ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖలో ఏమి జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ కొద్దిమంది పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమిటి? ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఆ పోలీసులపై పెత్తనం చెలాయించడం ఏమిటి? గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎవరిపైన అయినా నిర్దిష్ట ఆరోపణలు వస్తే ఆ పోలీసు అధికారులను బదిలీ చేయడం సహజమే. ఇదేమి కొత్త విషయం కాదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వేరే అధికారులను నియమిస్తుంది. ఇక్కడే ఈసీ పెద్ద తప్పు చేసింది. ఏపీలో తెలుగుదేశం కూటమికి సాయం చేయడానికి నడుం కట్టినట్లు ఉంది. వెంటనే కూటమి నేతలు కొరుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను, కింది స్థాయి పోలీసు అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చేసింది. దాని ఫలితమే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి మొదలైన చోట్ల హింసాయుత ఘటనలకు అవకాశం ఏర్పడింది. చివరికి ఈసీ తాను నియమించిన కొందరు అధికారులనే సస్పెండ్ చేయవలసి వచ్చింది.
దాంతో ఈసీకి అప్రతిష్ట వచ్చింది. అయినా కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు మారినట్లు లేదు. ఇప్పటికీ టీడీపీ ట్రాప్‌లోనే కొనసాగుతూ వైఎస్సార్‌సీపీని ఇబ్బందిపెట్టాలని ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైకోర్టులో వెల్లడైన అంశాలు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను కిందపడేశారనో లేక ద్వంసం చేశారన్న కేసులో బెయిల్ పొందగానే, అంతకు ముందు జరిగిన ఘటనలలో పనికట్టుకుని ఈయనపై కేసులు పెట్టారట. అందులో సీఐపై దాడి వంటి కేసులు కూడా ఉన్నాయి. ఘటనలు జరిగి పది రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఏపీలో ఆ పోలీసు అధికారులకు మాత్రం ఆ ప్రశ్న రాలేదు.
ఎలాగైనా పిన్నెల్లిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి ఆయనను కౌంటింగ్ వద్దకు రాకుండా చేయాలన్నది వారి కుట్ర అట. లేకుంటే డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పిన్నెల్లిపై ఈ నెల 22 న కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిన్నెల్లి న్యాయవాదులు కింది కోర్టులో ఉన్న సంబంధిత డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఈ నెల 23న అంటే ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ రాగానే కొత్త కేసులు పెట్టారని హైకోర్టుకు చూపించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి కేసులో బెయిల్ పొందారు. ఇక్కడ అందుకు బిన్నంగా పోలీసులే తప్పుడు సమాచారం ఇచ్చి ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్టు చేయాలని తలపెట్టారు. ఇది సిగ్గు చేటైన విషయం. ఇదంతా పిన్నెల్లిపై కక్షతో ఉద్దేశపూరితంగానే తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.
ఒక సీఐ స్థాయి అధికారి ప్రైవేటు లాయర్‌ను పెట్టుకోవడం ఏమిటో తెలియదు. నిజానికి ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడుల కేసులలో ప్రభుత్వమే లాయర్లను పెడుతుంది. లేదా నిర్దిష్ట అనుమతి తీసుకుని వ్యక్తిగత లాయర్లను నియమించుకోవచ్చు. అలాకాకుండా నేరుగా ఇలా చేశారంటే ఆ సీఐని ఏమనుకోవాలి. ఆయన వెనుక మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చిత్రమేమిటంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఈసీ, అధికార వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. చివరికి ఒక సీఐ స్థాయి అధికారి తప్పుడు కేసులు పెడుతుంటే వైఎస్సార్‌సీపీ నిస్సహాయంగా మిగిలిపోవడం. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రిఫరీ మాదిరిగా కాకుండా, కూటమిలో బాగస్వామిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి.
పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో అత్యంత నిష్పక్షపాతంగా ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. 2009 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎస్.ఎస్.పి యాదవ్ అనే అధికారి డీజీపీగా ఉన్నారు. ఆయనపై విపక్షం ఆరోపణలు చేస్తే ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత ఎ.కె మహంతి అనే సీనియర్ అధికారిని డీజీపీగా నియమించింది. ఆయన నిజాయితీగా తన సేవలు అందించారు. దాంతో ఏ పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈసీ తీరే అభ్యంతరకరంగా ఉంటే, ఈసీ నియమించిన తాత్కాలిక అధికారులు మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే తమ పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా కొద్ది మంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారి తెంపరితనాన్ని సూచిస్తుంది.
డీజీపీగా వచ్చిన హరీష్ గుప్తపై తొలుత ఆరోపణలు రాలేదు. కానీ ఎవరి ఒత్తిడికి లొంగారో కానీ పిన్నెల్లిని అరెస్టు చేయడం కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. హైకోర్టు సీరియస్ గా తీసుకుంటే ఇలా చేసిన పోలీసులకు ఇక్కట్లు తప్పవు. 2009 లో ఏ అధికారిని మార్చినా వైస్ రాజశేఖరరెడ్డి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అదే మాదిరి వ్యవహరిస్తూ ఏ అధికారిని మార్చి, ఎవరిని పెట్టుకున్నా ప్రత్యేకించి స్పందించకపోవడం విశేషం.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత రచ్చ చేసింది అందరికి తెలుసు. కేవలం టీడీపీ కూటమికి సాయపడడం కోసం ఈ అధికారులు తమ కెరీర్ ను దెబ్బతీసుకుంటున్నారనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంను కింద పడేసిన ఘటనకు సంబంధించి ఈసీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఎడిట్ అయి టీడీపీ నేత లోకేష్ వద్దకు చేరడం, దానిని ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టడం, కేవలం దానిపై ఆధారపడి ఈసీ పిన్నెల్లిపై కేసు పెట్టాలని నిర్ణయించడం వివాదాస్పదం అయింది. అదే టైమ్ లో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్ నుంచి టీడీపీ వారు బయటకు తోసేసి దౌర్జన్యం చేసిన వీడియోలను వైఎస్సార్‌సీపీవారు ఈసీకి పంపినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది.
మరో సంగతి చెప్పాలి. టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి, ప్రభాకరరెడ్డిలు వేర్వేరు కేసుల్లో చిక్కి పోలీసులకు దొరకకుండా పారిపోతే కనీసం ఒక్క ముక్క రాయని ఎల్లో మీడియా, పిన్నెల్లిపై మాత్రం కక్ష కట్టి పరార్ అంటూ పెద్ద, పెద్ద కథనాలు వండి వార్చింది. అంతేకాదు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేకుండా ఈసీ వారిని బదిలీ చేయడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడు వంటి పత్రికలు మరీ అథమ స్థాయికి దిగజారి డీజీపీని బదిలీ చేసినా, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదంటూ పెద్ద, పెద్ద స్టోరీలు అల్లింది. అంటే ఈయనను కూడా తొలగిస్తే కౌంటింగ్ సమయంలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్నది టీడీపీ, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి భావన కావచ్చు.
రాధాకృష్ణ తీరు మరీ విడ్డూరం. ఆయనేమో రాజకీయ రొచ్చులో, అవినీతి బురదలో నిండా మునిగి ఉంటారు. జవహర్ రెడ్డి వంటి అధికారులపై మరకలు పూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారట. జగన్ దగ్గరకు వచ్చాకే పాడయ్యారట. ఇంత చెత్తగా వార్తలు రాసే ఆంద్రజ్యోతిని ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ సమయంలో జవహర్‌ను తప్పించి తమకు కావల్సిన అధికారిని ఎవరినైనా పెట్టించుకుని అవకతవకలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఉన్నారేమో తెలియదు కానీ, చెత్త వార్తలు రాయడానికి పోటీపడుతున్నారు. జవహర్ రెడ్డి బదిలీ ఒక్క విషయాన్ని మాత్రం ఈసీ ఇంకా అంగీకరించలేదు. దాంతో ఈనాడు, ఇతర ఎల్లో మీడియా జవహర్ రెడ్డి పై కక్ష కట్టి చోటా, మోటా నేతలతో ఆయన మీద ఆరోపణలు చేయించి, వాటిని తమ మీడియాలో పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నాయి. బహుశా గతంలో ఇంత నీచమైన రాజకీయం, జర్నలిజం చూడలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే మాదిరి ఉండవు. ఆ సంగతి మరిచి విర్రవీగితే వారికే నష్టం.
మరో సంగతి చెప్పాలి. పోస్టల్ బాలెట్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశం అంతటికి ఇచ్చిన గైడ్ లైన్స్ ను కాదని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి మీనా కొత్త ఆదేశం ఇవ్వడం వివాదం అయింది. మీనా తప్పును సరిచేసుకోకపోతే ఆయనపై కూడా సందేహాలు వస్తాయి. గతంలో 2009లో ఎన్నికలు ఫలితాలు వచ్చి మరోసారి ప్రభుత్వం రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి ఎస్.ఎస్.పీ యాదవ్ ను డీజీపీగా నియమించారు. ఇప్పుడు కూడా తనపై ద్వేషంతో టీడీపీ కూటమి బదిలీ చేయించిన అధికారులందరిని తిరిగి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ పదవులలోకి తీసుకుంటారన్నది కూడా నిజం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment