గెలుపు కోసం పనిచేసిన వారిని ఇబ్బంది పెట్టారు
ఓటమి కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టుకున్నారు
ఆ ఎమ్మెల్యేల వల్ల దూరంగా ఉన్న వారంతా హ్యాపీహ్యాపీ
సాక్షి, తిరుపతి: 'ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు... నవరత్నాలతో పేదల సంతోషాలు.. ఇవన్నీ ఆ నేతలకు కంటగింపుగా మారినట్టుంది. ప్రజారంజకంగా సాగుతున్న జగనన్న పాలనలో ఇమడలేకపోయారు. రాజకీయ అనుభవాలను రంగరించుకుని చెలరేగిపోయేందుకు కొందరు యత్నించి చతికిలపడ్డారు. మరికొందరు వైఎస్సార్సీపీ చరిష్మాతో కొత్తగా వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.
ప్రజాసేవను విస్మరించి కేవలం స్వార్థరాజకీయాల కోసమే పరితపించారు. తమకు గుర్తింపునిచ్చిన పార్టీని వీడాలని నిశ్చయించుకున్నారు. మేకవన్నె పులుల్లా తమ గెలుపునకు పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ద్రోహం చేస్తూ. ప్రత్యర్థి పార్టీలకు మంచి చేయడం ప్రారంభించారు. ఈ నాటకాలను గుర్తించిన అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఐదు గురు ఎమ్మెల్యేలను పక్కనబెట్టింది. దీంతో నిజమైన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పెనుభారమైన వారు బయటకెళ్లడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు.'
ఎలాంటి గుర్తింపూ లేని వారు కొందరికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలిచిమరీ టిక్కెట్లు ఇచ్చారు. గత రాజకీయ అనుభవాలు ఉన్న నేతలు మరింత ఎదగాలని, వారి అనుభవాలను పంచుకోవాలని చేయిపట్టుకుని నడిపారు. గత ఎన్నికల్లో అన్నీ తామై ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత ప్రజారంజక పాలన కోసం ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవ్వాలని సూచనలు చేశారు. అందుకోసమే గడపగడపకు మన ప్రభుత్వం, మీ ఊరికి మీ ఎమ్మె ల్యే.. అంటూ పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని ఆదేశాలు జారీచేశారు. ప్రతి నెలా అనేక సంక్షేమ కార్యక్రమాలు.. వారోత్సవాలకు సంసిద్ధం చేశారు.
అదేకోవలో కార్యకర్తలు, నేతలను కలపుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశాలు జారీచేశారు. తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల ఇబ్బందులు.. సమస్యలు.. సంక్షేమ పథకాలపై దిశానిర్దేశం చేశారు. కానీ అవేవీ ఆ నేతలకు చెవికెక్కలేదు. తమ స్వార్థ రాజకీయాల కోసం పక్క పార్టీల వైపు చూసి తప్పటడుగులు వేస్తున్నారు... ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, పూతలపట్టు, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అక్కడా తమకు సరైన గుర్తింపులేదని కొందరు.. ఎలాగైనా చక్రం తిప్పొచ్చని మరికొందరు ఊహాలోకాల్లో తేలుతున్నారు. ఇలాంటి నేతలు బయటకు వెళ్లడమే మంచిదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్వార్థం.. తప్పదు అజ్ఞాతం!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో 2019లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రజలకు సేవచేయలేక, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
తల్లిలాంటి పార్టీ దగ్గర ఛీకొట్టించుకుని ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకుల కాళ్లవేళ్లా పడుతున్నారు. వైఎస్సార్‌సీపీపై బురదజల్లేందుకు ఎదురుచూస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలు ముందుగా వారికి మాయమాటలు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై విమర్శలు చేయిస్తున్నారు. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు ఆ ఎమ్మెల్యేల ద్వారా పబ్బంగడుపుకున్నాక టికెట్ కేటాయింపు విషయంలో పేచీపెడుతున్నారు.
పొత్తులో భాగంగా బాబు, పవన్ ఒకరికి తెలియకుండా ఒకరు అన్నట్టు సీట్లు ప్రకటించేస్తున్నారు. మరికొన్ని చోట్ల కిమ్మకనకుండా నమ్మకద్రోహులైన ఎమ్మెల్యేలను మరింత దూరం పెడుతున్నారు. వారి అసలు రంగు బయటపడడంతో తప్పుచేశాం.. అని తన ముఖ్య అనుచరుల వద్ద కొందరు ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. మరికొందరు తమను నమ్ముకున్న ప్రజలకు ముఖం చూపించలేక అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు.
గుచ్చుకుంటున్న పక్కచూపులు!
ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నట్టు ప్రజారంజక పాలనలో ఇమడలేని నమ్మకద్రోహులైన ఎమ్మెల్యేలు మొదట టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో జనసేన అధినేతను కలిశారు. ఆ తర్వాత టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆనం మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ గురజాల మోహన్‌ను ప్రకటించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎలాగూ పార్టీ పొత్తులో భాగంగా జనసేనలో ఉంటే చక్రం తిప్పవచ్చన్న ఉద్దేశంతో ఆదివారం ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించమని వేడుకున్నట్టు తెలిసింది. ఎన్నికల తర్వాత అయినా పార్టీలో కీలక పదవి ఇప్పించమని ప్రాధేయపడినట్టు ప్రచారం జరుగుతోంది. నమ్మక ద్రోహులు వెళ్లిపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment