గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
కఠిన చర్యలు తీసుకోండి.. గవర్నర్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ
సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు
పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ విస్మయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారం చేపట్టక ముందే టీడీపీ, జనసేన నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైఎస్సార్ సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విన్నవించారు. ఈమేరకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ తనూజ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీ కేశినేని నాని, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి గవర్నర్‌కు గురువారం వినతిపత్రం అందచేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
ఓట్ల లెక్కింపు అనంతరం బిహార్ తరహాలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు చెప్పారు. టీడీపీ మూకలు ఎన్నికల రోజు మధ్యాహ్నం నుంచే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లపై దాడులకు తెగబడి పలు చోట్ల గృహ దహనాలు, ఆస్తులను ధ్వంసం చేశాయన్నారు. మహిళలు, పిల్లలను సైతం హింసించి భయ భ్రాంతులకు గురి చేశాయని తెలిపారు. టీడీపీ, జనసేన విధ్వంస కాండకు సంబంధించి వీడియో, ఫొటో ఆధారాలను పరిశీలించి విస్తుపోయిన గవర్నర్.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచారన్నారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కళ్ల ముందే దాడి జరిగినా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు వెల్లడించారు. నూజివీడులో కౌన్సిలర్‌పై పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడి జరగటాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. ఈ ఘటనలపై డీజీపీతో చర్చించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు.
పర్యవసానాలు తప్పవు
వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకున్న వారిపై దాడులు చేసేందుకే అధికారంలోకి వచ్చారా? అని టీడీపీ నేతలను పేర్ని నాని ప్రశ్నించారు. ఎర్ర పుస్తకం పేరుతో హింసకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కూటమి నాయకులకు సూచించారు. చంద్రబాబు ఒత్తిడితో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దాడులను ఆపకుంటే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు.
కార్యకర్తలను కాపాడుకునేందుకు కమిటీలు, లీగల్ టీమ్స్
రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకునేందుకు 26 జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక కమిటీలను వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసినట్లు పేర్ని నాని వెల్లడించారు. బాధితులను పరామర్శించడంతో పాటు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ హింసాకాండను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. 26 జిల్లాలో ఏర్పాటైన లీగల్ టీమ్‌లు బాధితులకు అండగా నిలుస్తాయని, శుక్రవారం నుంచి చురుగ్గా పని చేస్తాయని తెలిపారు. కింది స్థాయి పోలీసులు కేసులు నమోదు చేయకుంటే ఎస్పీలను కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment