
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. కూటమి నేతలు, కార్యకర్తల సమష్టి కృషి వల్లే ఈ విజయం దక్కిందన్నారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని, ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ వైఎస్ జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు.
భూమి మీద ఎవరూ శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలే శాశ్వతమన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో అందరికీ స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇంత చరిత్రాత్మక ఎన్నికలను తన జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండే వ్యక్తులు రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటు వేశారన్నారు. టీడీపీ, ఏపీ చరిత్రలో ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయని, 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని, వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఇంత విజయం చేకూరడానికి ప్రజలు అనుభవించిన బాధలే కారణమన్నారు.
గతంలో కుప్పం, సిద్ధిపేట పోటాపోటీ
ఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు లభించగా ఇందులో టీడీపీకి 45.60 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్‌సీపీకి 39.37 శాతం ఓట్లు దక్కాయన్నారు. గతంలో కుప్పం, సిద్ధిపేట మెజారిటీల్లో పోటీ పడేవని, ఇప్పుడు గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేల మెజారిటీలు దాటాయన్నారు.
పాలకులు కాదు సేవకులం
తాము పాలకులం అని కాకుండా సేవకులం అనే నినాదానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. సూపర్ 6, ప్రజాగళం మేనిఫెస్టో అంశాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమికి బీజం వేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. అసెంబ్లీలో తనను, తన కుటుంబ సభ్యులను అవమానించారని, కౌరవసభలో ఉండబోనని నాడు చెప్పానన్నారు. గౌరవ సభగా మార్చిన తర్వాతే మళ్లీ సభకు వస్తానని చెప్పానని, తన ప్రతిజ్ఞను ప్రజలు నిజం చేశారని తెలిపారు.
బలమైన తీర్పు
అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనాన్ని ప్రజలు క్షమించరనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. పాలకుడు ఎలా ఉండకూడదో... ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడో జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ అని విమర్శించారు. ప్రజలు చాలా సందర్భాల్లో చాలా మందిని ఓడించారని, జగన్ విషయంలో ఇక నువ్వు వద్దే వద్దు అని బలమైన తీర్పు ఇచ్చారన్నారు. తాము జాతీయ స్థాయిలో ఎన్డీయేతోనే ఉన్నామని, ఉంటామన్నారు. ఏమైనా మార్పు ఉంటే చెబుతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment