పోదాం కీసర.. | Keesara Gutta Festival Starts From Today | Sakshi
Sakshi News home page

పోదాం కీసర..

Published Wed, Feb 19 2020 8:15 AM | Last Updated on Wed, Feb 19 2020 8:15 AM

Keesara Gutta Festival Starts From Today - Sakshi

కీసర:  ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో బుధవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేటి నుంచి  24 వరకు  ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్‌ మల్లిఖార్జున అవధాని పర్యవేక్షణలో, కీసరగుట్ట ఆలయ పూజారులు బలరాంశర్మ, రవిశర్మ,  ఆచార్య గణపతిశర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  ఉదయం  11గంటలకు ఆలయ ఛైర్మన్‌ తటాకం శ్రీనివాస్‌శర్మ దంపతులు విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనము, రుత్విక్‌ పరణము, యాగశాల ప్రవేశము, అఖండజ్యోతి ప్రతిష్టాపన, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారికి నందివాహనసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువస్తారు.

భక్తుల సంఖ్యకుతగినట్లు ఏర్పాట్లు
మహాశివరాత్రి బ్రహోత్సవాల సందర్భంగా 4 నుంచి  5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చునని  అధికారులు, ఆలయ సిబ్బంది  అంచనా వేస్తున్నారు.  ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు  ఆధ్వర్యంలో 20  కమిటీలు ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, శానిటేషన్, విషన్‌భగీరథ , వైద్య, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు షిఫ్టుల వారీగా విధుల్లో పాల్గొంటారు.

 నేడు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు:  బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ  ఏడాది జాతర సందర్బంగా ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో వివిధ  ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆయా శాఖలకు సంబందించిన ప్రగతిపై ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి , జిల్లాకలెక్టర్‌ వాసం.వెంకటేశ్వర్లు క్రీడోత్సవాలు, స్టాల్స్‌ను  ప్రారంభిస్తారు.

పకడ్బందీ ఏర్పాట్లు :బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఛైర్మన్‌ తటాకం శ్రీనివాస్‌శర్మ   తెలిపారు.  మంత్రి, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో  జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.  భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించే విషయమై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే లక్ష  లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశామని, భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైతే  ప్రసాదాల తయారీని పెంచుతామన్నారు.– ఆలయ ఛైర్మన్‌ తటాకంశ్రీనివాస్‌శర్మ

పూజా కార్యక్రమాల వివరాలివీ..
మొదటిరోజు: 19 వ తేదీ (బుధవారం) ఉదయం 11గంటలకు విఘ్నేశ్వరపూజతో బ్రహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం పుణ్యావాహచనం, రుత్విక్‌వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు.

2వ రోజు: 20 తేదీ(గురువారం) ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4 గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు వస్తారు. రాత్రి 10 గంటలకు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామివార్ల కళ్యాణ మహోత్సవం.

3వ రోజు: 21వ తేదీ (శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినం రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కళ్యాణమండపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకారహోమం, రాత్రి 8గంటలకు  నందివాహన సేవ, భజనలు, రాత్రి 12 గంటల నుంచి లింగోద్బవ కాలంంలో శ్రీరామలింగేశ్వరస్వామికి సంతతధారాభిషేకం.

4వ రోజు: 22  వ తేదీ (శని వారం) ఉదయం 5.30 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి  కళ్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 9 గంటలకు  రుద్రస్వాహాకారహోమం, రాత్రి 7గంటల నుంచిì  ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమానరథోత్సవం.

5వ రోజు: 23వ తేదీ( ఆదివారం )5.30 కు మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం,సాముహికఅభిషేకాలు,  రాత్రి 7కు ప్రదోష కాలపూజ,  హారతి, మంత్రపుష్పము,  రాత్రి+ 8 గంటలకు వసంతోత్సవం,  పుష్పయాగం.

6వ రోజు: 24వ తేదీ(సోమవారం) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10 గంటలకు క్షేత్ర దిగ్బలి, అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాల పరిసమాప్తి, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement