కోనేరులో స్నానం చేసి దేవుడిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని నమ్మే భక్తుల్లో ఏటా ఒకరిద్దరు అందులో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. ప్రతి సంవత్సరం హోలీ వేడుకల నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు, జాతర ఉగాది పండగతో ముగుస్తుంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ప్రతీసారి కోనేరులో ఒక్కరైనా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే దేవాదాయ శాఖాధికారులు కోనేరు వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

మెట్లు తొలగించి..
ఏడాదిన్నర నుంచి ఆలయం వద్ద పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ క్రమం లో గతేడాది కోనేరులో ఉన్న మెట్లను తొలగించారు. కొత్తగా మెట్లను ఏర్పాటు చేయాలని భావించినా ఇప్పటి వరకు పని మొదలు కాలేదు. మెట్లను తొలగించే క్రమంలో కోనేరులో పూడికను కూడా తీశారు. దీంతో మెట్లు ఉన్న చోట నే ఎక్కువ లోతు ఉంది. రెండేళ్ల నుంచి కోనేరులో జాతర సందర్భంగా ఇనుప రక్షణ కంచె ఏర్పాటు చేస్తు న్నారు. అయితే ఈసారి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రక్షణ కంచె ఏర్పాటు చేయలేదు. కోనేరులో దిగితే లోతుకు వెళ్లిపోతారని కనీసం మైకులో హెచ్చరికలు చేయలేదు. ఈ క్రమంలోనే గురువారం స్నానానికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు వదిలారు. ఇక్కడ ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జాతరకు వచ్చే భక్తులు కోనేరులో స్నానం చేయడానికి జంకే పరిస్థితికి తీసుకురావడం ఆందోళనకు దారితీస్తోంది.

2001లో నలుగురు..
జాతరకు వచ్చే భక్తులకు తాగునీటిని అందించాలని ఆలయం ముందు నిర్మించిన ట్యాంకు వద్ద 2001లో ప్రమాదం జరిగింది. నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో ట్యాంకు కూలీ భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు భక్తుల కుటుంబ సభ్యులు కోర్టుకు వెళితే ఒక్కొక్కరికి రూ.1.35 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. దేవాలయం ఖాతాలో డబ్బులు లేకపోవడంతో మన్యంకొండ, ఊర్కొండపేట ఆలయాల నుంచి అప్పు తెచ్చి పరిహారం చెల్లించారు. ఆ తర్వాత ఏటా కొంత నగదు చెల్లించి బాకీ మొత్తం తీర్చేశారు.

ఏటా ఒకరిద్దరి బలి
కోనేరులో ప్రతి ఏటా ఒకరిద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన ఐదేళ్లలో 2017 మార్చిలో మినహా ప్రతిసారి ఒకరిద్దరు భక్తులు కోనేరులో పడి ప్రాణాలు వదులుతున్నారు. కోనేరులో ఉండే గుర్రపు డెక్కలో చిక్కుకుని కొందరు.. ఈత రాక మరికొందరు మృత్యువాత పడుతున్నారు. అయినా ఆలయ అధికారులు మేల్కోవడం లేదు. రెండేళ్ల నుంచి రక్షణ కంచె ఏర్పాటు చేయడంతోపాటు కోనేరు ఒడ్డుపైనే షవర్‌ బాత్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు. 2016లో రక్షణ కంచె ఏర్పాటు చేసినా గుర్రపు డెక్కలో చిక్కి ఓ భక్తుడు నీటిలో మునిగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement