తెగేసి చెబుతున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తాను ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదని మొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలెం, సామర్లకోట సభల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వల్లె వేశారు. తాను కులాలకు అతీతమంటూనే కాపులకు ప్రాధాన్యమేదని ప్రశ్నిస్తారు. రాష్ట్రమంతా జల్లెడ పట్టి ఆ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇతర కులాల పట్ల విద్వేష పూరితంగా మాట్లాడతారు. గతంలో టీడీపీని పలుమార్లు తూర్పారబట్టిన పవన్.. ఇప్పుడు అదే పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ తన ఫ్యాన్స్ నుంచే ప్యాకేజీ స్టార్‌గా గుర్తింపు పొందారు. బీజేపీని తీవ్రంగా నిందించిన ఆ నోటితోనే అత్యద్భుతమని పొగుడుతారు. మాటలో నిజాయితీ, వ్యవహారంలో స్థిత ప్రజ్ఞత, మనిíÙలో స్థిరత్వం మచ్చుకైనా కనిపించని పవన్ నాయకత్వంలోని భ‘జనసేన’లో ఇక కొనసాగలేమని పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.
నేను ప్రశ్నిస్తాను.. నిలదీస్తాను.. ఎదిరిస్తాను.. అంతు తేలుస్తాను.. ప్రజల పక్షాన నిలుస్తాను... అంటూ నిత్యం ఊగిపోతూ డాంబికాలు పలికే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నాయకులు, క్యాడర్ ప్రశ్నలకు కనీస స్థాయిలో సమాధానం చెప్పుకునే స్థితిలో లేరనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల నుంచి తమకు ఎదురవుతున్న తీవ్ర అవమానాలు, అసహనాలు, ఈసడింపులు, ఛీత్కారాలను తట్టుకోలేకపోతున్నామని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు.
జనసేనాని తీరుతోనూ వరుసగా పార్టీని వీడిపోయే వారే తప్ప కొత్తగా వచ్చి చేరేవారు మచ్చుకు ఒక్కరూ కనిపించడం లేదంటున్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఏదో సాధించేస్తారనే అంచనాలతో పవన్ పక్కన చేరిన మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, సీనియర్ నాయకులకు ఆయన తత్వం త్వరగానే బోధపడి తమ దారి చూసుకున్నారు.
రాజకీయాలపై ఆసక్తితో, ఏదో ఒకటి చేయకపోతారా, పార్టీని ముందుకు తీసుకెళ్లకపోతారా, మంచి రోజులు రాకపోతాయా? అనే ఆశతో ఇటీవలి వరకు కొనసాగిన వారికి మాత్రం తమ దింపుడు కల్లం ఆశలు ఆవిరై జనసేనకు జెల్లకొట్టి ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. కొందరేమో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటన్న భావనతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ తాజా పరిస్థితులను గమనిస్తున్నారు. ఇంకొందరు పదవులపై ఆశలు వదులుకుని రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
కూటమిలో సీట్ల సర్దు‘పాట్ల’ను చూసిన తర్వాత దాదాపు రోజూ జనసేనలో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి హోదా కలిగిన నాయకులు ‘పవన్.. నీకో నమస్కారం..’ అంటూ గుడ్ బై చెబుతూనే ఉన్నారు. చివరకు తోక పార్టీగా మారి సైకిల్ వెనుక తిరిగేలా, టీడీపీకి సేవ చేసుకునే ‘సేన’లా జనసేనాని చేసేశారని, కనీస గౌరవ మర్యాదలూ దక్కడం లేదని జనసేన శ్రేణులు మధన పడుతున్నాయని ఆ పార్టీని వీడిన వారు వివరిస్తున్నారు.
ప్రతి అడుగులోనూ తొట్రుపాటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామనే అంచనాలతో కొణిదెల చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. కాలక్రమంలో జెండా ఎత్తేసి కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పదవిని అనుభవించారు. అన్నకు తోడుగా ప్రజారాజ్యంలో యువరాజ్యం చీఫ్‌గా చలామణీ అయిన పవన్ కళ్యాణ్.. 2014 ఎన్నికలకు ముందు ‘జనసేన’ను స్థాపించినప్పటికీ ప్రతి అడుగులోనూ తొట్రుపాటే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
పార్టీ ఆవిర్భావంలో టీడీపీ, బీజేపీలతో జత కట్టిన పవన్, ఏ ఎండకా గొడుగు అన్నట్లు ఎక్కడి మాటలు అక్కడ మాట్లాడుతూ తన అవసరాలు కానిచ్చేసుకుంటూ వచ్చారు. 2019 నాటికి టీడీపీకి మేలు చేసేలా ‘రహస్య ఒప్పందాలు’తో తన జనసేనే ప్రత్యామ్నాయమనే రీతిలో ఎన్నికల బరిలోకి దిగి.. గాజువాక, భీమవరంలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టిన పవన్.. చంద్రబాబు కోసం నానా ప్రయాసలకు లోనవుతూ తన నటనానుభవాన్ని రంగరించారు.
చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు అంగీకరించి ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడాలనుకున్న అనేక మంది ఆశావహులపై నీళ్లు చల్లారు. పిఠాపురం నుంచి స్థానికేతరుడిగా బరిలో నిలిచి .. స్థానికురాలు, విద్యావంతురాలు, సీనియర్ రాజకీయవేత్త అయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీతతో పోటీ పడటానికి కిందామీదా పడుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మేధావి వర్గం ముందే మేల్కొని..
తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆర్.ఆర్.రామ్మోహన్‌రావు, సీబీఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ, ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఐఆర్‌ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాదాసు గంగాధరం, ముత్తంశెట్టి కృష్ణారావు, రాఘవయ్య, బైరా దిలీప్, ఆకుల చంద్రశేఖర్ లాంటి వారెందరో పవన్ రాజకీయ పరిజ్ఞానాన్ని, వ్యవహార శైలిని పసిగట్టి పక్కకు తప్పుకున్నారు.
రాజకీయాలపై ఆశలున్న వారు పలువురు పార్టీలోకి అడుగిడి రూ.కోట్లు, లక్షలు పోగొట్టుకున్న తర్వాత మేల్కొని దూరమయ్యారు. తాము ఏ విధంగా మోసపోయిందీ ఏకరువు పెట్టారు కూడా. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ ఓడిపోయినా, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. çపలు నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లను పొందిన జనసేన అభ్యర్థులకు తాజా ఎన్నికల్లో కూటమి తరఫున సీట్లు సాధించుకోవడంలోనూ పవన్ పూర్తిగా విఫలమయ్యారు.
విజయవాడ వెస్ట్‌లో బీసీ వర్గానికి చెందిన పోతిన మహేష్ ఉమ్మడి కృష్ణాలో బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లాలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, అప్పారావు, నేరెళ్ల సురేష్ దర్శికి చెందిన ఎన్‌ఆర్‌ఐ వెంకట్, తూర్పుగోదావరికి చెందిన తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పాతంశెట్టి సూర్యచంద్ర తదితరులు జనసేన బాధిత వర్గంగా మిగిలిపోయారు. అవనిగడ్డ సీటు ఆశించిన వారిదీ అధోగతేనని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
కొన్ని జిల్లాలకే పరిమితం..
రాష్ట్ర స్థాయి పార్టీగా ఆవిర్భవించిన జనసేనను పవన్ కళ్యాణ్ తన అపరిపక్వతతో అతి తక్కువ సీట్లతో కొన్ని జిల్లాలకే పరిమితం చేశారని పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. ఆ సీట్లు కూడా చాలా మంది టీడీపీ నేతలకే ఇచ్చారు. జనసేన ఆవిర్భవించి దశాబ్ద కాలమైనా సంస్థాగతంగా కనీస స్థాయిలో బలపడలేదు. చివరకు పార్టీ గుర్తునూ సక్రమంగా దక్కించుకోలేని స్థితిలోకి జనసేన దిగజారింది. ‘జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాటలను, ఆయన బంధం వ్యవహారాలను అంచనా వేసుకోలేక అమెరికా నుంచి కుటుంబం మొత్తం వచ్చి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయాం.
కోట్ల రూపాయలు పోగొట్టుకుని నష్టపోయాం. సీటు ఇస్తామంటూ మోసం చేశారు’ అని దళిత మహిళ సి.సుభాషిణి ఆవేదనలో జనసేన చేతిలో దెబ్బతిన్న వారందరి గుండె ఘోష వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలు తమ వెంట నడవడానికి, వేదికను పంచుకోవడానికి కూడా పలువురు టీడీపీ నాయకులు అంగీకరించడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని జనసేన నేతలు వాపోతున్నారు.
పవర్ లెస్!
పిఠాపురంలో పని చేయని పవన్ మానియా అందుకే మెగా ఫ్యామిలీని దింపుతున్నారని చర్చ పలువురు బుల్లితెర నటులు సైతం ప్రచారం ఇంత మంది వస్తే గానీ నెగ్గలేనని అనుమానం! తానొక్కడిని గెలిస్తే చాలనుకుంటున్న వైనం
జనసేన అభ్యర్థుల గెలుపుసంగతేమోగానీ, పిఠాపురంలో తాను గెలిస్తే చాలనే స్థితికి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాయకుడిగా తాను నిలబెట్టిన వారి గెలుపు సంగతి పక్కనబెట్టి, అధిక సమయం తన కోసమే కేటాయించుకున్నారని ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తానొక్కడే గెలిచి అసెంబ్లీకి వెళితే చాలన్నట్టుగా ఉంది ఆయన శైలి అని జనసేన శ్రేణులు వాపోతున్నాయి.
పవన్ అన్న నాగబాబు నెల రోజులుగా పిఠాపురంలోనే తిష్ట వేశారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు. నాగబాబు భార్య సైతం మరిది కోసం ప్రచారంలో పాలు పంచుకున్నారు. పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా పిఠాపురంలో తిరగాల్సిన పరిస్థితి. వీరికితోడు జబర్దస్త్ టీం మొత్తం ఇక్కడ వాలిపోయింది. అయినప్పటికీ పిఠాపురంలో ప్రచారం సరిపోదనుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్లే మెగాస్టార్ చిరంజీవిని పిఠాపురంలో ప్రచారానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పదుల సంఖ్యలో తారలు దిగి వస్తున్న తీరు చూస్తుంటే పిఠాపురంలో తన గెలుపుపై పవన్‌కు నమ్మకం లేదనేది స్పష్టమవుతోందంటున్నారు. ప్రచార ఆర్భాటం, మద్యం, డబ్బు లేని ఎన్నికలు రావాలని తెగ గొప్పలు చెప్పిన పవన్.. ఇప్పుడు రూ.కోట్లు వెదజల్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎమ్మెల్యే కాకపోతే ఇక తన రాజకీయ జీవితం ముగిసినట్టే అని అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందులో మెగా హీరోలు, జబర్దస్త్ ఆరి్టస్టుల స్పెషల్ ఫ్లైట్ చార్జీలు, ఇతర ఏర్పాట్లకు అవుతున్న ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు.
ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ అంత ఖర్చుకు సిద్ధమయ్యారని ఇక్కడి ఏర్పాట్లు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోవడం కష్టంగా ఉందని జనసేన నేతలు ఒప్పుకుంటున్నారు. కాగా, పిఠాపురంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న టీడీపీ నేత ఖర్చే భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకే రోజూ పెద్ద మొత్తంలో చెల్లించుకుంటున్నారని జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment