‘పోలవరం’ పనుల్లో సంక్షోభం.. బాబు తప్పిదం వల్లే..: అంబటి రాంబాబు | YSRCP Leader Ambati Rambabu Reacts On Chandrababu Naidu Comments On Polavaram Project | Sakshi
Sakshi News home page

‘పోలవరం’ పనుల్లో సంక్షోభం.. బాబు తప్పిదం వల్లే..: అంబటి రాంబాబు

Published Wed, Jun 19 2024 4:49 AM | Last Updated on Wed, Jun 19 2024 11:18 AM

చంద్రబాబు తప్పిదాలను మీడియాకు వివరిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు తప్పిదాలను మీడియాకు వివరిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు

మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

స్పిల్‌ వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండానే డయాఫ్రమ్‌ వాల్‌ను నాటి టీడీపీ సర్కార్‌ పూర్తిచేసింది

కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఖాళీలు వదిలేయడంతో వరద ఉద్ధృతికి 2019లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌

స్పిల్‌ వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు మేమే పూర్తిచేశాం

స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, క్రిటికల్‌ నిర్మాణాలు కూడా పూర్తిచేసి గేట్లన్నీ పెట్టాం

ఎంత వరద వచ్చినా ఆపరేట్‌ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్లాం 

తప్పులు ఒప్పుకుని ప్రాజెక్టు పూర్తిపై చంద్రబాబు దృష్టిపెట్టాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య అధి కారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదంవల్లే పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుందని.. పనుల జాప్యానికి ఆయనే కారణమని మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సోమ వారం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలన్నీ పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలన్నారు. పోలవరం పర్యటన సందర్భంగా ఆయన చేసిన తప్పులను గుర్తుచేసుకోకుండా.. వైఎస్‌ జగన్‌పై  బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. 

ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషిచేశారని.. స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేసి గోదావరి వరద ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారని గుర్తుచేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకుని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అంబటి  చంద్రబాబుకు హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

వాస్తవాలు అవాస్తవాలు అవుతాయా..?
ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే సోమవారం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఆయనచేసిన తప్పులన్నీ వైఎస్‌ జగన్‌పై నెట్టేందుకు యత్నించారు. కానీ, పోలవరం పూర్తిచేయాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారంటూ బాబు వెల్లడించారు. పోలవరంలో విధ్వంసానికి వైఎస్‌ జగనే కారణమని ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి.. 2019కి ముందు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం విషయంలో సంక్షోభం వచ్చింది. 

ప్రాజెక్టు నిర్మాణంలో బాబు వ్యూహాత్మక, చారిత్రక తప్పిదాలే ఈ పరిస్థితికి దారితీశాయి. ముందుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, తర్వాత ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టడమే దీనికి ప్రధాన కారణం. డయాఫ్రం వాల్‌తో పాటు ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు సమాంతరంగా చేపట్టారు. జర్మనీకి చెందిన బావర్‌ సంస్థ డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తిచేసి రూ.460 కోట్లు బిల్లులు తీసుకుంది. చివరకు కాఫర్‌ డ్యాంల మధ్య ఖాళీలు ఉంచేయడంతో వరదలకు డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది. 

ఇదీ వాస్తవం. దీన్ని దాచిపెట్టి, కాంట్రాక్టర్‌ను మార్చడంవల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందన్నట్లుగా చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారు. అంతేకాక.. ఇటు స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాం పూర్తిచేయకపోడం, గోదావరి నదిని డైవర్షన్‌ చేయకపోవడంవల్ల 54 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొన్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వీటికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన తప్పులను వైఎస్‌ జగన్‌ పైకి నెట్టేసి పబ్బం గడుపుకుందామనుకుంటున్నారా చంద్రబాబూ? పోలవరంలో జరిగిన అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ఇరిగేషన్‌ మీద అవగాహన ఉన్న వాళ్లు అర్థంచేసుకోవాలి.

ఐదేళ్లలో పూర్తిచేస్తామని చెప్పలేకపోతున్నారు..
నిజానికి.. చంద్రబాబువల్లే ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యానికి చంద్రబాబే కారణం. చివరకు.. ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చినా సరే ఐదేళ్లలో పూర్తిచేస్తామనే మాట చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. 2019కి ముందు చంద్రబాబు  అశాస్త్రీయంగా ఆలోచించడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది.. అప్పట్లో సొంత తెలివితేటలు ఉపయోగించడంవల్ల ఆయన అనేక తప్పులు చేశారు. ఇవాళ వైఎస్‌ జగన్‌ మీద విరుచుకుపడడం అన్యాయం.

శరవేగంగా పనులు చేసింది వైఎస్‌ జగనే..
ఇక దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలన్న దానిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికీ నిర్ధిష్టమైన నిర్ణయానికి రాలేదు. ప్రాజెక్టులో 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెబుతుండటం విడ్డూరం. ఎందుకంటే..
– మేం కట్టిన పోలవరం స్పిల్‌వే మీద చంద్రబాబు ప్రయాణించారని తెలుసుకోవాలి. మేమే రెండు కాఫర్‌ డ్యాంలు పూర్తిచేశాం. 
– అలాగే, గోదావరి నదిని పూర్తిగా స్పిల్‌వే మీదుగా డైవర్షన్‌ చేశాం. 
– స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్‌ కూడా పూర్తిచేశాం. 
– ఇవికాక క్రిటికల్‌ నిర్మాణాలు పూర్తిచేసి, గేట్లన్నీ పెట్టి ప్రస్తుతం ఎంత వరద వచ్చినా ఆపరేట్‌ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్లాం. 
– కానీ, చంద్రబాబు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేస్తున్నాడు.

జగన్‌ ఏ తప్పూ చేయలేదు..
మరోవైపు.. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్తానంటున్నారు. వైఎస్‌ జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నారు. కాబట్టి దీన్ని కూలంకషంగా ప్రజలు అర్థంచేసుకోవాలి. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. పోలవరం పనుల్లో జగన్‌ ఎలాంటి తప్పుచేయలేదు. శరవేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్లే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. నాలుగేళ్లకు పూర్తవుతుందా? ఐదేళ్లకు పూర్తవుతుందా? అనే అంశాన్ని అపర మేధావినని, చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం.. ఆయన ప్రభుత్వం చేసిన తప్పిదం తప్ప మరొకటి కాదు. బాబు హయాంలో జరిగిన విధ్వంసంవల్ల ప్రతి తెలుగువాడూ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయలేదు. చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోవాలి.

‘హోదా’ తీసుకురాకపోతే ద్రోహిగా మిగిలిపోతారు..
చంద్రబాబుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కూటమిని గెలిపించారు. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. చంద్రబాబు చాలా లక్కీ. ఆంధ్రప్రదేశ్‌కు కూడా లక్కీయే. ఇలాంటి పరిస్థితి రావాలని వైఎస్‌ జగన్‌ చాలాసార్లు కోరుకున్నారు. ఆయనకు రాని అవకాశం టీడీపీకి వచ్చింది. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు అవసరంలేదు. 

మీ చేతిలో పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదాను తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోయండని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోలేకపోతే రాష్ట్రానికి చంద్రబాబులాంటి ద్రోహి ఎవరూ ఉండరని మనవి చేస్తున్నా. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటివన్నీ వదిలేసి వైఎస్‌ జగన్‌ను రోజూ తిట్టుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు బాబూ?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement