అబద్ధాలు వండబడును c/o రామోజీ | Eenadu Ramoji Rao's Political Strategies | Sakshi
Sakshi News home page

అబద్ధాలు వండబడును c/o రామోజీ

Published Mon, Jan 15 2024 11:32 AM | Last Updated on Fri, Feb 2 2024 6:34 PM

Eenadu Ramoji Rao's Political Strategies - Sakshi

కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు, దివంగత కాపు నేత వంగవీటి రంగాపై ఈనాడు రామోజీరావుకు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అలాగే కాపులపై ఎక్కడలేని ఆప్యాయతను కురిపిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆడుతున్న కపట ప్రేమే అన్న సంగతి తెలిసిపోతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం  కాపులపై  వైఎస్సార్‌సీపీ వల అంటూ  ఒక తప్పుడు వార్తను సృష్టించడంలో ఈనాడు మీడియా  దురుద్దేశం కనిపెట్టలేరా!  గతసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి  కాపులను ఆ పార్టీకి ఎంతో కొంత దూరం చేయడమే ఈనాడు మీడియా లక్ష్యం.

ఆ  ఒక్క వర్గాన్నే కాదు.. వైఎస్సార్‌సీపీకి బాగా మద్దతు ఇచ్చే ప్రతి వర్గంలోను  ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడానికి నానా పాట్లు పడుతున్న రామోజీరావు తన పత్రికను టీడీపీ కరపత్రంగా హీనంగా మార్చివేశారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు ఏవో వేసుకుంటాయి. వాటిని కధనాలుగా ఇవ్వడం తప్పుకాదు.కాని లేని వాటిని కల్పించి, అసత్యాలను అలవోకగా వండేసి పాఠకులపై రుద్దాలనుకోవడమే నీచం. రామోజీకి ఈ వయసులో ఇంత అప్రతిష్టపాలు అవడం వల్ల వచ్చే లాభం ఏమిటో తెలియదు. కాని ఏదో  అపరిమతమైన లబ్ది కోసమే ఆయన ఇంతగా దిగజారారానిపిస్తుంది.

ఆ వార్తలో ఏమి రాశారో చూడండి.. కాపులకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇచ్చేశారట. దానిని జగన్ అమలు చేయడం లేదట. ఏమన్నా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇంత పచ్చి అబద్దాన్ని రాయగలుగుతారా! పార్టీ కార్యకర్తలకన్నా హీనంగా జర్నలిస్టులను ఇలా తయారు చేస్తారా? కాపు రిజర్వేషన్లపై 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేస్తానని కాపులను నమ్మబలికారు. దానిని నమ్మి ఆ వర్గం వారు టీడీపీకి ఓట్లు వేశారు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సాక్ష్యం. ఆయన కూడా కాపు కావడంంతో చంద్రబాబు హామీ అమలు అవుతుందిలే అని అమాయక కాపులు నమ్మారు.

ఆ తర్వాత ఏమి జరిగింది! చంద్రబాబు కేంద్రానికి ఒక తీర్మానం పంపి వదలివేశారు. దాంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు ఉద్యమించారు. అప్పుడు చంద్రబాబు కొత్త డ్రామా ఆడారు. కాపులను బీసీలలో కలిపే విషయంలో  విచారణ చేసి సిఫారస్ చేయడం కోసం జస్టిస్ మంజూనాధ కమిషన్ను నియమించారు. కొందరు సభ్యులను కూడా ఇందులో వేశారు. ఆ కమిషన్ ఆయా ప్రాంతాలలో తిరిగి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. కాపులను బీసీలుగా గుర్తించడానికి బీసీ వర్గాల వారు అంగీకరించలేదు. అలా ఆ రెండు వర్గాల మధ్య అదొక వివాదంగా మారింది.

ఈ కమిషన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని సిఫారస్ చేస్తుందని సందేహించిన చంద్రబాబు నాయుడు కమిషన్‌లోని సదరు సభ్యులను మేనేజ్ చేసి చైర్మన్ తో సంబందం లేకుండా ఒక నివేదిక తెప్పించుకుని కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలవారికి పది శాతం రిజర్వేషన్ లు ఇచ్చింది. దానికి తనదైన భాష్యం చెప్పి చంద్రబాబు నాయుడు ఆ పదిశాతంలో ఐదు శాతం కాపులకు ఇస్తామని ప్రకటించారు. నిజానికి అది చెల్లదు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో కనుక ఐదు శాతం ప్రత్యేకించి కాపులకు రిజర్వేషన్లు పెట్టి, మిగిలిన ఐదు శాతం ఇతర అగ్రకుల పేదలకు అని చెప్పి ఉంటే అప్పుడు సాధ్యమయ్యేది.

ఇది దేశవ్యాప్త అంశం కనుకక కేంద్రం అలా చేయలేదు. అయినా కాపులను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు చెల్లని చట్టాన్ని తీసుకు వచ్చారు. కోర్టులలో అది నిలబడని పరిస్థితి. దీనిని ఈనాడు రామోజీరావు వక్రీకరించి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు, దానిని జగన్ అమలు చేయనట్లు దుర్మార్గపు రాతలు రాశారు. కేవలం తెలుగుదేశం పార్టీకి జాకీలు వేసి లేపడం కోసమే ఈ అబద్దాలు వండుతున్నారన్నది స్పష్టం అవుతుంది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో  తుని వద్ద కాపుల  భారీ సభ జరిగింది.సభ పూర్తి అయ్యాక కొంతమంది ఆవేశపరులు రిజర్వేషన్ల డిమాండ్తో రైల్వే లైన్ పైకి  వెళ్ళారు. ఆ టైమ్లో ఎవరో రైలు భోగీలకు నిప్పు పెట్టారు. అది పెద్ద సంచలనం అయింది.

అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ మంటలను ఆర్పడానికి కాకుండా, దానిని ఒక అవకాశంగా మార్చుకుని ప్రతిపక్షనేత జగన్ పైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పైన బురద చల్లే యత్నం చేశారు. పైగా రాయలసీమ నుంచి, కడప నుంచి వచ్చిన రౌడీలు ఈ పని చేశారని ఆరోపించారు. తీరా కేసు విచారణలో పోలీసులు కాపు నేతలు పలువురిని అరస్టు చేశారు. ముద్రగడను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికివెళ్లినప్పుడు ఆయన కుటుంబ సభ్యులను ఎంత నీచంగా దూషించింది ఆయనే స్వయంగా కన్నీళ్లుపెట్టుకుని చెప్పారు. ఇంకోసారి ముద్రగడ పాదయాత్ర  చేపడితే ఇంటి నుంచి బయటకు రాకుండా వందలాది మంది పోలీసులను కిర్లంపూడి వద్ద మోహరింప చేసి కదలనివ్వలేదు.

అదంతా ప్రజాస్వామ్యంగా ఈనాడు రామోజీకి కనిపించింది. గత ఎన్నికల సమయంలో జగ్గంపేట ప్రాంతంలో జగన్ పర్యటిస్తున్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. అది తమ పరిధిలో లేని అంశమని, కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని విస్పష్టంగా తెలిపారు. తాను మాత్రం కాపులకు ఐదువేల కోట్లు కేటాయించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దానికి చాలామంది సంతృప్తి చెందారు.ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు తప్ప అన్నిటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్‌ కనీసం ముద్రగడకు సానుభూతి కూడా చెప్పలేదు. కాపులకు రిజర్వేషన్లు ఏమిటి? తాను కులాలకు అతీతుడని చెబుతూ చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా మాట్లాడేవారు. కాని అదే పవన్ కళ్యాణ్‌ ఈ ఎన్నికల సమయంలో కాపులకు కుల భావన లేకపోతే ఎలా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

జగన్ కాపులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదని అజ్ఞానంగానో, లేక మోసపూరితంగానో ప్రశ్నిస్తున్నారు. గతంలో ముద్రగడ పట్ల చంద్రబాబు ప్రభుత్వ అనుచితంగా వ్యవహరించినప్పుడు పవన్ సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి సంఘీభావం తెలపడానికి గాను రాజమండ్రి వెళితే విమనాశ్రయంలోనే పోలీసులు నిలిపివేశారు. అయినా అప్పుడు కూడా చంద్రబాబుకే పవన్ మద్దతు ఇచ్చారు. ఇక వంగవీటి రాధా విషయానికి వద్దాం. ఆయనకు గత ఎన్నికల సమయంలో సీటు ఇవ్వలేదంటూ ఈనాడు తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి రాధాను పార్టీ వదలవద్దని, బందరు ఎమ్.పి సీటు ఇస్తామని చెప్పినా వినకుండా ఆయన టీడీపీలో చేరారు.

ఒకప్పుడు తన తండ్రిని చంద్రబాబే చంపించారని చెప్పిన రాధా టీడీపీలో చేరడాన్ని రంగా అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.. పోనీ అక్కడ ఏమైనా సీటు ఇచ్చారా? ఎమ్మెల్సీ  పదవి ఏమైనా ఇచ్చారా? అదీ లేదు. కాని రాధామీద రామోజీరావు ప్రేమ ఒలకపోస్తున్నట్లు నటిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేయాలి. నాలుగు దశాబ్దాల కిందట రామోజీరావు ప్రతిఘటన అనే సినిమా తీశారు. అందులో రాధా తండ్రి, దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను పరోక్షంగా విలన్ గా చిత్రీకరించింది వాస్తవం కాదా! ఆ సినిమాలో చివరి సన్నివేశంలో హీరోయిన్ విలన్ను గొడ్డలితో నరికి చంపినట్లు చూపుతారు.

ఆ తర్వాత కొంతకాలానికి బందరు రోడ్డులో నిరసన దీక్ష చేస్తున్న రంగాను టీడీపీకి సంబంధించినవారు  గొడ్డళ్లతోనే నరికి హత్య చేశారు. ఆ హత్య విషయం అంతా చంద్రబాబు నాయుడుకు ముందే  తెలుసునని కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. దాని గురించి ఎన్నడైనా ఈనాడు రామోజీరావు వార్తలుగా ఇచ్చారా? విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో రంగా అభిమానులకు, టీడీపీ వారికి ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది రంగా విగ్రహానికి స్వయంగా టీడీపీ పెద్ద నేతలు దండలు వేసి ఆయనపై అభిమానం ఉన్నట్లు కనిపించే యత్నం చేయడం అంటే కాపు వర్గాన్ని బుట్టలో వేసుకోవడానికే అన్నది విదితమే.

వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారికి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఆమె రెండుసార్లు గెలిచారు కూడా. ఆ తర్వాత ఆమె అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు. తిరిగి 2004లో రంగా కుమారుడు రాధాకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించింది వైఎస్ రాజశేఖరరరెడ్డి.ఆ తర్వాతకాలంలో రాధా కూడా జగన్ వెంట నడిచి విజయవాడ తూర్పు నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీలో ఆయనకు గుర్తింపు తగ్గలేదు. కారణం ఏమైనా ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీవైపు వెళ్లారు.ఇప్పుడు ఆయన మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వస్తారో లేదో తెలియదు.

కాని ఈనాడు మాత్రం కంగారుపడుతూ ఇలాంటి అసత్యపు వార్తలు రాసింది.జగన్ అధికారంలోకి వచ్చాక తాను హామీ ఇచ్చిన విధంగా కాపు నేస్తం స్కీమును అమలు చేసి ఆ వర్గంం మహిళలకు ఏడాదికి 18500 చొప్పున ఆర్దిక సాయం చేస్తున్నారు. అంతేకాక కాపులలో పేదలైనవారికి కూడా వివిధ సంక్షేమ స్కీములు ఇస్తున్నారు. దానివల్ల కాపులలో ఆయనకు ఆదరణ కొనసాగుతోంది. దానిని తగ్గించడానికి చంద్రబాబు నాయడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రయోగించారు. పవన్ కళ్యాన్‌ వ్యూహాత్మక తప్పిదాలనండి, ఆయన ప్రత్యర్ధులు చెబుతున్నట్లు ప్యాకేజీ ఆకర్షణ అనండి.. ఆయన టీడీపీతో ఎలాంటి షరతులు లేకుండా పొత్తు పెట్టుకున్నారు.

చివరికి లోకేష్ సీఎం.పదవి చేపట్టడానికి చంద్రబాబు మాదిరి పవన్ కు అనుభవం, సమర్ధత లేదని పరోక్షంగా చెప్పినా ఆయన మాట్లాడలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నా టీడీపీ పాలిట్ బ్యూరో డిసైడ్ చేయాలని మరింతగా అవమానించారు. దీనిని కాపువర్గం భరించలేకపోతోంది. ఈ నేపధ్యంలో కాపులను ఎలాగొలా చంద్రబాబు, పవన్లకు దూరంకాకుండా చూసే యత్నంలో భాగంగా ఈనాడు రామోజీరావు ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచురించి, టివీలో ప్రసారం చేస్తున్నారు. ఇదంతా కాపులను మరోసారి మోసం చేయడానికే. రామోజీరావు వంటివారి మాటలను నమ్మి కాపులు మళ్లీ, మళ్లీ మోసపోవడానికి సిద్దపడతారా?

- కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్.

ఇవి చదవండి: బాబు బ్యాచ్ చిత్తు..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement