ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎంను కిందపడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీవారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో, లేదో కానీ, దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదిగా కనిపిస్తుంది.
ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్ కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ కు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఎడిట్ చేసి తమకు అనుకూలమైన మేర ఎన్నికల కమిషన్ కు పంపడం, వెంటనే కమిషన్ స్పందించడం.. ఇవన్ని చూస్తుంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్లిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ ను విచారిస్తారా? లేదా? అనేది చూడాలి.
మే పదమూడో తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఎనిమిది రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియోలు లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా? కాదా? అనే దానిని దృవీకకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్ పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీలు జత కట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లితే కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా? లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా? అనే సందేహాలు వచ్చే అవకాశం ఉంది.
ఈవీఎంలను కిందపడేసి పాడు చేసే యత్నాలకు సంబంధించి అనే ఈ వీడియోలను ఈసీ అధికారికంగా విడుదల చేసి ఉండవచ్చు. అప్పుడు ఎమ్మెల్యే అయినా, మరొకరు అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా సెలెక్టివ్ గా వీడియో లీక్ కావడంలో ఆంత్యర్యం ఏమిటి? దానిని ఎవరైనా ఈసీ వర్గాల నుంచి తస్కరించి బయటపెట్టారా? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా? లేదా పిన్నెల్లి లాయర్ అనుమానించినట్లు అదేమైనా ఫేక్ వీడియోనా? అనేది తేలాలి.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబందిత పాల్వాయి గ్రామం వద్ద టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు శ్రద్ద చూపలేదట. ఈసీకి ఫిర్యాదు చేసినా వారు సీరియస్‌గా చర్య తీసుకోలేదు. అక్కడ వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కూడా తరిమేసి దొంగ ఓట్లను వేయించుకోవడం, బలహీనవర్గాలవారిని ఓటింగ్ కు రాకుండా భయపెట్టడం వంటి సంఘటనలు ఏమి చెబుతాయి! ఆ సమాచారం తెలిసిన పిన్నెల్లి అక్కడకు వెళ్లి ఆవేశపడి ఉండవచ్చు. కానీ దానివల్ల ఈవీఎం. ఏమీ పాడుకాలేదు. అక్కడ రీపోలింగ్ కూడా అధికారులు పెట్టలేదు. అలాంటటప్పుడు ఈవీఎం ద్వంసం అని ప్రచారం చేయడం అర్దరహితం. టీడీపీ వారు కూడా ఇలాగే మరో ఆరేడు, చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు.
ఆ ఘటనలలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీపై మాత్రం విపరీత ద్వేషపూరిత ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ద్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలన్నిటిని బహిరంగపరచి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్ ను కొట్టి బయటకు లాగడం, తదితర దృశ్యాలను కూడా విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.
తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీ పై ఆరోపణలు చేస్తూ సిఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించి ఇంటెలెజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీలు లేదని నానా రచ్చ చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడా ఫలానా అధికారి కావాలని కానీ, ఫలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు.
చంద్రబాబు మాదిరి గొడవలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటకాగడానికి విశ్వయత్నం చేసింది అందరికి అర్ధం అయిపోతోంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్టు అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ముప్పైసార్లు చార్జీషీట్ లో చంద్రబాబు పేరు వచ్చినా, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దానిని అంతటిని కుట్రగా ప్రచారం చేశారే కానీ, జరిగింది తప్పు అని చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.
అదే కాదు. కొద్ది నెలల క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద జరిగిన గొడవలలో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి.. కొట్టండి.. అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే, అదంతా పోలీసుల తప్పు గా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. పుంగనూరులో అయితే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేయడం, రాళ్లు విసరడం చేస్తే ఒక పోలీస్ కానీస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. అయినా ఈనాడు మీడియా పోలీసులదే తప్పన్నట్లు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం అక్రమం అనేట్లుగా దారుణ ప్రచారం చేసింది.
ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇవన్ని ఉదాహరణలే. అలాగే ఇతర చోట్ల ఈవీఎం లను కింద పడేస్తే టీడీపీ వారిపై పెట్టిన కేసులకు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసుల సెక్షన్‌లకు చాలా తేడా ఉందట. ఎమ్మెల్యేపై అతి కఠినమైన సెక్షన్‌లు పెట్టడం కూడా కుట్రగానే చూస్తున్నారు. హైకోర్టు ఈ కేసులో తాత్కాలిక స్టే ఇచ్చింది. అది వేరే విషయం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకపోలేదు. ఉదాహరణకు గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డిగా పేరొందారు. వేరేప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో బూత్‌ల వద్ద బాంబులు విసిరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి బాక్స్‌లలో నీళ్లు పోశారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన మద్దతుదారుడు ఒకరు ఏకంగా ఒక ఈవీఎం నే అపహరించుకుని వచ్చారన్న కేసు నమోదు అయింది.
గతంలో 1999 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణిస్తే, ఆయనపై కేసు విచారణే జరగకుండా చంద్రబాబు అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వాని ద్వారా మేనేజ్ చేయగలిగారు అప్పుడు ఆ కేసును బీజేపీ సహకారంతో కప్పిపుచ్చగలిగారు. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి చికాకు సృష్టిస్తున్నారు. తమకు కావల్సిన పోలీసు అదికారులను ఈసీ ద్వారా పోస్టు చేయించుకుని గందరగోళం చేస్తున్నారు. ఈసీ ఇంతగా దిగజారిపోవడం ఇటీవలికాలంలో ఇదే అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో అనేకం జరిగినా, బలహీనవర్గాలవారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పు అయినా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటు అయింది.
దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిదికాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంతదూరం అయినా వెళ్లి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్ధిపై పలు కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం జరుగుతోంది. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూత్‌ల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుందీ కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాలలో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీవారి అరాచకాలపైన అనే సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీనవర్గాలవారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందినవారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ముకాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్దం చేసుకోవచ్చు.
పిన్నెల్లి పరార్ అనే బ్యానర్ కథనాలు రాసే ఈ పెద్దలు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఎస్ గా ఉన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా అమెరికాకు పరారైతే మాత్రం సమర్థిస్తూ వార్తలు ఇస్తారు. చంద్రబాబుపై అవినీతి కేసు వస్తే నిర్లజ్జగా అది అక్రమ కేసు అని డబాయించడానికి రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం చూశాక, వారు ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. ఆ రోజుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తారా అని గగ్గోలు పెట్టిన ఈనాడు అర్జంట్ గా పిన్నెల్లిని తీసుకువెళ్లి జైలులో పెట్టాలని, ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని వీరే తీర్పు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందేవరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తప్పుడు వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు నుంచి ఇంతకన్నా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ఆశించడం తప్పే అనుకోవాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment