వైఎస్సార్‌సీపీ నాయకులతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్
వైఎస్ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు
పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్సార్ సీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్ వైభవానికి ఇదే గట్టి పునాది అని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఫలితాలపై ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే...
⇒ మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
⇒ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకూ మంచి చేశాం. పార్టీ కచ్చితంగా పునర్ వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది.
⇒ రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్‌మెంట్‌పై అనుమానాలు, పోలింగ్ బూత్‌ల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరుపై కచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారు.
ఎన్నికల తీరుపై అనుమానాలు
ఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.
పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలుచోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రస్తావించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు.
ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైస్ ఛైర్మన్ జకియా ఖానమ్, నూతనంగా గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, తనూజ రాణి తదితరులున్నారు.
ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రూహుల్లా, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, విడదల రజని, పేర్ని నాని, ఉషా శ్రీచరణ్, కె.నాగేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్ కుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment