పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక | YS Jagan Slams Chandrababu Naidu Over Attacks On YSRCP Leaders, More Details Inside | Sakshi
Sakshi News home page

పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

Published Fri, Jul 5 2024 3:15 AM | Last Updated on Fri, Jul 5 2024 5:52 PM

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

విధ్వంస సంస్కృతికి పుల్‌స్టాప్‌ పెట్టకపోతే రియాక్షన్‌ తప్పదు

దాడులు ఆపమని కోరడం లేదు.. హెచ్చరిస్తున్నాం.. ఎల్లకాలం రోజులు మీవి కావు.. పాపాలు పండుతున్నాయి

ఓ వైపు విధ్వంసం, దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులా?.. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌లు చూపిస్తూ విధ్వంసాలా?

ఓటు వేయలేదన్న కారణంతో భౌతిక దాడులు చేస్తారా?.. ఆస్తుల ధ్వంసం, దాడులపై పోలీసులది ప్రేక్షక పాత్రా?

మా పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు

ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది

బాబు కక్ష పూరిత రాజకీయాలు మాను కోవాలి.. లేదంటే ఈ తప్పుడు సంప్ర దాయం ఒక బీజంలా నాటుకుంటుంది

రేపు అది చెట్టుగా మారి టీడీపీ శ్రేణులు కూడా ఈ పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, పరిపాలనపై దృష్టి పెట్టండి

తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డలకు రూ.1,500 ఇవ్వడంపై దృష్టి పెట్టండి

కారంపూడి ఘటనలో సీఐకి పిన్నెల్లి తటస్థే పడలేదు.. ఎలా హత్యాయత్నం కేసు పెడతారు?.. పాల్వాయిగేటు ఘటనలో కూడా తప్పుడు కేసు పెట్టారు

ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవని గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్లే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటు వంటి తప్పుడు సంప్రదాయాలు ఇప్పటికైనా ఆపండి. ఇలాంటివి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం. దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు. రియాక్షన్‌ అనేది కచ్చితంగా ఉంటుంది.     
– మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో విధ్వంస రాజకీ­యాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే భవిష్యత్‌లో రియాక్షన్‌ కూడా అదే స్థాయిలో ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాడులు, విధ్వంసాలు ఆపాలని కోరడం లేదని, హెచ్చరిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్సార్‌­సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నా­రని.. పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. 

ఇది ఏ మాత్రం న్యాయం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంపై చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్‌ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం వైఎస్‌ జగన్‌ ములాఖత్‌ ద్వారా పరామ­ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసక చర్యలు జరుగు­తు­న్నాయి. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. 

వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటు వైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచిని అర్హత ప్రామాణికంగా ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ చేశాం. ఈ రోజు చంద్రబాబునాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఆ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారు.. పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశు పాలుని పాపాల మాదిరిగా పండుతాయి. 

నెల్లూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌   

ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అందుకే చంద్రబాబులో మార్పు రావాలి. లేదంటే ప్రజలు లెక్కా జమా సరిచేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

పిన్నెల్లిపై ఇంత అన్యాయంగా కక్ష సాధింపా?
⇒ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. ఏ రకంగా అన్యాయంగా అతన్ని జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో టీడీపీ ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినందున వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి బయల్దేరాడు. 

⇒ కారంపూడికి అటు వైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే.. ఎమ్మెల్యే ఊర్లోకి ప్రవేశించక ముందే ఇటు వైపు అడ్డగించారు. గొడవ టౌన్‌లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు. నారాయణస్వామి అనే సీఐని పిన్నెల్లి చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న గొడవ జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23న ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సీఐ, రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు. ఇది అన్యాయం కాదా? 

⇒ అసలు ఇన్సిడెంట్‌ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగి ఉంటే మే 15న మెడికో లీగల్‌ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం సిట్‌ వేసింది. 17 నుంచి 20వ తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్‌ బృందం తిరిగి ఘటనపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఎందుకు ఈ అంశం రాలేదు? అలాంటప్పుడు ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా?

ఇక పద్దతి మార్చుకోకపోతే..!

ప్రతి దశలో ఓ రెడ్‌బుక్‌
⇒ ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్‌బుక్స్‌ అని చెప్పి పెట్టుకున్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్‌బుక్, లోకేశ్‌ స్థాయిలో ఒక రెడ్‌బుక్, ఎమ్మెల్యే స్థాయి­లో, మండల స్థాయి­లో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్‌బుక్‌లు పెట్టు­కుని ఏం చేస్తు­న్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. 

⇒ మీ విధ్వంసాలు, దాడులను రాష్ట్రం మొ­త్తం చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడ­టం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, దాడులు, దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

ఎమ్మెల్యే 10 సార్లు ఫోన్‌ చేసినా ఎస్పీ స్పందించలేదు
⇒ మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్‌ అనే పోలింగ్‌ కేంద్రం దగ్గరకు అప్పటి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు. అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న ఎస్సీ సామా­జిక వర్గం వారు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేనప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లారు. ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి 10 సార్లు ఫోన్‌ చేసినా కూడా స్పందించని పక్షంలో కనీసం సీఐని, ఎస్సైని పంపించండనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సెన్సిటివ్‌ బూత్‌లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు. అటువంటి పరిస్థి­తుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఈవీఎం పగల­గొట్టిన కేసులో తనకు బెయిల్‌ వచ్చింది. కానీ ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పు­డు కేసులు పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు. 

⇒ ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున కేసులు పెట్టారు. రిగ్గింగ్‌ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్‌ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా? 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈ రోజు ఇది రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇలానే జరుగుతోంది. 

⇒ వైఎస్‌ జగన్‌ వెంట మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు పిన్నెల్లితో ములాఖత్‌లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌­యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి తదితరులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు?
⇒ ప్రజలకు మంచి చేసి వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీ­లకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితుల­య్యారు. 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్‌ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నారు. ఖరీఫ్‌లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.

⇒ బడులు మొదలయ్యాయి. అమ్మ ఒడి కింద జగన్‌ రూ.15 వేలు ఐదేళ్ల పాటు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తానని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని ప్రతి తల్లీ అడుగుతోంది. 

⇒ 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. ప్రతి నెలా రూ.1500 ఇస్తానన్నావు, ఏమైంది? అని వీరందరూ ఈ రోజు అడుగుతున్నారు. 

⇒ వీటన్నింటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. గవర్నెన్స్‌ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రజలు ఎందుకు తమకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి.. రాష్ట్రంలో రావణకాష్టం రగిలించాలి.. దొంగ కేసులు పెట్టి ఇరికించాలి.. ఆస్తులను ధ్వంసం చేయాలి.. వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన వారెవరినీ ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement