దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) చర్చనీయాంశం అవుతున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుడు ఎలాన్ మస్క్, మరో ప్రముఖుడు శ్యామ్ పిట్రోడా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తదితరులు ఈవీఎంలపై చేసిన ట్వీట్ లు సహజంగానే అందరి దృష్టిని ఆకరర్షిస్తాయి. న్యాయం చేయడం కాదు.. న్యాయం జరిగినట్లు కనిపించాలన్న సూత్రాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉటంకించారు. అలాగే ప్రజాస్వామ్యం ఉందని అనుకోవడం కాకుండా, ప్రజాస్వామ్యం నిస్సందేహంగా అమలు అవుతున్నట్లు కనిపించాలని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న దేశాలలో ఈవీఎం ల బదులు, బాలెట్ పత్రాలనే వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడడానికి మనం కూడా ఆ దిశగా వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేయడంపై అధికార పక్షం తెలుగుదేశం అభ్యంతరం చెప్పవచ్చు. ఆ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా మాట్లాడలేదు కానీ, ఆయన ఆ పార్టీ నేతలు కొందరు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో వైఎస్సార్‌సీపీ గెలిచిన ఘట్టాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
విశేషం ఏమిటంటే 2009, 2019లలో టీడీపీ ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 2009 లో అయితే చంద్రబాబు తన అనుచరుడు ఒకరు తీసుకు వచ్చిన ఈవీఎం తో అవి ఎలా హాక్ చేయవచ్చో తెలియచేస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2014లో విభజిత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. వైఎస్సార్‌సీపీ 67 సీట్లకే పరిమితం అయింది. అయినా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దానిపై ఏమీ ఆరోపణ చేయలేదు. ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజాక్షేత్రంలో పని చేసుకుంటూ సాగారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పుడు టీడీపీ ఈవీఎం లపై అనుమానాలు వ్యక్తం చేయకపోలేదు.
ఆ సమయంలో సహజంగానే వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. 2024లో వైఎస్సార్‌సీపీ మామూలుగా ఓడిపోయి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందేమోలే అనుకునేవారు. అలాకాకుండా ఎవరూ ఊహించని రీతిలో కేవలం పదకుండు స్థానాలకే వైఎస్సార్‌సీపీ పరిమితం అవడంతో ఈవీఎం లపై అనుమానాలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత లేదన్నది ఎక్కువమంది అభిప్రాయం. 2014లోనే 67 సీట్లు వస్తే, ఐదేళ్ల అధికారం తర్వాత, అనేక హామీలు అమలు చేసిన తర్వాత కేవలం 11 సీట్లే ఎలా వస్తాయన్నది పలువురి ప్రశ్నగా ఉంది.
ఈవీఎం లపై సందేహాలు వచ్చినా, ప్రభుత్వపరంగా, లేదా పార్టీపరంగా జరిగిన లోటుపాట్లపైనే వైఎస్సార్‌సీపీ వర్గాలు దృష్టి పెట్టి చర్చించుకున్నాయి. కానీ ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు, టెస్లా కార్ల అధిపతి ఎలాన్ మస్క్ ఈవీఎం లపై చేసిన వ్యాఖ్యలతో అందరిలోను దీనిపై ఆలోచన ఆరంభం అయింది. ఆయన ఈవీఎం లను హాక్ చేయడం, టాంపర్ చేయడం సాధ్యమేనని వ్యాఖ్యానించారు. దానిని మరో నిపుణుడు, భారత్ లో కంప్యూటర్ల శకం ఆరంభించడంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్ పిట్రోడా కూడా బలపరిచారు. తాను అరవై ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నానని, ఈవీఎం ల పనితీరును అధ్యయనం చేశానని, వాటిని మానిప్యులేట్ చేయడం సాద్యమేనని పేర్కొన్నారు. పేపర్ బాలెట్ వైపు వెళ్లడమే శ్రేయస్కరమని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈవీఎం లపై ఆరోపణలు చేయడం ఆరంభించాయి.
శివసేన నేత ఆదిత్య ఠాక్రే అయితే నేరుగా బీజేపీ ఈవీఎం లను ట్యాంపర్ చేసిందని ఆరోపించారు. కాగా దేశంలో ఎన్నికల అవసరాలకు అరవైలక్షల ఈవీఎం లను సరఫరా చేశామని సంబంధిత సంస్థలు చెబుతుంటే, నలభై లక్షల ఈవీఎం లే తమ వద్ద ఉన్నాయని, మిగిలిన 20 లక్షల ఈవీఎం ల సంగతి తమకు తెలియదని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఇదంతా మిస్టరీగా మారింది. కర్నాటకలో ఈవీఎం ల గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. అందువల్లే కర్నాటకలో కాంగ్రెస్ కు తక్కువ పార్లమెంటు సీట్లు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎం ల టాంపరింగ్ జరిగిందా? హాకింగ్ జరిగిందా? లేక ఈవీఎం లను మార్చివేశారా? అన్న అనుమానాలు ప్రజలలో వ్యాపిస్తున్నాయి.
ఈ సందర్భంలో ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వెల్లడిచేసిన విషయాలు మరింత సంచలనంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఒక గ్రామంలో జరిగిన అనుభవాన్ని ఆయన వివరించారు. ఆ గ్రామంలో ఎప్పుడూ రిగ్గింగ్ లేదా కొందరు కూర్చుని ఓట్లు ఎవరికి వేయాలా అన్నది డిసైడ్ చేసి ఆ ప్రకారం చేస్తుంటారట. అందులో ఒక పార్టీకి అధిక ఓట్లు వేసి, ఎదుటి పార్టీకి కూడా కొన్ని ఓట్లు వేస్తారట. కానీ చిత్రంగా తాము తక్కువ ఓట్లు వేసిన పార్టీకి మెజార్టీ వచ్చినట్లు కౌంటింగ్ లో వెల్లడైందని, ఇదెలా సాద్యమని వారు ప్రశ్నిస్తున్నారట. ఆ గ్రామం, తనకు చెప్పిన వ్యక్తుల గురించి బహిరంగంగా వెల్లడించి ఎన్నికల కమిషన్ ను ఉండవల్లి అరుణకుమార్ నిలదీయగలిగితే, దీనిపై ఆయన న్యాయపోరాటం చేయగలిగితే మరో చరిత్రను సృష్టించినవారు అవుతారు. ఆయనకు ఆయా రాజకీయ పక్షాలు సహకరిస్తే మంచిదే.
సీపీఐ నేత కే నారాయణ కూడా ఇదే తరహాలో ఈవీఎం లను వ్యతిరేకిస్తూ బాలట్ పత్రాలే బెటర్ అని స్పష్టం చేస్తున్నారు. అదే టైమ్ లో రాజీవ్ చంద్రశేఖరన్ అనే ప్రముఖుడు మాత్రం ఈ వాదనలను అంగీకరించలేదు. ఎలాన్ మస్క్ చెప్పినట్లు ఏ దేశంలో అయినా టాంపరింగ్ జరుగుతుందేమో కానీ, ఇండియాలో కాదని అన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ నిర్దిష్టమైన ప్రకటన చేసినట్లు కనిపించలేదు. ఈవీఎం లను సెల్ ఫోన్ ద్వారా మార్చవచ్చని కొందరు, చిప్ లను రహస్యంగా మార్చే అవకాశం ఉందని మరికొందరు, నెట్ కనెక్షన్ లేకపోయినా టాంపర్ చేయవచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసుకుని ఈ మానిప్యులేషన్ జరిగిందా అన్నది కొందరి ప్రశ్నగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌సీపీకి బాగా తక్కువ సంఖ్యలో సీట్లు రావడంతో పలువురు ఆసక్తి కొద్ది ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలో అనేక చోట్ల ప్రజలు తాము వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశామని, అయినా మెజార్టీ టీడీపీకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్న ఘట్టాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. హిందుపూర్ లో వైఎస్సార్‌సీపీ ప్రాతినిద్యం వహిస్తున్న ఒక వార్డులో ఈ పార్టీకి ఒకే ఓటు వచ్చినట్లు నమోదు అవడం విస్తుపరచింది. 2019లో ఎన్నికల సమయానికి, 2024 ఎన్నికలనాటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. బీజేపీ, జనసేనలు టీడీపీకి దూరం అయ్యాయి. రుణమాఫీ, కాపుల రిజర్వేషన్ వంటి హామీలు నెరవేర్చకపోవడంతో టీడీపీ బాగా అన్ పాపులర్ అయింది.
2024లో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ప్రజలకు నవరత్నాల పేరుతో ఏ హామీలు ఇచ్చారో వాటినన్నిటిని అమలు చేసి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. సిద్దం సభలు, బస్ యాత్ర వంటివి బాగా విజయవంతం అయ్యాయి. పేద వర్గాలన్నీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంట నడిచాయన్న భావన ఉంది. ప్రతిపక్ష దుష్ప్రచారం ప్రభావం కొంత పడినా, అది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయేంత కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. టీడీపీ కూటమికి, వైఎస్సార్‌సీపీకి మధ్య నువ్వా, నేనా అన్నంతగా పోటీ ఉండవచ్చని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అందుకు విరుద్దంగా ఫలితాలు రావడం అందరిని ఆశ్చర్యపరచింది.
కొంతమంది కూటమి పెద్దలు అసెంబ్లీ సీట్లపై పందాలు కాసిన తీరు, మెజార్టీలపై కూడా బెట్టింగ్ లు కాసిన వైనం కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అసలు బీజేపీ గెలిచే అవకాశం ఉండదనుకున్న ఒక నియోజకవర్గంలో, తమకు ఇన్నివేల మెజార్టీ వస్తుందంటూ కొందరు నేతలు పందాలు కాశారట. 2019లో వైఎస్సార్‌సీపీ గెలిచినా మెజార్టీలు కొద్ది నియోజకవర్గాలలో మినహా మరీ అతిగా లేవు. అలాంటిది ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్దులకు వచ్చిన మెజార్టీలు అనూహ్యంగా ఉన్నాయి. అనేకమందికి ఏభైవేలకుపైగా మెజార్టీలు రావడం విస్తుపరుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈవీఎం ల టాంపరింగ్ పై ప్రజలలో డౌట్లు మొదలయ్యాయని అంటున్నారు. మాబోటి వాళ్లం కూడా ఈవీఎం ల టాంపరింగ్ సాధ్యం కాదేమో అనుకున్నప్పటికీ, గత కొద్ది సంవత్సరాలలో టెక్నాలజీ మరింతగా వృద్ది చెందడం, సైబర్ నేరాలు బాగా పెరగడం, హాకింగ్ పై వస్తున్న కథనాల నేపథ్యంలో ఈవీఎం లు కూడా వీటికి అతీతం కాదేమోనన్న డౌటుకు రావల్సి వస్తోంది. అందులోను అంతర్జాతీయ స్థాయి నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల సంఘం వీటిని నివృత్తి చేయడానికి గాను చర్యలు చేపడితే బాగుంటుందనిపిస్తుంది.
ఇందుకోసం ఎలాన్ మస్క్ వంటివారిని, భారత్ కు చెందిన కొందరునిపుణులను పిలిచి ఈవీఎం ల ప్రామాణికత, హాకింగ్ అవకాశం ఉందా? లేదా? అనేదానిపై ప్రాక్టికల్ ప్రజెంటేషన్లు తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరం అనిపిస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్టం చేయాలని చెప్పాలి. నిజంగానే ఈవీఎం లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తేలితే బాలట్ పత్రాలవైపు మొగ్గు చూపవచ్చు. అమెరికా, జపాన్ వంటి దేశాలలో బాలెట్ పత్రాలనే వాడుతున్నారు.
ఇండియాలో బాలెట్ పత్రాల సిస్టమ్ ఉన్నప్పుడు రిగ్గింగ్ వంటి సమస్యలు ఎదురయ్యేవి. వాటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టవచ్చన్నది ఈ పద్ధతికి అనుకూలంగా ఉన్నవారి భావన. మొత్తం మీద ఈవీఎం లపై వచ్చిన డౌట్లను తీర్చకపోతే ఎన్నికల సంఘం తీరుపై కూడా అనుమానాలు వస్తాయి. ఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరించిన శైలిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కూటమిలోని పార్టీలకు కమిషన్ సహకరించిందన్న అభియోగాలు వచ్చాయి. అందువల్ల ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్న నమ్మకం కలగాలంటే ఈవీఎం లపై వచ్చిన సందేహాలన్నిటిని పరిష్కరించడం అత్యవసరమని చెప్పక తప్పదు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment