ఏపీలో వైఎస‍్సార్‌సీపీను ఓడించలేమన్న భావనకు వచ్చిన విపక్ష కూటమి ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయానికి బరి తెగిస్తోంది. బీజేపీని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిపోతూనే ఉన్నాయి. పట్టుమని పది అసెంబ్లీ సీట్లకు పోటీచేయని బీజేపీ పక్షాన ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల సంఘానికి పోలీసు అధికారులపై ఒక పెద్ద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న 22 మంది పోలీసు అధికారులపై ఈ ఫిర్యాదు ఉంది. అది చదివితే ఒక విషయం బోధ పడుతుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న నాటకం అని ఇట్టే అర్దం అయిపోతుంది.
బీజేపీ తాను పోటీచేస్తున్న ప్రాంతాలలో పోలీసు అధికారులు ఎవరైనా తప్పు చేస్తున్నారని సమాచారం ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లవచ్చు. అలాకాకుండా ఇంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారంటే ఇదంతా టీడీపీ కుట్రగానే కనిపిస్తుంది. ఇందులో విడ్డూరం ఏమిటంటే 'తమకు ఫలానా అధికారులు కావాలని అడగడం'. బహుశా దేశంలోనే ఇలా ఏ రాజకీయ పార్టీ కోరి ఉండరు. తాను నేరుగా ఫిర్యాదు చేస్తే పోలీసు వ్యవస్థ అంతా తమకు వ్యతిరేకం అవుతుందని, దాని వల్ల నష్టం ఏమైనా జరుగుతుందేమోనని అనుమానించిన చంద్రబాబు ఈ పనికి పురందేశ్వరిని పురమాయించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఏదైనా అప్రతిష్ట వచ్చినా పురందేశ్వరికే కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ అమలు చేశారని అనుకోవాలి.
ఎన్‌టీ రామారావు కుమార్తెగా ఉన్న పురందేశ్వరి ఆయనకు ప్రతిష్ట తీసుకురాకపోతే మానే.. ఆయన పరువు తీస్తున్న కూతురుగా ప్రసిద్దికెక్కుతున్నారు. 'ఒకప్పుడు చంద్రబాబుకు, పురందేశ్వరికి మధ్య ఏ మాత్రం పొసగేది కాదు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును పలుమార్లు చంద్రబాబు అవమానించారని ఆమె మదనపడేవారు. ఒక సందర్భంలో ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబును పలకరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదంటే ఆశ్చర్యం కాదు'. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఇలా రెండు కుటుంబాల మధ్య ఇంత ఆత్మీయత ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. పురందేశ్వరి తమకు జరిగిన అవమానాలు మర్చిపోయి తెలుగుదేశం ఎజెండా కోసం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే, ఆమె ఎంపీ పదవి కోసం ఎంత తహతహలాడుతున్నారో అర్ధం అవుతుంది.
2014లో కూడా బీజేపీ, జనసేన,టీడీపీ కలిసి పోటీచేశాయి. కానీ అప్పటికి చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజీ కుదరలేదు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి పురందేశ్వరిని తెలివిగా రాజంపేటలో పోటీచేయించారు. తద్వారా ఆమె అక్కడ ఓడిపోయేలా చేశారు. చాలాకాలం ఆ బాధ ఆమెలో ఉండేది. ఎప్పుడు రాజీపడ్డారో కానీ, చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో జైలులో ఉన్నప్పుడు లోకేష్‌ను పురందేశ్వరి వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్‌షా తో కలిపారు. అలాగే ఎన్‌టీ రామారావు గోల్డ్ కాయిన్ విడుదల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను పిలిచి, అక్కడ చంద్రబాబుతో మాట, మంతి కలిసేలా దగ్గుబాటి దంపతులు చేశారు. బీజేపీ అధిష్టానం పురందేశ్వరిని ఎందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేశారో తెలియదు కానీ, ఆమె అప్పటి నుంచి ఆ పార్టీని పూర్తిగా తెలుగుదేశంకు అనుకూలంగా మార్చివేశారు. చివరికి బీజేపీ ఇచ్చిన లోక్ సభ టిక్కెట్లు ఆరింటిలో ఐదు ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే దక్కడం విశేషం. ఒరిజినల్ బీజేపీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో తమ ఖర్మ అనుకుంటూ కాలం గడుపుతున్నారు.
ఈ విషయాలు పక్కనబెడితే పురందేశ్వరి రాసిన ఫిర్యాదును పరిశీలిస్తే, అందులో టీడీపీ అరాచకాలను అడ్డుకున్నవారి పేర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్‌లను బయటకు తెచ్చినవారి పేర్లే ఎక్కువగా కనిపించాయి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గంపై వ్యతిరేకతతో కూడా ఈ ఫిర్యాదు చేశారా అన్న అనుమానం వస్తుంది. టీడీపీ మీడియాలో వచ్చిన కథనంలో ఏమి రాశారో చూడండి..
'డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నుంచి ఎస్పీ ఆనందరెడ్డి వరకు అని పేర్కొనడంలోనే కుత్సిత స్వభావం కనిపిస్తుంది.వీరంతా వైసిపితో సంబంధాలు ఉన్నవారట. విపక్షాలను వేధిస్తున్నారట. వీరిని తప్పిస్తేకానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఈమె అంటున్నారు'. నిజానికి ఈ 22 మంది ఎవరో పురందేశ్వరికి తెలియకపోవచ్చు. వీరి పేర్లు చెప్పాలని ఆమెను అడిగితే చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకంటే కేవలం టీడీపీ రాసిన ఒక పత్రంపై ఆమె సంతకాలు చేసి ఎన్నికల సంఘానికి పంపి ఉండవచ్చనిపిస్తుంది. బహుశా టీడీపీ హయాంలో ఆనాటి ఇంటిలెజెన్స్ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు మాదిరే, అలాగే కొందరు ఎస్పీల మాదిరే ఇప్పుడు కూడా ఐపిఎస్ అధికారులు ఎవరైనా చేస్తారేమోనన్న అనుమానంతో టీడీపీ ఈ లేఖ రాయించి ఉంటుంది.
వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కార్యకలాపాలు కూడా పర్యవేక్షించేవారు. ఈ మాట అప్పట్లో టీడీపీ నేతలే చెప్పిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బహుశా టీడీపీ కూటమికి అవకాశం ఇస్తే అలాంటివారిని నియమించుకోవాలని భావిస్తున్నారేమో తెలియదు. ఈనాడు రామోజీరావు మరో అడుగు ముందుకేసి కొన్ని జిల్లాలలో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులకు కూడా పక్షపాత బుద్ధి ఆరోపిస్తూ పెద్ద స్టోరీ ఇచ్చేసింది. జర్నలిజం విలువలను దిగజార్చి టీడీపీకి నీచమైన రీతిలో మద్దతు ఇస్తున్న రామోజీనుంచి ఇంతకన్నా విలువలను ఆశించడం అత్యాశే అవుతుంది.
పురందేశ్వరి రాసిన లేఖలో డీజీపీపై ఆరోపణలు చేస్తూ, సీక్రెట్ ఫండ్‌ను సొంతానికి వాడుకున్నారని, సంబంధిత ఫైళ్లను ద్వంసం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవీ చూపకుండా ఇలా రాయడం ఎంత బాధ్యతారాహిత్యం! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు బాగా డబ్బులు తీసుకున్నారని పురందేశ్వరి ఆరోపణ. 'విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారట. ప్రధాని సభకు జనం రాకుండా చేశారట'. వీటిలో ఒక్కదానికైనా అర్ధం ఉందా? పిచ్చి ఆరోపణలు చేసి జనాన్ని మోసం చేయడం తప్ప.
చిత్తూరు ఎస్పీ జాషువా ఇటీవలే చిత్తూరు జిల్లాకు వెళ్లారు. ఆయనపై కూడా ఆరోపణ చేస్తూ కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెట్టుకున్నారని పురందేశ్వరి అంటున్నారు.. 'కుప్పంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఏవో అరాచకాలు చేశారట. వాటిని చూసిచూడనట్లు వ్యవహరించారట'. ఈ ఫిర్యాదు చూస్తే అసలు భయం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న అనుమానం వస్తుంది. 'పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా ప్రధాని సభకు జనం రాకుండా చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారట'. ఏమైనా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తారా? ప్రధాని సభకు వెళ్లేవారిపై జాగ్రత్తగా నిఘా పెట్టకపోతే ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. చెక్ పోస్టులు పెడితే మోడీ సభకు జనం రాకుండా ఉంటారా? ఇలాంటి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే, వాటిని నమ్మి ఎన్నికల కమిషన్ ఆయనను పక్కనబెట్టిందా? అందుకే అయితే కచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగుతోందన్న అభిప్రాయం కలుగుతుంది.
సీఐడీ అదనపు డీజీ సంజయ్‌పై కూడా ఆరోపణ చేశారు. 'ఆయన మీడియా సంస్థలను బెదిరిస్తున్నారట'. మార్గదర్శి అక్రమాలను బయటపెడితే అది మీడియాను బెదిరించడమా! చంద్రబాబును స్కిల్ స్కామ్‌లో అరెస్టు చేస్తే అది ఆయన చేసిన తప్పా! డిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారో, లేదో కానీ, అంతా కలిపి వంద కోట్ల స్కామ్‌లో ఈడి అరెస్టు చేసింది. ఆప్ మరో నేత మనీష్ సిసోడియా ఏడాదిగా జైలులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేశారు. అదంతా పద్ధతిగా జరిగినట్లు చెప్పే బీజేపీ ఏపీలో చంద్రబాబుపై వచ్చిన వందల, వేల కోట్ల రూపాయల విలువైన స్కామ్‌లను సమర్ధించడం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇలా తమ అడ్డగోలు పనులకు సహకరించని అధికారులను, టీడీపీ ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టిన అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికే పురందేశ్వరి ద్వారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తుంది. వీటన్నిటిని పరిశీలించారో, లేక బీజేపీ ఒత్తిడి పనిచేసిందో కానీ వీరిలో కొందరిని ఎన్నికల సంఘం బదిలీ చేసి వారిని సంతృప్తి పరచే యత్నం చేసింది. అయినా అది చాలలేదని, ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో ఆమె ఫిర్యాదు పేరుతో అందులోని అంశాలు అంటూ భారీ కథనం ఇచ్చారు. ఇదంతా కచ్చితంగా అధికారులను భయపెట్టి తమకు అనుకూలంగా లొంగదీసుకునే యత్నమే.
ఇక్కడ ఒక మాట చెప్పాలి. '2019లో చంద్రబాబు నియమించుకున్న పోలీసు అధికారులే జిల్లాలలోను, రాష్ట్ర స్థాయిలోను వివిధ బాధ్యతలలో ఉన్నారు కదా! వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్లింది కదా! అప్పుడేమో అధికారులంతా సుద్దపూసలని, ఇప్పుడేమో అవినీతి పరులని బురద చల్లడానికి టీడీపీ మీడియా యత్నించింది'. ఎవరైనా అధికారి తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. కానీ కేవలం ఒత్తిడులకు లొంగి ఐపీఎస్ అధికారులను పక్కనబెడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే అది వ్యవస్థకే చేటు తెస్తుంది. బ్లాక్ మెయిల్ చేసే రాజకీయనాయకులకు, మీడియాకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ కూటమి ఇంకెన్ని కుట్రలకు పాల్పడుతుందో చూడాలి.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment