అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
94–104 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ‘ఆరా’ మస్తాన్
50% ఓట్లతో 110–120 స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని చాణక్య పార్థదాస్ వెల్లడి
వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి, జన్మత్, ఆపరేషన్ చాణక్య, అగ్నివీర్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, రేస్ తదితర సంస్థలు
లోక్‌సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా సంస్థలు
వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్ట్‌లపై టీడీపీ ఒత్తిళ్లు
ఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్), చాణక్య (పార్థదాస్) తేల్చాయి. జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే, ఎగ్జిట్ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు.
49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్‌సీపీ, 10–12 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు.
సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు.
ఎన్‌డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్ లాబొరేటరీ, జన్మత్ పోల్, సీపీఎస్ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని క్యూ మెగా అమేజీ పొలిటికల్ సొల్యూషన్స్ సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ తెలిపారు. 22 పార్లమెంట్ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు
గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, ఎన్‌డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్‌ఎక్స్, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది.
ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు.
ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.
బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్‌డీటీవీ, న్యూస్–18 వంటి జాతీయ మీడియా సంస్థలు ఎన్‌డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్‌డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్‌డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment