చంద్రబాబా.. మజాకా
హనుమంతరాయ చౌదరి రాజకీయ ప్రస్థానానికి ఫుల్‌స్టాప్
అంతా నాదే అనుకున్న వైకుంఠంకు చరమగీతం
బాబు రాజకీయ క్రీడలో జితేందర్‌గౌడ్ పరాజయం
బీసీ నేత నిమ్మలకు నమ్మక ద్రోహం
చంద్రబాబు రాజకీయ క్రీడలో బలైన నేతలు ఎందరో ఉన్నారు. ఆయన చరిత్ర చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం.. జెండా మోసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రతి ఎన్నికల సమయంలో తన స్వార్థ బుద్ధిని చాటుకున్న ఆయన.. ఈ ఎన్నికల్లోనూ తన నైజాన్ని చాటారు. జిల్లాకు చెందిన సీనియర్లకు శఠగోపం పెట్టారు. గత ఐదేళ్లూ వాడుకుని అర్ధంతరంగా తమను బలిపీఠం ఎక్కించడంతో వారంతా నైరాశ్యంలో మునిగిపోయారు. చివరి నిమిషం వరకూ టికెట్ ఆశచూపి ఆఖరున రూ.కోట్లకు పడగలెత్తిన వారికి పెద్దపీట వేయడంతో నాయకులు ఒక్కసారిగా కుదేలై పోయారు. బాబును నమ్ముకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని వాపోతున్నారు.
ఏళ్ల తరబడి పనిచేసినా ఫలితమేది?
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి రెండున్నర దశాబ్దాలుగా పార్టీకి కష్టపడి పనిచేశారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన కుమారుడు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేసినా ఆయన్ను దూరం పెట్టి కాంట్రాక్టర్ అమిలినేనికి సీటు ఇవ్వడంతో ఉన్నం రాజకీయ నిరుద్యోగి అయ్యారు. మరో నేత ఉమామహేశ్వరనాయుడుకూ మొండి చేయి చూపడంతో ఆయన చంద్రబాబును నమ్ముకోవడం సరికాదని, ఇక్కడ భవిష్యత్తు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జితేందర్ గౌడ్‌కూ మొండిచేయి
గుంతకల్లు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరామ్‌కు టికెట్ ఇవ్వడం జిల్లా మొత్తం బాబు నైజాన్ని చాటింది. మొన్నటివరకూ తిట్టిపోసిన గుమ్మనూరుకు టికెట్ ఇచ్చారు. దీంతో బాబు ఎంతటి మోసానికైనా సమర్థుడే అంటూ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు రాజకీయ క్రీడలో జితేందర్‌గౌడ్ పరాజయం పాలయ్యారని నియోజకవర్గం ప్రజలు భావిస్తున్నారు. గుమ్మనూరు చేరిక జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తోందని టీడీపీ కేడర్ భావిస్తోంది.
వైకుంఠం శకం ముగిసినట్టే..
రెండు దశాబ్దాలుగా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని భావిస్తున్నారు. పార్టీ అంతా నాదే అని భావించే ఆయనకు మొండిచేయి చూపి దగ్గుబాటి ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు. ప్రసాద్ రాక వెనుక భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు చర్చ జరుగుతోంది. దీంతో ప్రభాకర్ చౌదరి రాజకీయ శకం ముగిసినట్టేనని, చేసేదేమీ లేదని ఆయన వర్గం భావిస్తోంది.
నిమ్మలకు నమ్మక ద్రోహం..
ఓట్లకోసం కులం కావాలి.. డబ్బు కోసం కొత్త నేతలు కావాలి.. ఇదీ చంద్రబాబు తీరు. బీసీ వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో రెండు దఫాలు నిమ్మల ఎంపీగా చేశారు. అలాంటి వ్యక్తికి ఈ సారికి టికెట్ ఇవ్వలేదు. దీంతో చేనేత వర్గానికి చెందిన ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇక రాజకీయ శకం ముగిసినట్టేనని తెలుస్తోంది. చంద్రబాబుపై ఆయన కత్తులు నూరుతున్నారు.
త్రుటిలో తప్పించుకున్న ఆ ఇద్దరు..
మరో ఇద్దరు సీనియర్ నేతలు బాబు వెన్నుపోటునుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ఇద్దరే బీకే పార్థసార«థి, పల్లె రఘునాథరెడ్డి. చివరి వరకూ ఇద్దరికీ టికెట్లు లేవు. చివరన ఇక తప్పని స్థితిలో బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ సీటు ఇవ్వగా.. పల్లె రఘునాథరెడ్డి కోడలికి పుట్టపర్తి టికెట్ ఇచ్చారు. అయితే, ఈ ఇద్దరూ చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా చంద్రబాబు వలలో నుంచి బయటపడ్డారని పార్టీలోని నాయకులే అంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment