జనసేనకు మరో 4 మంత్రి పదవులు
కూర్పుపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు
నేడు టీడీఎల్పీ సమావేశం
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా సభలో అడుగు పెడతామని చెప్పడంతో పలు ఊహాగానాలు సాగాయి. అయితే తాజాగా పవన్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చలో దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనతోపాటు జనసేన నుంచి గెలిచిన మరో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కోరగా చంద్రబాబు అందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో ఒకటి నాదెండ్ల మనోహర్‌కి దక్కడం ఖాయమని చెబుతున్నారు. మిగిలిన పదవులకు కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాల వారీగా పదవులు
చంద్రబాబు ఉమ్మడి జిల్లాల వారీగానే మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నారా లోకేష్ మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, కూన రవికుమార్, కొండ్రు మురళి రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినందున అచ్చెన్నాయుడికి ఇవ్వటంపై సందిగ్దం నెలకొంది.
విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేసులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, పితాని సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి.
కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర పేర్లను పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణల్లో ఒకరిద్దరికి అవకాశం లభించనుంది. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, బాల వీరాంజనేయస్వామి పోటీలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు.
చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, కిశోర్ కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రేసులో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత ఉన్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, పుట్టా సుధాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వర్‌రెడ్డిలో ఒకరిద్దరికి చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.
నేడు టీడీపీ శాసన సభాపక్ష సమావేశం
టీడీపీ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం జరగనుంది. సమావేశంలో చంద్రబాబును తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment