పిచ్చోడి గురించి వినడమే కాని, ఇంతవరకు చూడలేదు.. ఇప్పుడే చూస్తున్నా.. అని ఒక సినమా డైలాగు ఉంది. ఈ మధ్య కొందరు నేతల ప్రసంగాలు గమనిస్తే అలాగే అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిచ్చోడని మనం అనజాలం కానీ, ఆయన స్పీచ్‌ల తీరు మాత్రం రాజకీయ అజ్ఞానాన్ని, ఆయన ప్రస్టేషన్‌ను స్పష్టంగా తెలియచేస్తుంది. మొత్తం మీద తన గెలుపు మీద తనకే అపనమ్మకం ఏర్పడిందో, లేక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై అవిశ్వాసం ఏర్పడిందో కానీ, తన కుటుంబ సభ్యులందరిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. అలాగే జబర్దస్త్ టీమ్ పై నమ్మకం పెట్టుకున్నట్లున్నారు.
అఫ్ కోర్స్.. ఆయన సతీమణి అన్నాలెజోవా కనిపించడం లేదనుకోండి. ఆయన ప్రచారం ఆయన ఇష్టం. ఎందుకంటే పిఠాపురంలో తనను గెలిపించాలని వర్మను వేడుకున్న పవన్ కల్యాణ్ ఇతర నియోజకవర్గాలలో కూటమి అభ్యర్దులను గెలిపిస్తానని తిరుగుతున్నారు. పిఠాపురానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఏమి చేస్తానో చెప్పకుండా ఊదరకొట్టుకుంటూ తిరిగుతున్న పవన్‌ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు. సినిమా నటుడు కనుక కాసేపు వినోదం కోసం ఆయనను చూడడానికి వచ్చి, ఆయన పిచ్చి గంతులు, చిందులు చూసి, పనికిమాలిన డైలాగులు విని ఏదో సినిమా చూశాంలే అని జనం సరిపెట్టుకుంటున్నారు. గతంలో గాజువాక, భీమవరంలలో జరిగింది అదే.
మరో చిత్రం ఏమిటంటే ఆయన కాకినాడ సిటీలో చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్‌లో కన్నబాబుల అంతు చూడడానికే పిఠాపురంలో పోటీ చేస్తున్నారట. ఆయనే ఈ సంగతి చెప్పారు. నిజంగా వీరి అంతు చూడాలనుకుంటే ఆ నియోజకవర్గాలలో కదా ఆయన పోటీ చేయాల్సింది. అక్కడికి చంద్రశేఖరరెడ్డి ఒకటికి, రెండుసార్లు సవాల్ కూడా విసిరారు కదా? అయినా కాకినాడలో పోటీచేయకుండా పిఠాపురం ఎందుకు పవన్ కళ్యాణ్ చిత్తగించారు.
రాజకీయాలలో కాస్త పద్దతిగా మాట్లాడాలి. అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయా చోట్ల పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులను పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నైతే పట్టరాని కోపంతో ఊగిపోతూ శాపనార్ధాలు పెడుతున్నారు. ఆయన వైఎస్సార్‌సీపీని, ముఖ్యమంత్రిని అధఃపాతాళానికి తొక్కేస్తారట. ఇది ఆయన సినిమాలో నటించడమనుకుంటున్నారు కానీ, ప్రజాసేవ అనుకోవడం లేదు. అందుకే ఇలాంటి పిచ్చి మాటలు వస్తున్నాయి.
2019 లో రెండు చోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్‌ను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓడించి ఆయన భాషలో చెప్పాలంటే పాతాళానికి తొక్కారు. ఇప్పుడు ఎన్నికలకు ముందుగానే పవన్‌ను చంద్రబాబు అధఃపాతాళానికి తొక్కేశారు. పవన్ కళ్యాణ్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా లేకుండా చేసేశారు. ఒకప్పుడు తాను సీఎంను అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్‌ను ఆ ఊసే ఎత్తనివ్వకుండా చంద్రబాబు తన పెరటి మనిషిగా మార్చుకున్నారు. జనసేనను రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాలలో పోటీచేయనివ్వకుండా, ఓ ఇరవైఒక్క సీట్లు ఇచ్చి, అందులో డజను సీట్లలో టీడీపీ వాళ్లనే పెట్టి పవన్‌ను కేవలం తన కాళ్ల వద్ద పడి ఉండేలా చంద్రబాబు చేసుకోగలిగారు.
చంద్రబాబు వద్ద ఊడిగం చేయడానికే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని భావించిన పలువురు జనసేన నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ సంగతి అర్ధం కాకో, లేక అర్దం అయినా, చంద్రబాబుకు సరెండర్ అయినందువల్లో నోరు మెదపకుండా ఆయన చెప్పినట్లు పవన్ చేస్తున్నారు. జనసేనను రాష్ట్ర వ్యాప్త పార్టీగా లేకుండా చేసి, కేవలం రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేసి పవన్ స్థానం ఏమిటో చంద్రబాబు తెలివిగా చూపెట్టారు. ఇక ఎప్పటికీ జనసేన అధఃపాతాళంలోనే ఉండేలా చంద్రబాబు చేస్తే, ఈయనేమో ఎవరినో తొక్కుతానని ప్రగల్బాలు పలుకుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టీడీపీ పిఠాపురం నేత వర్మ కూడా ఈయన ధోరణితో విసిగి చిరాకు పడుతున్నారట. ఆయన పవన్‌కు ఆశించిన రీతిలో సహకరించకపోతే ఇంతే సంగతులు అన్న పరిస్థితి పిఠాపురంలో ఏర్పడిందని చెబుతున్నారు. చంద్రబాబు కన్నా ఘోరంగా అబద్ధాలు చెబుతూ, ఒక్కోచోట ఒక్కో మాట చెబుతూ ప్రజలను, ముఖ్యంగా అభిమానులను బురిడి కొట్టించాలనుకుంటున్న పవన్ లీలలన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. తాను ఇంటర్ చదివానని, అందులో కూడా ఆయా చోట్ల ఒక్కో గ్రూప్ చదివినట్లు చెప్పడం, తీరా చూస్తే ఆయన ఎస్ఎస్ఎల్‌సి అని బ్రాకెట్ లో 10 వ క్లాస్ అని పెట్టడంతో ఈయన ఏమిటో అర్దం అయింది.
ఆస్తుల కొనుగోలు లావాదేవీలలో కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఇంత మోసపూరితంగా ఉంటారా అన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. పవన్ ఎక్కడా తమ కూటమి అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం లేదు. ఎంతసేపు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. కొన్ని ఉదాహరణలు చూడండి.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల సొంత ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తారట. ప్రజలను రోడ్డుపైకి లాగేస్తారట.. బుర్ర, బుద్ది ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి పిచ్చి విమర్శలు చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా అలా చేయగలుగుతుందా? మరి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అంత వెర్రివాళ్లు, వాళ్లకు ఏమి తెలియదని, ఈయన ఏమి చెబితే దానిని చెవిలో పువ్వు పెట్టుకుని వింటారని అనుకుంటున్నారా? ఆ జిల్లా ప్రజలు బాగా తెలివైన వాళ్లన్న సంగతి పవన్ కు తెలియదు.
రేషన్ బియ్యం విక్రయాలలో 20 వేల కోట్ల కుంభకోణం చేశారట. అసలు ప్రభుత్వం ఇస్తున్నదే ఉచిత రేషన్ బియ్యం. అందులో స్కామ్ ఏమిటి? ఇంత అజ్ఞానమా? రీ సర్వే పేరుతో ప్రజల భూములను కంప్యూటరైజ్ చేస్తున్నారట. తద్వారా దోచేస్తారట. ఇది కేంద్రం తీసుకు వచ్చిన చట్టం అని తెలియకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే తప్పుడు వార్తలను పట్టుకుని పిచ్చి ఉపన్యాసాలు చేస్తే ఏమి ప్రయోజనం. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటీకరణ జరుగుతుంటే, భూముల వివరాలు కంప్యూటర్లలో ఎక్కించకూడదట. మరి భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌లు ఎప్పటి నుంచో అంటే చంద్రబాబు పాలన సమయం నుంచి కంప్యూటరైజ్ అవుతున్నాయి కదా? దాని వల్ల ఏ ప్రమాదం వచ్చిందో పవన్ చెప్పాలి కదా? అసలు ఇంతవరకు ఆ చట్టమే అమలులోకి రాలేదు. అయినా ఇలా వక్రీకరిస్తున్నారు.
ఇక రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి కారణం పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి మిధున్ ప్రత్యేక శ్రద్ద పెట్టడమే. రాజకీయాలలో ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా పవన్ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో చంద్రబాబుతో కలిసి తిరుగుతూ, వారిని ఓడిస్తా.. వీరిని ఓడిస్తా.. అని చెబుతుండే పవన్ తను పోటీచేసే నియోజకవర్గానికి వేరే పార్టీవారు వచ్చి బాధ్యత తీసుకోకూడదట. దీనిని బట్టే మిధున్ రెడ్డి అంటే పవన్ ఎంత భయపడుతున్నది అర్ధం చేసుకోవచ్చు.
మాజీ మంత్రి కన్నబాబుకు చిరంజీవి రాజకీయ భిక్షపెట్టారట. అయినా చిరంజీవిని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అవమానిస్తే స్పందించలేదట. చివరికి తన అన్న విషయంలో కూడా అబద్ధాలు చెప్పడమేనా! చిరంజీవిని అంత చక్కగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకుంటే, చంద్రబాబు చెప్పమన్నాడని, పవన్ కళ్యాణ్ ఈ రకంగా అసత్యాలు చెబుతున్నారు. కన్నబాబు వైఎస్సార్‌సీపీలో ఉంటే ఈయనకు వచ్చిన బాధ ఏమిటి? మరి చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో ఎందుకు కలిపారు? పవన్ కల్యాణ్ కొంతకాలం బీజేపీ, టీడీపీలతో, మరికొంతకాలం బీఎస్‌పీ, సీపీఐ, సీపీఎంలతో ఎందుకుపొత్తు పెట్టుకున్నారు. మళ్లీ తాను గతంలో బండ బూతులు తిట్టిన టీడీపీ, బీజేపీల పంచన ఎందుకు చేరారు? ఏదైనా మాట్లాడే ముందు అర్ధం ఉండాలి.
మిధున్ రెడ్డి ఏదో మద్యం వ్యాపారి అట. ఈయనేదో పవిత్రుడు మాదిరి కబుర్లు. ఒక పక్క అక్రమ సారా వ్యాపారం చేసి రాజకీయాలలోకి వచ్చిన సీ.ఎమ్.రమేష్ ను గెలిపించాలని చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోరుతూ మరో పక్క మిధున్‌పై విమర్శలు చేయడం అంటే ఈయన సారా పైత్యం ఏమిటో తెలుస్తూనే ఉంది. ఒకపారి కాపులైనా తనకు ఓటు వేయాలని, మరోసారి తనకు కులం ఏమిటని, ఇలా రకరకాలుగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో తన దత్తతండ్రి కళ్లలో ఆనందం చూడాలని తిరుగుతున్నారు. అందుకే ఆయనకు ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు.
పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇంతగా దిగజారి చంద్రబాబుకు తెగ భజన చేస్తున్న తీరు మాత్రం సినీ నటుడుగా ఆయనకు ఏర్పడిన అభిమానులు సైతం భరించలేకపోతున్నారు. జనసేన మొత్తం దివాళా తీసినా పర్వాలేదు.. తాను ఒక్కడినైనా గెలవాలన్న వాంఛతో పిఠాపురంలో తంటాలు పడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటూ రోడ్లపైకి ఎందుకు వచ్చానో ప్రజలు ఆలోచించాలి అని పవన్ అన్నారు. అవును!ప్రజలు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ప్రస్తుతం రోడ్లపై ఈయన తిరుగుతాడు. ఆ తర్వాత తనను కలవడానికి వచ్చేవారిని రోడ్డుపై నిలబెడతారు! అంతకు మించి ఈయన గెలిచినా, ఓడినా ప్రజలకు చేసే సేవ ఏమీ ఉండదు.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment