మహిళల సమస్యలను వింటున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
40 శాతం మంది నమ్మి ఓటేశారు
మన వైపు ఉన్న మరో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గు చూపారు
6 నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం తెలుస్తుంది
చెప్పిన హామీలు ఏ మేరకు అమలు చేస్తారో వేచి చూద్దాం
వైఎస్సార్‌సీపీ కేడర్, ఆస్తులపై దాడులతో విధ్వంసకర పాలన
ప్రజాపక్షంగా వ్యవహరిద్దాం.. 2029లో ప్రజలు మనవైపే చూస్తారు.. కేడర్ ఎవ్వరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘చెప్పింది చెప్పినట్లు చేసి చూపెట్టాం. చెప్పనవి కూడా ఆచరణలో చూపెట్టాం. మనం చేయగలిగిందే ఎన్నికల్లో చెప్పాం. 40 శాతం మంది నమ్మి ఓటేశారు. మన వైపు ఉన్న మరో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకుంటారో వేచిచూద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించే రోజు రానే వస్తుంది. వైఎస్సార్‌సీపీ కేడర్ లక్ష్యంగా వ్యక్తిగత దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోంది. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. అండగా నిలుస్తాం.
బాధితులందర్నీ కలుస్తాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, అందుకోసం వైఎస్సార్‌సీపీ ప్రజాపక్షంగా నినదిస్తోందన్నారు. ‘మన హామీలను నమ్మి 40 శాతం మంది ఓటు వేశారు. 50 శాతం కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన పథకాలు అమలు చేయలేరు. ఆరు నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం బహిర్గతం అవుతుంది. కూటమికి ఓటేసిన ప్రజలు మరోమారు మోసపోయామని గ్రహిస్తారు’ అన్నారు.
పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమైన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
పోటెత్తిన యువత
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనతో మాట కలిపేందుకు, ఫొటో దిగేందుకు యువత పెద్ద సంఖ్యలో పులివెందులకు వచ్చారు. సుపరిపాలన అందించిన జగన్ యోగ క్షేమాలు తెలుసుకోవాలని మరికొందరు తరలి వచ్చారు. పదవులు ముఖ్యం కాదు.. మీ వెంటే మేమంతా నడుస్తాం.. మీతోనే మాబాట.. అని భరోసా నింపేందుకు ఇంకొందరు విచ్చేయడంతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది. స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహిస్తూనే, మరోవైపు వచ్చిన వారికి ధైర్యం చెబుతూ వైఎస్ జగన్ రోజంతా బిజీబిజీగా గడిపారు.
పులివెందుల క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
ఏకధాటిగా నిల్చొని వేలాది మంది ప్రజానీకాన్ని కలిశారు. ఈ క్రమంలో ఆయన్ను చూడాలని, కలవాలని యువత ఆత్రుత ప్రదర్శించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. కిటీకి అద్దాలు పగలి ఓ యువకుడికి చిన్నపాటి గాయమైంది. జనం భారీగా తరలి రావడంతో కేవలం అర గంటలో మధ్యాహ్న భోజనం ముగించి, మళ్లీ సాయంత్రం వరకు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, ఎస్‌బీ అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, కడప మేయర్ కె సురేష్‌బాబు, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహార్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడారు.
మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది
వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. మనం చేసిన మంచి, మేలు ప్రజల గుండెల్లో ఉండిపోయిందని చెప్పారు. శిశుపాలుడు లాగా తప్పులు మొదలయ్యాయని, రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ‘మనకు ఓటు వేశారని, వారికి ఓటు వేయలేదనే కారణంగా ప్రజలు, వైఎస్సార్‌సీపీ కేడర్, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. శిశుపాలుని లాగా పాపాలు చేస్తున్నారు. ఆ పాపం పండే రోజు వస్తుంది. 2029లో ప్రజలు మన వైపే చూస్తారు.
మంచి చేసిన మీ జగన్ వైపే ప్రజలు నిలవనున్నారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుస్తా. చంద్రబాబు సర్కార్ బాధితులందర్నీ కలుస్తా’ అని స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లు తన భర్తను టార్గెట్ చేసి దాడి చేశారని ముదిగుబ్బ సర్పంచ్ సతీమణీ వాపోయారు. అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ ఆమెను ఊరడించారు. మనకు మంచిరోజులు రానున్నాయని, అంత వరకు ఓపిగ్గా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment