సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ఎన్నికల్లో బాగా పనిచేసింది: సజ్జల
మహిళా ఓటర్లు మా వైపే నిలబడ్డారని స్పష్టమైంది
ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో పెద్దపీట
4న కౌంటింగ్‌లో మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి
సొంతంగా పోటీ చేసే శక్తి లేకనే చంద్రబాబు పొత్తులు
పోస్టల్ బ్యాలెట్‌పై బాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు
దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాం
సాక్షి, అమరావతి: ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీ పట్ల పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జూన్ 4న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు తమవైపే నిలిచారనే విషయం ఎగ్జిట్ పోల్స్‌లో తేలిందన్నారు. శనివారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలను సమాజంలో ఆత్మగౌరవంతో నిలబెట్టారని, సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు కుటుంబాన్ని నడిపించగల శక్తిని అందించారన్నారు.
సీఎం జగన్ వల్లే తమకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో మహిళలు వారి కుటుంబాలు పోలింగ్‌కు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. ఐదేళ్లలో తమ కుటుంబాల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించడంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరగడంతో కొన్ని సర్వే సంస్థలకు వైఎస్సార్ సీపీపై క్షేత్ర స్థాయిలో ఉన్న సానుకూలత కనిపించలేదన్నారు.
పాజిటివ్ అజెండా పని చేసింది..
వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం మొత్తం పాజిటివ్ కోణంలో నిర్వహించాం. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగాం. చంద్రబాబు మరోసారి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ 2014లో మాదిరిగా మోసం చేసేందుకు వస్తున్నాడని గుర్తు చేశాం. టీడీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడారు. సీఎం జగన్ అంతు చూస్తామని, అధికారంలోకి వచ్చేశామంటూ విర్రవీగారు. సొంతంగా పోటీ చేయలేక కూటమి కట్టారు. మా నాయకుడు మాత్రం పాజిటివ్ అజెండాతో ప్రజలను ఓట్లు అడిగారు. పాజిటివ్ అజెండా పని చేసిందని స్పష్టంగా తెలుస్తోంది.
ఈసీ ఒత్తిడికి తలొగ్గితే ఎలా?
ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు ఏపీ సీఈవోపైకి దండయాత్రలా వెళ్లి బెదిరించలేదా? ఆ తర్వాత ఈవీఎంలు మోసం చేశాయంటూ దు్రష్పచారం నడిపారు. అలాంటి పార్టీకి చెందిన వాళ్లు ఈ రోజు మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పోస్టల్ బ్యాలెట్ విషయలో టీడీపీ గందరగోళం సృష్టించాలని యత్నించింది. ఏ రూల్స్ అవసరం లేకుండా నేరుగా పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవాలన్న టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మేం కోర్టుకెళ్లాం. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మా ఏజెంట్లకు చెప్పాం. తిరస్కరించాల్సిన ఓటును చెల్లుబాటయ్యేలా టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని చెప్పాం. దీనికే నాపై కేసులు మోపడం హాస్యాస్పదం.
సుప్రీం కోర్టుకు వెళ్తాం..
పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం. జూలై 2023లో ఈసీ స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. అందులో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు, తిరస్కరణ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీల్ లేకుంటే కనీసం హోదా వివరాలైనా రాయాలని ఉంది. పోలింగ్ అయ్యాక అది అవసరం లేదని ఈసీ చెప్పడం అనైతికం. వాళ్లిచ్చిన నిబంధనలను వాళ్లే తుంగలో తొక్కితే ఎలా? చంద్రబాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు.
అందుకే చంద్రబాబు కుట్రలు..
గత ఐదేళ్లలో పౌర సేవలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ప్రజలపై ఉండదనుకుంటే అది భ్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్ సీపీకి వస్తాయనే భయంతో పవన్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్‌తోనూ కలసి ఎన్నికలకు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చి లాభపడాలని నానా గడ్డి కరిచి విష ప్రచారం చేశారు. ఆయన ఇన్ని చేసినా మాపట్ల ప్రజల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. ఇటీవల ఎన్నికల రిగ్గింగ్ మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ జరుగుతున్నట్టుంది.
బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు బాగా తగ్గుతుండటంతో దక్షిణాదిలో పెరుగుతున్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వారికి నచ్చిన లెక్కలేసి చెబుతున్నారు. మాకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వైఎస్సార్ సీపీకి కచ్చితంగా అనుకూలించింది. ఐదేళ్లలో మేం ప్రజలకు మంచి చేశాం. టీడీపీకి ఎందుకు అనుకూలంగా సర్వేలు వచ్చాయో వాళ్లు చెప్పగలరా? మరో రెండు రోజులు వారికి నచ్చిన అంకెలు చెప్పుకుంటూ ఆనందం పొందాలంటే పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment